2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్‌ | Crimes against minors rise in 2018 | Sakshi
Sakshi News home page

2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్‌

Published Sat, Jan 18 2020 5:32 AM | Last Updated on Sat, Jan 18 2020 8:09 AM

Crimes against minors rise in 2018 - Sakshi

సాక్షి, అమరావతి: 2018.. రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగిన ఏడాది ఇది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)–2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం...  2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు.   

 ఎన్‌సీఆర్‌బీ–2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు  
- ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్‌ కేసు నమోదైంది.   
వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది  బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్‌ అండర్‌ ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌(ప్రివెన్షన్‌) యాక్ట్‌–1956 కింద 14 కేసులు నమోదు చేశారు.  
19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. 
జువైనల్‌ జస్టిస్‌(కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) యాక్ట్‌ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు.   
ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్‌) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగాఉన్నారు. 
2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు.  
చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి  
‘‘బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు’’  
– ఎన్‌.రామ్మోహన్, ‘హెల్ప్‌’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement