కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో..  | Sakshi Interview With Cardiologist Dr Seshagiri Rao | Sakshi
Sakshi News home page

కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. 

Published Sat, May 22 2021 4:08 AM | Last Updated on Sat, May 22 2021 2:47 PM

Sakshi Interview With Cardiologist Dr Seshagiri Rao

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి చాలావేగంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్‌తో ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా.డి.శేషగిరిరావు వెల్లడించారు. గుండెకు సంబంధించి ఈ వైరస్‌ నేరుగా హార్డ్‌ కవరింగ్స్, కండరాలు, గుండెకు వెళ్లే రక్తనాళాలు, పరోక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావంతో దాని పనితీరు మందగించి గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తోందన్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టి, బీపీ పెరిగి గుండె వైఫల్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. మొదటి దశలోనూ ఈ పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కోవిడ్‌ తీవ్రత–గుండెపై ప్రభావాలు, ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ’సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.శేషగిరిరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..     

గుండెకు సంబంధించి అన్నీ ప్రభావితం.. 
కరోనాతో గుండెకు సంబంధించిన అన్ని అంశాలు, వ్యవస్థలు ప్రభావితమౌతున్నాయి. పెరికార్డియంగా పిలిచే హార్ట్‌ కవరింగ్, గుండె కండరాలు, గుండెలోని ఎలక్ట్రికల్‌ కండక్టింగ్‌ సిస్టం, గుండెకు రక్తాన్ని పంపించే నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. గుండెలోని కుడిభాగం నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపించే పైప్‌లైన్లు బ్లాక్‌ అవుతున్నాయి. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు, కాళ్ల నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడం.. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ ప్రభావితం అవుతోంది. 


లంగ్స్‌లో సమస్యలతోనూ.. 
కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో ఫైబ్రోటిక్‌ ప్యాచేస్‌ ఉండిపోవడంతో లంగ్‌ ఫైబ్రోసిస్‌ రావడం వల్ల ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గడం లేదు. కొద్దిసేపు నడిచే సరికి ఆయాసం వచ్చేస్తోంది. ఊపిరితిత్తుల పనితీరు మళ్లీ మామూలు స్థాయికి చేరుకోకపోవడంతో బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్‌ ఫెయిల్యూర్‌కి దారితీయొచ్చు. కాళ్లలోని సిరల్లో ఏర్పడిన బ్లడ్‌క్లాట్‌లు పైకి చేరుకుని లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలను బ్లాక్‌ చేయడంతో పల్మొనరీ త్రాంబో ఎంబాలిజం తరచుగా రిపీట్‌ అయితే లంగ్స్‌లో బీపీ పెరుగుతుంది. రక్తంలోని కో ఆగ్జిలేషన్‌ ఫ్యాక్టర్స్‌ ఎక్కువ కావడంతో గుండె, లంగ్స్, మెదడు ఇలా ఎక్కడైనా రక్తం గడ్డకట్టి స్ట్రోక్‌కు దారితీయొచ్చు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతుంది.  


ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. 
వైరస్‌ కారణంగా మయోకార్డైటిస్‌ ఏర్పడి గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా 200, 300 వెళ్లిపోయి కార్డియాక్‌ అరెస్ట్‌తో అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలు బ్లాక్‌ కావడం, కాళ్లలోని సిరల్లో ఏర్పడిన రక్తం గడ్డలు లంగ్స్‌లో బ్లాక్‌ కావడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మెదడుకు వెళ్లే ప్రధానమైన రక్తనాళం సడన్‌గా బ్లాక్‌ అయితే, మెదడు కేంద్రమైన మెడుల్లా అబ్లాంగేటాకు రక్తప్రసారం తగ్గినా పేషెంట్‌ కుప్పకూలుతారు. 


రక్తం గడ్డ కడుతుందిలా.. 
కోవిడ్‌ పేషెంట్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే గుణాన్ని వైరస్‌ పెంచుతుంది. రక్తనాళంలోని మెత్తని లైనింగ్‌ను డ్యామేజీ చేయడం వల్ల రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుంది. శరీరంపై వైరస్‌ దాడి చేసినప్పుడు కొన్ని ‘న్యూరో హ్యూమరల్‌ సబ్‌ స్టాన్సెస్‌’రక్త ప్రసరణలోకి వచ్చి వైరస్‌ను అదుపు చేసేందుకు రక్షణ వ్యవస్థగా ఉపయోగపడతాయి. శరీరంలోని న్యూట్రోఫిల్స్‌ కణాలు వైరస్‌పై దాడి చేసేటప్పుడు కొంత మేర వాస్క్యులర్‌ ఎండో థీలియంను కూడా డ్యామేజీ చేస్తాయి. ఇలా రక్తం గడ్డకట్టడానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కరోనా నుంచి కోలుకున్నాక కూడా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి.  


కోవిడ్‌తో గుండెపోటుకు కారణాలెన్నో.. 
రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరం డామేజీ కావడంతో హార్ట్‌ అటాక్‌కు దారి తీస్తుంది. ఇదేకాకుండా గుండె కండరపై వైరస్‌ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగా మయో కార్డియారిటీస్‌ వచ్చి గుండెకు బ్లడ్‌ పంపింగ్‌ బలహీనమై లేదా గుండె బలహీనంగా కొట్టుకుని సడన్‌గా హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. గుండెకు రక్తం ద్వారానే 
ఆక్సిజన్, గ్లూకోజ్‌ సరఫరా అవుతున్నందున అది తగ్గిపోతే కణాలు చనిపోయి గుండెపోటుకు కారణమవుతుంది. 


యంగ్‌ పేషెంట్స్‌పై ప్రభావం అధికం.. 
వైరస్‌ వేరియెంట్లు, మ్యుటేషన్లలో వచ్చిన మార్పులు, కొత్త స్ట్రెయిన్లు తదితర కారణాలతో పాటు యువతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈసారి వారిపై అధిక ప్రభావం పడింది. మొదటి దశ తర్వాత వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పబ్‌లు, సినిమాలు, షికార్లలో నిమగ్నమయ్యారు. ఈ సారి వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. దీంతో తమకేమి కాదన్న ధీమాతో ఉండటంతో తేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 


ఒకదానికి మరొకటని పొరబడొద్దు.. 
ఛాతీ బరువెక్కడం, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి వచ్చినప్పుడు అవి ఊపిరితిత్తుల సమస్య అని, గుండెకు సంబంధించినవని నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్ల సంప్రదించి తగిన టెస్ట్‌లు చేయించుకోవాలి. 

కఠిన లాక్‌డౌన్‌ మంచిదే.. 
మరికొన్ని రోజులు కఠినమైన లాక్‌డౌన్‌ అమలుతో పాటు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలి. ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో వైరస్‌ తీవ్రత ఉండట్లేదు. ఇన్‌ ఫెక్షన్‌ సోకినా బ్లడ్‌ క్లాటింగ్, ఆక్సిజన్‌ తగ్గుదల వంటి మేజర్‌ కాంప్లికేషన్స్‌ వారిలో తక్కువగానే ఉంటున్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తగ్గుతోంది. గుండెజబ్బు ఉన్న వాళ్లందరూ తమ మందులను యథావిధిగా కొనసాగించాలి. కాగా, వెంటిలేటర్‌పై పెట్టినా పరిస్థితి మరింత విషమించే పేషెంట్లకు ఎక్మో ద్వారా చికిత్స అందించాలి. ఇది ఖరీదైన ట్రీట్‌మెంట్‌ అయినా ఇటీవల వీటి వినియోగం బాగానే పెరిగింది. దీనిద్వారా ఊపిరితిత్తులు కొంత కోలుకునే అవకాశముంటుంది. ఇది పెట్టాక నెల తర్వాత కూడా కోలుకోకపోతే గుండె, ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement