సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్‌లో ఉన్న పిల్లల మూడ్స్‌ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని
ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం.
ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం.
టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్‌లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు.
కారణాలు
టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్‌ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు.
లక్షణాలు
ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం...
ఏం చేయాలి?
ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి.
► తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు.
► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి.
► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి.
అసలు సమస్య
మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్‌లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్‌లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్‌ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment