'చలిగా ఉండే ఈ సీజన్‌లో ఎంత వ్యాయామం చేసినా వెంటనే చెమట పట్టనందున ఎంతసేపైనా ఎక్సర్‌సైజులు చేసుకోవచ్చు అనేది ఫిట్‌నెస్ ఫ్రీక్‌ల ఆసక్తి. అయితే ఈ సీజన్‌లో ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ తాలూకు ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. చలికాలంలో ‘ఇన్వర్షన్’తో పాటు ఈ ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ల ప్రభావంతో ఊపిరితిత్తుల మీదా, ఆ అంశం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలుంటాయి. అందుకే చలిలో చెమట పట్టదనీ, అలసట రాదనీ వ్యాయామాలు చేసేవాళ్లూ, అలాగే చల్లటి వాతావరణంలో హాయిగా ఆరుబయట తిరగాలనుకునే వాళ్లు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్‌లెవల్ ఓజోన్’ ప్రభావమేమిటో, అది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.'
రోడ్డు మీద పొగలు చాలా ఎక్కువగా వెలువరుస్తూ వాహనాలు వెళ్లాక.. చాలాసేపటివరకు ఆ పొగ చెదిరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ పొగనుంచి పయనించే వాహనదారులంతా కాసేపు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం కూడా సహజమే. మామూలుగానే ఉండే ఈ పరిస్థితికి తోడు.. శీతకాలంలోని చలివాతావరణంలో ఈ పొగ మరింత ఎక్కువ సేపు అలముకుని ఉంటుంది. ఇందులో పొగమంచూ, కాలుష్యం కలిసిపోయి ఉండటం వల్ల ‘స్మాగ్’ అనే కాలుష్య మేఘం చాలాసేపు కొనసాగుతూ.. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’లనే వాతావరణ అంశాలు ఈ ‘స్మాగ్’ను, దాంతో సమస్యలనూ మరింత తీవ్రతరం చేస్తాయి.
ఇన్వర్షన్ అంటే..
మామూలుగా ఎత్తుకుపోయిన కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఎత్తులకు వెళ్లినకొద్దీ నిర్ణీతమైన రీతిలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని ‘ల్యాప్స్ రేట్’ అని కూడా అంటారు. ఇది వాతావరణ సహజ నియమం. కానీ కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. అంటే.. నేలమీదనే బాగా చల్లగా ఉండి, పైభాగంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సహజ వాతావరణ నియమానికి భిన్నంగా ఉండటం వల్లనే.. ఈ ప్రక్రియకు ‘ఇన్వర్షన్’ అని పేరు.
కాలుష్యమేఘంతో ఊపిరితిత్తులూ, ఓవరాల్ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఇలా..
- ముక్కు ముందుగా ఓ ఏసీ యూనిట్‌లా పనిచేస్తుంది. అతి చల్లటి గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా తొలుత ముక్కులోకి వెళ్లిన గాలి కాస్తంత వేడిగా మారి, దేహ ఉష్ణోగ్రతకు కాస్త అటు ఇటుగా సమానంగా ఉండేలా మారాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంత చల్లటిగాలి ఊపిరితిత్తులకు నష్టం చేయకుండా ఉండేందుకే ముక్కు ఈ పనిచేస్తుంది. కానీ గాల్లోని రసాయనాల వల్ల తొలుత ముక్కులోని సున్నితమైన పొరలపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో ముక్కులో మంటగా అనిపిస్తుంది. అలర్జీలూ కనిపిస్తాయి.
- అటు తర్వాత గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే ట్రాకియా, బ్రాంకియాలో ఇరిటేషన్ రావచ్చు.
- కాలుష్యాలను ముక్కు చాలావరకు వడపోసినప్పటికీ, కొన్ని లంగ్స్‌లోకి వచ్చేస్తాయి. వాటిని బయటకు పంపేందుకు ఊపిరితిత్తుల్లో మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్ అనే నిర్మాణాలు కొవ్వొత్తి మంటలా కదులుతూ కాలుష్యాలను పైవైపునకు నెడుతుంటాయి.
- సీలియరీ ఎస్కలేటర్స్ పని మాత్రమే కాకుండా.. అక్కడ కొన్ని స్రావాలు (మ్యూకస్) ఊరుతూ, అవి కూడా కాలుష్యాలను బయటకు నెడుతుంటాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్లరక్త కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌లనుంచి మాత్రమే కాకుండా కాలుష్యాల బారి నుంచీ చాలావరకు కాపాడుతుంటాయి.
- సన్నటి వెంట్రుకల్లాంటి కదులుతూ ఉండే ఈ సీలియాలు అలల్లా వేగంగా కదలడం ద్వారా శ్వాస వ్యవస్థలోకి చేరిన కాలుష్య పదార్థాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియా, ఇతర కణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఈ సీలియా సమర్థంగా పనిచేయడానికి వీటి చుట్టూ ఉత్పత్తి అయ్యే మ్యూకస్‌తో శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లెమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. కాలుష్యాల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గళ్ల/తెమడలా పడటం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్లగా ఉండటం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే.
ఈ సీజన్‌లో ఊపిరితిత్తులతో పాటు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సినవి..
- కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతవరకు సూర్యుడు బాగా పైకొచ్చి చలి తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు రాకపోవడం మంచిది.
- తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి.
- ఈ సీజన్‌లో వాకింగ్, ఇతర వ్యాయామాలను కాలుష్యం లేని చోట మాత్రమే చేయాలి. లేదా చలికాలంలో కేవలం ఇన్‌డోర్ వ్యాయామాలకు పరిమితమైతే మేలు.
- ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలో భాగంగా సీలియాలు సమర్థంగా పనిచేయడానికి గాలిలో తేమ బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా తొలుత ఆవిరిపట్టడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
- తెమడ / గళ్ల (స్పుటమ్)ను బయటకు తెచ్చేందుకు దోహదపడే దగ్గును మందులతో అణచకూడదు. మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు క్రమంగా దగ్గును తగ్గించేలా చేసే మందులు వాడాలి. దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు.. ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు కఫాన్ని పలచబార్చే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడాలి.
- ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), ఆస్తమా వంటి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది.
గ్రౌండ్ లెవల్ ఓజోన్ అంటే..
వాతావరణం పైపొరల్లో ఓజోన్ లేయర్ ఉంటుందనీ, అది ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. భూమి మీదా ఓజోన్ ఉంటుంది. దీన్ని ‘స్మాగ్ ఓజోన్’ లేదా ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులతో పాటు మరికొన్ని రసాయనాల చర్యల వల్ల ఆవిర్భవిస్తుంది. కొంతమేర సూర్యరశ్మి కూడా ఈ కాలుష్యమేఘం ఆవరించేందుకు దోహదపడుతుంది.
ఫలితంగా.. పొగ, మంచు (ఫాగ్ ప్లస్ స్మోక్) కలిసి ఉండే స్మాగ్‌తో పాటు ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ కూడా కలసిపోతుంది. దీనికి తోడు వాతావరణంలోని నల్లటి నుసి, ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్), పుప్పొడీ.. ఇవన్నీ కలగలసి దట్టమైన కాలుష్య మేఘం ఏర్పడుతుంది. వాతావరణంలోని ఇన్వర్షన్‌తో ఏర్పడ్డ చల్లదనం కారణంగా ఈ కాలుష్యమేఘం చాలాసేపు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ కాలుష్యంలోంచి ప్రయాణాలు చేసేవారిలో.. తొలుత అక్కడి కాలుష్య రసాయనాలో ముక్కులో ఇరిటేషన్, ఆ తర్వాత ఊపిరి తిత్తులూ దుష్ప్రభావానికి లోనవుతాయి.
ముక్కు, శ్వాసమార్గంలో మంట, ఊపిరి తేలిగ్గా అందకపోవడం, శ్వాసకోశ వ్యవస్థలో ఇన్‌ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలూ, వృద్ధుల్లో కొంతమేర ప్రాణాపాయం కలిగే అవకాశాలూ లేకపోలేదు. మరికొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయడం లేదా ఆస్తమా ఉన్నవారిలో ఇది అటాక్‌ను ట్రిగ్గర్ చేయడం వంటి అనర్థాలు సంభవిస్తాయి.
- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment