Hypersensitivity Pneumonia: పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..! | Farmers Should Be Aware Of Hypersensitivity Pneumonia | Sakshi
Sakshi News home page

Hypersensitivity Pneumonia: పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..!

Published Sun, Jul 31 2022 3:43 PM | Last Updated on Sun, Jul 31 2022 4:38 PM

Farmers Should Be Aware Of Hypersensitivity Pneumonia - Sakshi

మనలో చాలామందికి నిమోనియా గురించి తెలుసు. ‘హైపర్‌సెన్సిటివిటీ నిమోనైటిస్‌’ అనే మాట కొత్తగా అనిపించవచ్చు.  కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది అనేక నిమోనియాల సమాహారం అని అనుకోవచ్చు. రైతులు గరిసెల్లో వడ్లూ, ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, గడ్డి వామి పేర్చే సమయంలో వచ్చే వాసనలు పడనప్పుడు ఒక రకం నిమోనియా వస్తుంది. దాన్ని ‘ఫార్మర్స్‌ లంగ్‌’ అంటారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది.

అది సరిపడనప్పుడు ‘బర్డ్‌ ఫ్యాన్సియర్స్‌ లంగ్‌’ అంటూ మరో ఆరోగ్య సమస్య ఎదురవుతుంది. అంతేకాదు... పెద్దసంఖ్యలో పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఇది రావచ్చు.  గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ,  వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్‌ సెన్సిటివిటీ నిమోనైటిస్‌’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్‌లో ఈ ముప్పు మరింత ఎక్కువ. ఈ సమస్యపై అవగాహన కలిగించేందుకే ఈ కథనం.

వృత్తి కారణంగానో లేదా ఇల్లు మారడం వల్లనో ఓ కొత్త వాతావరణంలోకి వెళ్లాం అనుకొండి. అప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందకపోవడం, ఆయాసపడటం జరగవచ్చు. అందుకు కారణం అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి పదార్థాలు ఉండటం. అవి ఊపిరితిత్తుల (లంగ్‌స)పై కలిగించే దుష్ప్రభావం వల్ల వచ్చే సమస్యే ‘హైపర్‌ సెస్సిటివిటీ నిమోనైటిస్‌’. ఇది కొందరిలో తక్షణం సమస్యగా కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. మరికొందరిలో దీర్ఘకాల సమస్యగానూ పరిణమించవచ్చు. ఇదెంత సాధారణమంటే మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఇది కనిపిస్తుంటుంది.

ఎందుకొస్తుంది? 
మన పరిసరాల్లోని దాదాపు 300 రకాల పదార్థాలు, రేణువులు ‘హైపర్‌ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణం కావచ్చు. కొంతమందికి కొన్నింటితో అలర్జీ కలగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆ అలర్జెన్స్‌ను స్థూలంగా వర్గీకరించినప్పుడు నాలుగు రకాలుగా రావచ్చు. అవి... ఫార్మర్స్‌ లంగ్‌ :  ఇది ముఖ్యంగా రైతుల్లో కనిపిస్తుంది. పంట కోశాక ధాన్యాన్ని గరిసెల్లో (గాదెల్లో) నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, బయట గడ్డివాముల్లాంటివి పేర్చాల్సిరావడం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్‌ లంగ్‌’ అంటారు. 

బర్డ్‌ ఫ్యాన్సియర్స్‌ లంగ్‌: కొందరు జీవనోపాధి కోసం... అంటే ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు కోళ్లూ, బాతుల వంటి పక్షుల్ని పెంచుతుంటారు. మరికొందరు హాబీగా పక్షుల్ని  పెంచుతారు. ఇంకొందరు సరదాగా పక్షులకు ఆహారం వేస్తుంటారు. వాటి వాసనతోనూ, విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్‌ ఫ్యాన్సియర్స్‌ లంగ్‌’ అంటారు.

హ్యుమిడిఫయర్స్‌ లంగ్‌ : కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో ఉండాల్సిరావచ్చు. ఆ తేమ కారణంగా అక్కడ పెరిగే ఫంగస్‌తోనూ, వాటి స్పోరులతో (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) సరిపడనప్పుడు ఇది వస్తుంది. నిత్యం ఎయిర్‌కండిషనర్‌లో ఉండేవారి కొందరికి ఆ చల్లటివాతావరణం సరిపడక కూడా రావచ్చు. అందుకే దీన్ని ‘హ్యుమిడిఫయర్స్‌ లంగ్‌’ అంటారు. 

హాట్‌ టబ్‌ లంగ్‌ : కొందరు హాబీగా లేదా ఆరోగ్యం కోసం ‘స్పా’ల వంటి చోట్ల నీటి తొట్టెల్లో స్నానాలు చేస్తుంటారు. మరికొందరు ఇన్‌హెలేషన్‌ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటి ఆవిర్లను పీలుస్తుంటారు. అయితే ఆ నీరు నిల్వ ఉండటం లేదా ఆ పాత్రను సరిగా కడగకపోవడంతో అపరిశుభ్రంగా ఉండటం, తొట్టిస్నానాల విషయంలో... వాటిని  సరిగా శుభ్రం చేయకపోవడం, అక్కడ అలర్జెన్స్‌ పెరగడంతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘హాట్‌ టబ్‌ లంగ్‌’ అంటారు. 

లక్షణాలు
ఈ సమస్య ఏదో ఒక సమయంలో (అక్యూట్‌గా)నైనా రావచ్చు. అంటే సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్‌గా) బాధించవచ్చు. 
∙ ఊపిరి అందకపోవడం ∙తీవ్రమైన ఆయాసం ∙జ్వరం ∙చలితో వణకడం 
∙ఒళ్లునొప్పులు ∙తలనొప్పి ∙కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ∙గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం...గాలికి గమ్యం అయిన గాలిసంచిలో  అడ్డంకులు (ఎగ్జుడస్‌) ఉండవచ్చు. కాబట్టి అక్కడికి ఆక్సిజన్‌ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్‌ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌’ అంటారు. 
∙ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం మారిపోవడం, కంగారుగా ఉండటం, అయోమయం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్‌పోజ్‌ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటల పాటు వేధించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే... కొందరిలో అది తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్‌ కారణంగా ఎడతెరిపిలేకుండా లక్షణాలు బాధించవచ్చు.

నిర్ధారణ పరీక్షలు 
∙తొలుత స్టెతస్కోప్‌తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షిస్తారు. lఛాతీ ఎక్స్‌–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్‌ తీస్తారు. ∙శ్వాసప్రక్రియ సరిగా ఉందా అని లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి ‘లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌’ చేస్తారు. ∙ఏవైనా అలర్జెన్స్‌ కారణంగా అలర్జీ ఉందేమో తెలుసుకోడానికి యాంటీబాడీస్‌ రక్తపరీక్ష చేస్తారు.

∙బ్రాంకోస్కోప్‌ సహాయంతో నోటి నుంచి లేదా ముక్కు నుంచి లంగ్స్‌కు గాలి వెళ్లే దారులను పరీక్షిస్తారు. ఇది వోకల్‌ కార్డ్స్, విండ్‌పైప్‌ వంటి చోట్లకు వెళ్లి అక్కడేమైనా అసాధారణతలు ఉన్నాయా అని పరీక్షిస్తుంది. ∙ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి ‘సర్జికల్‌ లంగ్‌ బయాప్సీ’  లేదా... ‘కైరో లంగ్‌ బయాప్సీ’ (దీన్ని కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్‌ గైడెడ్‌ లంగ్‌ బయాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. 

ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం జరుగుతుందంటే...? 
ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయం కలిగినట్లుగా గాట్లవంటివి రావచ్చు. దీన్నే ‘స్కారింగ్‌’ అంటారు. ఇక అవి తమ స్వాభావిక సాగేగుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘పల్మునరీ ఫైబ్రోసిస్‌’గా పేర్కొంటారు. 

నివారణ
∙సమస్య నిర్ధారణ అయినప్పుడు అసలు ఏయే అలర్జెన్‌ కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి నుంచి బాధితులను పూర్తిగా దూరంగా ఉంచాలి. ∙సమస్య వచ్చిన  రైతులు ధాన్యం నిల్వ చేసే గరిసెలు, గాదెలు, గిడ్డంగులతో పాటు గడ్డివాములు, పశువుల కొట్టాల్లో గడ్డి వేసే చోట్లకూ, పశువులు తినివదిలేసిన వృథా గడ్డిని పడేసే పెంటకుప్ప/ పేడదిబ్బ / ఎరువు దిబ్బలకు దూరంగా ఉండాలి.

∙పౌల్ట్రీరంగంలో పనిచేసేవారు కోళ్లగూళ్లకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ∙సరదగా పక్షులు పెంచుకునేవారు వాటి నుంచి దూరంగా ఉండాలి. వాటికి దాణా వేయకుండా ఉండటం, అవి రెట్టలేసే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ∙çపరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లలో / ఆఫీసుల్లో / కార్యక్షేత్రాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఇండ్ల పరిసరాల్లో కుళ్లుతున్న / కుళ్లడానికి ఆస్కారం ఉన్న పదార్థాలను (అంటే కుళ్లుతున్న పండ్లు, ఖాళీచేసిన కొబ్బరిబొండాల వంటివి) పడవేయకూడదు.

∙తేమగా ఉండి, ఫంగస్‌ పెరిగేందుకు ఆస్కారం ఉండే పరిసరాల నుంచి దూరంగా ఉండాలి. ∙ఏసీలో ఉండేవారు తరచూ ఫిల్టర్లను శుభ్రం చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙స్థోమత, అవకాశం ఉన్నవారు వీలైతే గాలిలో తేమను తెలుసుకునే ఉపకరణం ‘హైగ్రోమీటర్‌’ను కొనుగోలు చేసి, తామున్న ప్రదేశంలో 50 శాతానికి మించి తేమ ఉంటే అక్కడికి దూరంగా వెళ్లిపోవాలి. ∙నిల్వనీళ్లలో తొట్టిస్నానం వద్దు.  ∙సువాసన ద్రవ్యాలు కలిపిన నీటి ఆవిర్లను పీల్చడం వంటివి చేయకూడదు. ∙నిల్వ ఉన్న నీళ్లు ఇంటిలోకి లీక్‌ అవుతూ ఉంటే, ప్లంబర్ల సహాయంతో వెంటనే రిపేరు చేయించాలి. ∙పరిసరాలెప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గోడలు తడిగా, తేమతో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. lపొగతాగే అలవాటు / ఆల్కహాల్‌ పూర్తిగా మానేయాలి.

చికిత్స
∙అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి రావచ్చు. lయాంటీ హిస్టమైన మందులను ఇవ్వాల్సి రావచ్చు. ∙ఊపిరి అందేలా ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసేందుకు ‘బ్రాంకోడయలేటర్స్‌’ ఇవ్వాల్సి రావచ్చు. ∙జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తుంటే దేహంలో ఇమ్యూన్‌ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి ‘ఇమ్యూనో సప్రెసివ్‌ మందులు’ ఇవ్వాల్సి రావచ్చు. ∙రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ పెట్టాల్సి రావచ్చు. 

తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగా, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్‌ వచ్చి, పీచులాగా (ఫైబ్రస్‌) అయిపోతే ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) మాత్రమే చివరి ఆప్షన్‌ కావచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement