హైదరాబాద్‌లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది.
మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు.
మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక.
సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు.
కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట!
జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు.
ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు.
చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు.
కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు.
ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్‌లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది.
డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
మొబైల్: 90107 57776
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
Published Tue, Oct 17 2023 5:20 AM | Last Updated on Tue, Oct 17 2023 5:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment