సాక్షి, అమరావతి: ‘ఆయన వస్తున్నాడు.. మహిళలు, బాలికల రక్షణకు భరోసా తెస్తున్నాడు’ 2014 ఎన్నికల ముందు ఏ టీవీ చానల్ తిప్పినా కనిపించిన టీడీపీ ఎన్నికల ప్రచార ప్రకటన ఇది. ఆయన అధికారంలోకి వచ్చాడు.. ఐదేళ్లు పాలించి వెళ్లాడు. ప్రచార ప్రకటనకు భిన్నంగా మహిళలను అవమానించి వెళ్లాడు. ఇదే విషయాన్ని నేర నమోదు గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలు నిగ్గు తేల్చాయి. తాజాగా విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ–2018 నివేదిక సైతం ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్పింది. ఎన్‌సీఆర్‌బీ 2016 నుంచి వరుసగా 2018 వరకు విడుదల చేసిన నివేదికల్లో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వారిని కించపర్చడం వంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లోనే ఉండటం గమనార్హం. 2018లోనూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘటనలు దేశంలో 6,992 జరగ్గా.. ఏపీలో 1,802 కేసులు నమోదై మొదటి స్థానంలో నిలిచింది.
నిత్యం ఆర్తనాదాలే..
చంద్రబాబు జమానాలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. సర్పంచ్ నుంచి గ్రామ పార్టీ సభ్యుడి వరకు మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. వాటిలో ఉదాహరణకు కొన్ని..
- కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై 2015 జూలై 8న టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినా అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
- చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జూనియర్ డాక్టర్ శిల్పకు జరిగిన అన్యాయంపై అప్పటి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెంది 2018 ఆగస్టులో 7న ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప మరణానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థి లోకం, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీ చదివిన శిల్ప తనను వేధిస్తున్నారంటూ 2017 ఏప్రిల్‌లో ఈ మెయిల్ ద్వారా గవర్నర్ నరసింహన్, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో శిల్ప ప్రాణత్యాగం చేసింది.
- ఫ్రొఫెసర్ వేధింçపుల కారణంగా గుంటూరులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్త›ంగా కలకలం రేపింది. గైనిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వీఏఏ లక్ష్మి వేధింపుల కారణంగా 2016 అక్టోబర్ 24న మెడికో (గైనిక్ పీజీ) బాల సంధ్యారాణి బలవన్మరణానికి పాల్పడింది.ఈ కేసులో నిందితుల్ని కాపాడేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలున్నాయి.
- నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా తెలంగాణకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు దోషుల్ని కాపాడేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.
- అనంతపురం జిల్లా జల్లిపల్లిలో గతేడాది ఫిబ్రవరి 1న సుధమ్మ అనే మహిళపై టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర దాడి చేసి దారుణంగా కొట్టారు. సర్పంచ్ నాగరాజు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుయాయుడు కావడంతో తొలుత స్పందించని పోలీసులు ఆ తరువాత అల్లరి కావడంతో నాగరాజుపై రౌడీషీట్ తెరుస్తున్నట్టు ప్రకటించారు.
- విజయవాడలో టీడీపీ నేతల దన్నుతో సాగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం 2015 డిసెంబర్‌లో గుప్పుమంది.అప్పులిచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు వారిని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ ముఠాకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నది టీడీపీ ప్రజా ప్రతినిధులేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులపై సకాలంలో చట్టపరమైన చర్యలు లేకుండా ఒత్తిళ్లు తెచ్చారు.
- 2018లో ఏపీలో నేరాల నమోదు కొంత తగ్గినప్పటికీ.. మహిళలపై నేరాల జోరు మాత్రం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment