ఇళ్లలో ఇటు తలుపులకూ, అటు కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెన్స్) అమర్చుకోవడం ప్రైవసీని ఇస్తూనే ఒక రకంగా అందాన్ని ఇనుమడింపజేసే అంశం. మంచి కర్టెయిన్లతో ఇళ్లకు అందునా ప్రధానంగా హాల్స్‌కు ఓ రాజసపు రిచ్ లుక్ కూడా వస్తుంది. అందుకే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చడం అన్నది బాగా ధనవంతుల ఇళ్ల మాదిరిగానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లోనూ పెరిగిపోయింది.
దీనికి తోడు కొన్నిసార్లు ఇంటి పై సజ్జా (అటక) వంటి చోట్ల పాత సామాన్ల వంటి తరచూ ఉపయోగించిన సామగ్రి ఉంచినప్పుడు, వాటికి అడ్డంగా కూడా నెలల తరబడి అవే కర్టెన్లు వాడటమూ కొన్ని ఇళ్లలో సాధారణంగా చోటు చేసుకునే విషయమే. బట్టతో చేసిన పరదాల(క్లాత్/ఫ్యాబ్రిక్ కర్టెన్స్) నిర్వహణ జరిగా లేకపోతే, వాటితో నాలుగు రకాల హాని చేకూరే ప్రమాదం ఉంది.
1. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్: కర్టెన్లు మన ఇళ్లలోకి వేడిమి, చలి రాకుండా చేయడంతో పాటు దుమ్మూ, ధూళిని సైతం నిరోధిస్తాయన్న అంశం తెలిసిందే. ఈ క్రమంలో మన తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల మాటున సైతం డస్ట్‌మైట్స్ మాటు వేస్తాయి. ఒక అంచనా ప్రకారం 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ప్రోటీన్స్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి అలర్జీ కలిగిస్తుంది. కేవలం డస్ట్‌మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో చోటు సంపాదిస్తాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, ఎడతెరిపి లేకుండా తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి.
2. మౌల్డ్స్, మిల్‌డ్యూ లాంటి ఫంగస్ చేరడం: కర్టెన్లలో మౌల్డ్స్, మిల్‌డ్యూ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి బూజు లాంటివి అనుకోవచ్చు. అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
3. సూక్ష్మజీవులకు నెలవు
అత్యంత హానికరమైన అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కరెన్లలో చేరి, అవి కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయి.
4. దుమ్ము కణాలు
అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. దుమ్ము కణాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు అవి ఊపిరితిత్తులను దెబ్బతీసే విషయం మనకు తెలిసిందే.
ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో...
మొదట్లో అన్ని ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్టాస్టిక్‌తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్‌రూమ్‌ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవి బట్టలాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా వాటిని ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. దీన్నే వాల్‌పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.
ఈ తరహా ప్లాస్టిక్ కర్టెన్లలోని హానికర/విష (టాక్సిక్)పదార్థాలు కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన ప్రభావం చూపి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కర్టెన్ల అలర్జీలను నివారించడం ఇలా... ∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు బట్టతో చేసిన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెయిన్స్) వాడటమే మంచిది. ∙షవర్ కర్టెన్ల కోసం కూడా ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిదే అయినా... అది తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే... హానికరంకాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మేలు. ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవైనా పూర్తిగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం.
ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైన వాటిని డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌తో తరచూ శుభ్రపరచడం అనివార్యం. ఇలా ప్లాస్టిక్‌తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపోఅలర్జెనిక్ వాషబుల్‌వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది.
అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు ‘రేడియో అలర్జో సార్బెంట్ టెస్ట్’ (ర్యాస్ట్) అనే ఓ రక్తపరీక్ష ద్వారా అలర్జీ ఉందా, దాని తీవ్రత ఎంత అని తెలుసుకుంటారు. అటు తర్వాత తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన స్టెరాయిడ్స్ మోతాదులతో జాగ్రత్తగా చికిత్స అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment