విక్టర్ మావయ్య.. మా ఇంటి పెద్ద. ఓ రోజు ఆయన ఇంటికి తిరిగిరాకపోవడంతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాం. తర్వాత ఆయన అఫ్జల్ గంజ్ ఏరియాలో చనిపోయాడని తెలిసి.. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాం. మృతదేహం వివరాలేమీ ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎస్సై, సీఐ పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకూ వినతిపత్రాలు ఇచ్చాం. విక్టర్ మృతదేహాన్ని ఏం చేశారన్నది ఎవరూ చెప్పలేదు. అయితే అనాథ శవమని చెప్పి మెదక్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి తరలించారని ఆ తర్వాత తెలిసి కుమిలిపోయాం. అందరం ఉన్నా అనాథలా మరణించడం, కడసారి చూపు కూడా దక్కకపోవడం ఘోరం. మా అత్తయ్య మానసిక స్థితి దిగజారి మంచం పట్టింది. ఇలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదు. – హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన లత ఆవేదన ఇది
మా అన్న ఖాజా అంటే మాకెంతో ఇష్టం. ఉన్నట్టుండి ఓ రోజు ఆచూకీ లేకుండా పోయాడు. హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ గాలించాం. చివరికి బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. మార్చురీల్లో వెతకాలని కొందరు చెప్పారు. ఆ ఆలోచనే మాకు మింగుడుపడలేదు. గుండె రాయి చేసుకుని మార్చురీల్లో వెతికాం. ఉస్మానియాలో కుప్పలా వేసిన శవాలను చూపించి వెతుక్కొమ్మన్నారు. అది చూడగానే భయపడ్డాం. అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్ దగ్గరున్న ఫొటోల్లో మా అన్నయ్యను చూసి కూలబడిపోయాం. ఖాజా అన్న మృతదేహం మంగళ్‌హాట్ పీఎస్ నుంచి వచ్చిందని చెప్పడంతో.. అక్కడికి వెళ్లి, ఎఫ్‌ఐఆర్, పంచనామా రిపోర్టులు తీసుకున్నాం. కానీ మరో పది శవాలతో కలిపి మా అన్న మృతదేహాన్ని దహనం చేశారని తెలిసి బాధపడ్డాం. వెళ్లి బూడిద తెచ్చుకో అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అనాథ శవమైతేనేం.. మా అన్న ముస్లిం అని తెలుసుకదా.. అంతిమ సంస్కారంలో మతాచారాలు పాటించరా?
–హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన నజ్మా సూటి ప్రశ్న ఇది..
అనిల్ కుమార్ భాషబోయిన
అన్‌క్లెయిమ్‌డ్ డెడ్ బాడీస్.. ఏదో ఓ పనిమీద బయటికెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్నవారు.. గుర్తింపులో నిర్లక్ష్యంతో అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఏ మనిషికైనా మరణానంతరం దక్కే ఆఖరి గౌరవమైన అంతిమ సంస్కారం లేకుండానే దహనమైపోతున్నారు. తమ వారంటూ ఎందరో ఉన్నవారు కూడా నాలుగైదు శవాలతో కలిసి ఒకే చితిపై కాలిపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇదొక కోణమైతే.. మరో కోణం.. కొందరి మృతదేహాలు మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు అక్రమంగా తరలిపోతున్నాయి. కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది మృతదేహానికి ఇంతని రేటు కట్టి అమ్ముకుంటున్నారు. అసలు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏమైందని తేల్చే పోస్టుమార్టం కూడా చెయ్యకుండా తరలించేస్తున్నారు. ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వారి కుటుంబాలు తమవారి ఆచూకీ తెలియక, చనిపోయాడని తెలిసినా మృతదేహాలైనా లభించక, కడసారి చూపునకూ నోచుకోక కుమిలిపోతున్నాయి. ఇది ఒక్క లత, నజ్మాల వ్యథ కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లతలు, నజ్మాలు ఎందరో..
రోజుకు 40 మంది మిస్సింగ్..
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రిపోర్టు ప్రకారం.. మనదేశంలో సగటున ప్రతీ పది నిమిషాలకు ఒకరు తప్పిపోతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే.. రోజుకు 40 దాకా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం.. మన రాష్ట్రంలో 2018లో జాడలేకుండా పోయినవారి సంఖ్య 5,992. 2019లో మొత్తం మిస్సింగ్ 17,150 మంది. ఇందులో 4,566 మంది పిల్లలు. 2019 చివరి నాటికి మొత్తంగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు 23,142. నిజానికి మన రాష్ట్రం ఇలాంటి కేసుల రికవరీ రేటులో దేశంలోనే టాప్–5లో ఉంది. మిస్సింగ్ కేసుల్లో తిరిగి దొరుకుతున్న వారు 83 శాతంపైనే. కానీ మిగతా 17 శాతం మందిలో ఎందరు ఇంకా దొరకలేదు, ఎందరు మరణించారన్న వివరాలు తెలిపేందుకు సరైన వెబ్‌సైట్ లేకపోవడం ఆందోళనకరం. ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది.
ఏం చేస్తున్నారు?
ప్లాన్1
మార్చురీకి వచ్చిన అనాథ శవాల్లో బాగున్నవాటిని వైద్యులు, సిబ్బంది గుర్తిస్తారు. మృతదేహం పాడైపోకుండా రసాయనాలు (ఎంబామింగ్) పూస్తారు. వాటిని అనాథ శవాలను భద్రపరిచే గది (ఫఫ్ రూం)లో కాకుండా.. ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచుతారు. ఆ మృతదేహానికి సంబంధించి ఎవరైనా వచ్చారా, గుర్తుపట్టారా, అనాథ శవంగానే ఉందా అన్న వివరాలను పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకుంటారు. తర్వాత అనాథ శవంగా కన్ఫర్మ్ చేసి, పోస్టుమార్టం చేసినట్టుగా రికార్డు చేస్తారు. సాధారణంగా వారం పదిరోజులకోసారి మార్చురీల్లో పోగైన అనాథ శవాలను జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అప్పగించి, అంత్యక్రియలు చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజీ కోసం దాచిన మృతదేహాన్ని కూడా అప్పగిస్తారు. మార్గమధ్యలోనే జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కొంత సొమ్ము ముట్టజెప్పి సదరు మృతదేహాన్ని దొంగతనంగా మరో అంబులెన్స్‌లో మెడికల్ కాలేజీకి తరలించేస్తారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మిగతా మృతదేహాలతోపాటు దీనిని దహనం చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసేస్తారు. సొమ్ము చేతులు మారుతుంది.
ప్లాన్2
మార్చురీలో పెట్టిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపడితే మరోరకంగా గాలం వేస్తారు. ఏజెంట్లు, మార్చురీ సిబ్బంది సదరు కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తారు. వారు పేదలని తేలితే రంగంలోకి దిగుతారు. దహన సంస్కారాలు, క్రతువులకు వేల రూపాయలు ఖర్చవుతాయని.. కావాలంటే ఓ సలహా ఇస్తామని అంటారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తామని.. జీహెచ్‌ఎంసీతోగానీ, స్వచ్ఛంద సంస్థలతోగానీ అంత్యక్రియలు చేయిస్తామని ప్రలోభపెడతారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల వారు కాస్త ఆర్థిక సాయం చేస్తారంటూ గాలం వేస్తారు. ఫ్యామిలీ ఒప్పుకోగానే.. ఏదో శ్మశాన వాటికకు తరలించి, అంత్యక్రియలు చేయించినట్టు హడావుడి చేస్తారు. ఈ మేరకు తప్పుడు పత్రాలు సృష్టించి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. కానీ ఆ మృతదేహాన్ని అక్రమంగా ఏదో మెడికల్ కాలేజీకి అమ్మేస్తారు.
బాడీ చితికిపోతే డెంటల్,కంటి వైద్య కాలేజీలకు..
రైలు, బస్సు లేదా ఇతర రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డెడ్ బాడీలు బాగా చితికిపోతాయి. వాటిలో తల భాగం దెబ్బతినకుండా ఉంటే విడిగా ఉంచుతారు. పోస్టుమార్టం నిర్వహించామని చెప్పి దహనం చేసేస్తారు. అంతకుముందే ఆ శరీరం నుంచి తలను వేరు చేస్తారు. పాడైపోకుండా రసాయనాలు నింపిన ఓ ప్రత్యేక బాక్సులో పెట్టి.. డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలున్న మెడికల్ కాలేజీలకు చేరవేస్తారు. ప్రొఫెసర్లు ఆ తలలతో దంత వైద్యం, కంటి వైద్యం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు.
మహిళల మృతదేహాలకు డిమాండ్
సాధారణంగా ఆడవాళ్లు ఆస్పత్రులకు ఒంటరిగా రావడం, బయట ఒంటరిగా జీవించడం వంటివి చాలా తక్కువ. అనాథ స్థితిలో ఆడ మృతదేహాలు ఉండటం కూడా తక్కువే. అయితే మెడికల్ కాలేజీల్లో గైనకాలజీ విద్యార్థులకు మహిళల శరీరంపై అనాటమీ క్లాసులు నిర్వహించడం చాలా కీలకం. అందుకే మహిళల మృతదేహాల కోసం కాలేజీలు ఎక్కువ సొమ్ము చెల్లిస్తాయి.మగవారి మృతదేహానికి అయితే రూ.5 లక్షల వరకు, ఆడవాళ్ల మృతదేహానికి రూ.20 లక్షల దాకా చెల్లిస్తున్నారు.
ఈ నిబంధనలు పాటించడం లేదు!
1. ఎవరూ క్లెయిమ్ చెయ్యని డెడ్‌బాడీల విషయంగా వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోలీసు, వైద్యాధికారులు పలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. సీఆర్పీసీ 174 సెక్షన్ ప్రకారం.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశాకే మార్చురీకి పంపాలి.
2. డెడ్ బాడీ ఫొటోలు, వేలిముద్రలు, డీఎన్‌ఏ, విస్రా తదితరాలు సేకరించి భద్రపరచాలి.
3. బంధువులు గుర్తించేందుకు వీలుగా మూడు రోజులపాటు మృతుల ఫొటో, గుర్తులు, ఇతర వివరాలు మీడియా సంస్థలకు పంపాలి.
4. అప్పటికీ ఎవరూ రాకపోతే పోస్టుమార్టం నిర్వహించాలి. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్కనే ఉండాలి.
కానీ అనాథ శవాల విషయంలో ఇవేమీ జరగడం లేదు. డబ్బుకు కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు, పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోస్టుమార్టం చేయకుండానే.. చేశామంటూ శవాలను గుట్టుగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారు.
కాలేజీల అవసరాన్నిఅడ్డుపెట్టుకుని..
మన రాష్ట్రంలో దాదాపు 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి పది మంది విద్యార్థులకు అనాటమీ క్లాసులు చెప్పేందుకు ఒక మృతదేహం అవసరం. ఈ లెక్కన ప్రతి కాలేజీకి ఏటా 15 నుంచి 20 మృతదేహాలు కావాలి. ఈ లెక్కన వైద్యవిద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం ఏటా రాష్ట్రంలో 500కుపైనే శవాలు కావాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం.. కొన్నిచోట్ల వ్యాక్స్ బొమ్మలతో అనాటమీ క్లాసులు నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నా, దానివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి రాదన్న అభిప్రాయంతో మృతదేహాలపైనే ప్రాక్టీస్‌కు మొగ్గుతున్నారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు.. మృతదేహాలు అమ్ముకునే దందాకు తెరలేపారు. కాలేజీల అవసరాన్ని బట్టి ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇంతఖర్చు పెట్టాల్సి రావడంతో కాలేజీలు ఈ భారాన్ని వైద్య విద్యార్థులపై వేస్తున్నట్టు సమాచారం. ఒక శవానికి రూ.5 లక్షలు ఖర్చయితే.. 100 మంది విద్యార్థులున్న కాలేజీలో ప్రతి విద్యార్థి నుంచి రూ.5,000 వరకు ప్రత్యేక అనాటమీ క్లాసు కింద తీసుకుంటున్నట్టు తెలిసింది.
2006లో శిల్పారామం వాచ్‌మెన్ కేసులో..
పి.పాల్ అనే వ్యక్తి శిల్పారామంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. 2011 మే 6న అదృశ్యమయ్యాడు. తర్వాత శంషాబాద్‌లోని రాళ్లగూడెం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. కొద్దిరోజుల తర్వాత సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ రికార్డుల సాయంతో పాల్ బంధువులు ఆ డెడ్‌బాడీ తమవారిదిగా గుర్తు పట్టారు. ఉస్మానియా మార్చురీకి వెళ్లి మృతదేహం కోసం ఆరా తీశారు. కానీ అక్కడి ఫోరెన్సిక్ సిబ్బంది పాల్ మృతదేహాన్ని జీహెచ్‌ఎంసీకి వాళ్లకు ఇచ్చామన్నారు.
బంధువులు జీహెచ్‌ఎంసీని ఆశ్రయించగా.. బాడీని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌కు పంపామన్నారు. అక్కడికెళితే తమ దగ్గరికి రాలేదని ఫౌండేషన్ తేల్చి చెప్పింది. దీంతో ఏదో జరిగిందని పాల్ బంధువులకు అర్థమైంది. ‘పాల్ మృతదేహం ఏది? అంత్యక్రియలు నిర్వహించకుండా ఎక్కడికి పోయింది, ఏదైనా మెడికల్ కాలేజీకి విక్రయించారా?’ అంటూ మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారానికి బాధ్యుడైన ఓ సీనియర్ డాక్టర్‌పై విచారణ జరిగింది. ఉస్మానియాలో ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ, బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే సదరు వైద్యులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
2010లో వీఎస్టీ కాలనీకి చెందిన వై.జాన్ అనే వ్యక్తి తప్పిపోయాడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు కాపీ తీసుకోలేదు. నాలుగేళ్లు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 2014 జనవరి 13న చిక్కడపల్లిలో మరోసారి ఫిర్యాదు చేశారు. కానీ జాన్ 2011 ఫిబ్రవరి 3వ తేదీనే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోయినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అంత్యక్రియలు, పోస్టుమార్టానికి సంబంధించిన డాక్యుమెంట్లు అడిగారు. కానీ ఇవ్వలేదు. దీంతో ఎవరో జాన్ శవాన్ని మాయం చేశారని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ మేరకు అఫ్జల్‌గంజ్ ఠాణాలో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. అయితే వరదలు వచ్చి జాన్ ఫైల్ ఒక్కటి మాత్రమే కొట్టుకుపోయిందని పోలీసులు సమాధానం ఇవ్వడంతో కుటుంబం నోరెళ్లబెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఆ మృతదేహం దొంగతనంగా మెదక్‌లోని ఓ కాలేజీ అనాటమీ విభాగానికి చేరింది.
ప్రవీణ్ ప్రకాశ్ కమిటీ నివేదిక ఎక్కడ?
2010–11లో రాష్ట్రంలో వందలకొద్దీ శవాలను అక్రమంగా మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వైద్యులు, పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్లడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ పలుమార్లు ఉస్మానియా, ఇతర ఆస్పత్రులను సందర్శించింది. కొందరు అధికారులు, సిబ్బందిని విచారించింది. కానీ కమిటీ నివేదికను ఇప్పటికీ బయటపెట్టలేదు.
అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలి..
కార్పొరేట్ కాలేజీలు పెరుగుతున్న క్రమంలో మెడిసిన్ విద్యార్థుల అనాటమీ తరగతులకు శవాల అవసరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, ప్రభుత్వాసుపత్రుల వైద్యులతో ములాఖత్ అవుతున్నారు. పోలీసులు చూసీచూడనట్లు ఉంటుండటంతో అన్‌క్లెయిమ్‌డ్ డెడ్ బాడీస్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి.
శవాలను అమ్ముకుని రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. దీని వెనుక మెడికల్ కార్పొరేట్ మాఫియా హస్తం ఉందన్నది సుస్పష్టం. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరపకపోవడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ వ్యవహారంపై గతంలోనే రాష్ట్రపతికి, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేశాం. ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి.
Comments
Please login to add a commentAdd a comment