
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం.
శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏం జరిగిందంటే..
శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు.
గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని హాస్టల్‌లోనే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణమని తేల్చారు.
పక్షం రోజుల కితమే హాస్టల్‌లో చేరిక
కాగా, 15 రోజుల క్రితం హాస్టల్‌లో జాయిన్ అయిన ప్రవల్లిక సంధ్య, అక్షయ శ్రుతిలతో కలిసి ఉండేది. ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదని అంటున్నారు. ప్రవల్లిక ఉరివేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్‌తో పాటు లవ్ సింబల్స్‌తో ఉన్న ఓ లెటర్‌ను కూడా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతురాలి సెల్ ఫోన్ లో తాను ప్రేమించిన శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్స్‌ను పోలీసులు గుర్తించారు.
ప్రేమగురించి కుటుంబసభ్యులకు తెలుసు–డీసీపీ
డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రవల్లిక ఎలాంటి గ్రూప్స్ పరీక్షలకు అప్లయ్ చేయలేదని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎలాంటి పోటీ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ప్రవల్లిక ప్రేమ విషయం కూకట్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న తమ్ముడు ప్రణయ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా తెలుసే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారి వద్ద మరింత సమాచారం సేకరిస్తామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసి పోలీసులపై రాళ్లురువి్వన కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు.
నివేదిక కోరిన గవర్నర్..
ప్రవల్లిక ఆత్మహత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శిలను ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
రాహుల్ గాందీ, ఖర్గే సంతాపం
ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు.