seshagiri rao
-
‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు
శామీర్‌పేట్: ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్భట్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోనూ సోదాలు కరీంనగర్‌క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్‌లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఏడాది నుంచి తిరుగుతున్నా... ధరణి పోర్టల్‌లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. -
AP: జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుత్ వాహనాల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది. -
మాజీ ఎంపీపీపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
తుని: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదుల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్.. అదే ప్రాంతానికి చెందిన అభిరామ్‌కు శిష్యుడు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేసే వీరు కొంతకాలంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో రిటైర్ట్ ఉద్యోగి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోల్నాటి శేషగిరిరావు తనను ఇబ్బందిపెట్టాడని, అతడిని గాయపరిస్తే సొమ్ము ఇస్తానని వారికి గురువు అభిరామ్ చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలపై నిఘాపెట్టాడు. ఈ నెల 17న ఉదయం చంద్రశేఖర్ భవానీమాల ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని తుని సమితి ఆఫీసు వీధిలో నివాసం ఉంటున్న శేషగిరిరావు ఇంటికి మోటారు సైకిల్ మీద వెళ్లాడు. భిక్షం అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. శేషగిరిరావు అక్కడే పడిపోయిన కత్తిని తీసుకుని వెంటపడి చంద్రశేఖర్ వీపుపై దాడిచేయడంతో గాయమైంది. శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాచిత్రం ఆధారంగా విస్తృతస్థాయిలో గాలించారు. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రశేఖర్ బుధవారం తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీమోహన్‌కు లొంగిపోయాడు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్, తుని, ప్రత్తిపాడు సీఐలు నాగదుర్గారావు, కిశోర్‌బాబు పాల్గొన్నారు. -
కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి చాలావేగంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్‌తో ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.డి.శేషగిరిరావు వెల్లడించారు. గుండెకు సంబంధించి ఈ వైరస్ నేరుగా హార్డ్ కవరింగ్స్, కండరాలు, గుండెకు వెళ్లే రక్తనాళాలు, పరోక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావంతో దాని పనితీరు మందగించి గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తోందన్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టి, బీపీ పెరిగి గుండె వైఫల్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. మొదటి దశలోనూ ఈ పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కోవిడ్ తీవ్రత–గుండెపై ప్రభావాలు, ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ’సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.శేషగిరిరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. గుండెకు సంబంధించి అన్నీ ప్రభావితం.. కరోనాతో గుండెకు సంబంధించిన అన్ని అంశాలు, వ్యవస్థలు ప్రభావితమౌతున్నాయి. పెరికార్డియంగా పిలిచే హార్ట్ కవరింగ్, గుండె కండరాలు, గుండెలోని ఎలక్ట్రికల్ కండక్టింగ్ సిస్టం, గుండెకు రక్తాన్ని పంపించే నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. గుండెలోని కుడిభాగం నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపించే పైప్లైన్లు బ్లాక్ అవుతున్నాయి. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు, కాళ్ల నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడం.. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ ప్రభావితం అవుతోంది. లంగ్స్‌లో సమస్యలతోనూ.. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఫైబ్రోటిక్ ప్యాచేస్ ఉండిపోవడంతో లంగ్ ఫైబ్రోసిస్ రావడం వల్ల ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గడం లేదు. కొద్దిసేపు నడిచే సరికి ఆయాసం వచ్చేస్తోంది. ఊపిరితిత్తుల పనితీరు మళ్లీ మామూలు స్థాయికి చేరుకోకపోవడంతో బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీయొచ్చు. కాళ్లలోని సిరల్లో ఏర్పడిన బ్లడ్క్లాట్లు పైకి చేరుకుని లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలను బ్లాక్ చేయడంతో పల్మొనరీ త్రాంబో ఎంబాలిజం తరచుగా రిపీట్ అయితే లంగ్స్‌లో బీపీ పెరుగుతుంది. రక్తంలోని కో ఆగ్జిలేషన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కావడంతో గుండె, లంగ్స్, మెదడు ఇలా ఎక్కడైనా రక్తం గడ్డకట్టి స్ట్రోక్‌కు దారితీయొచ్చు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతుంది. ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. వైరస్ కారణంగా మయోకార్డైటిస్ ఏర్పడి గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా 200, 300 వెళ్లిపోయి కార్డియాక్ అరెస్ట్‌తో అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలు బ్లాక్ కావడం, కాళ్లలోని సిరల్లో ఏర్పడిన రక్తం గడ్డలు లంగ్స్‌లో బ్లాక్ కావడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మెదడుకు వెళ్లే ప్రధానమైన రక్తనాళం సడన్‌గా బ్లాక్ అయితే, మెదడు కేంద్రమైన మెడుల్లా అబ్లాంగేటాకు రక్తప్రసారం తగ్గినా పేషెంట్ కుప్పకూలుతారు. రక్తం గడ్డ కడుతుందిలా.. కోవిడ్ పేషెంట్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే గుణాన్ని వైరస్ పెంచుతుంది. రక్తనాళంలోని మెత్తని లైనింగ్‌ను డ్యామేజీ చేయడం వల్ల రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుంది. శరీరంపై వైరస్ దాడి చేసినప్పుడు కొన్ని ‘న్యూరో హ్యూమరల్ సబ్ స్టాన్సెస్’రక్త ప్రసరణలోకి వచ్చి వైరస్‌ను అదుపు చేసేందుకు రక్షణ వ్యవస్థగా ఉపయోగపడతాయి. శరీరంలోని న్యూట్రోఫిల్స్ కణాలు వైరస్‌పై దాడి చేసేటప్పుడు కొంత మేర వాస్క్యులర్ ఎండో థీలియంను కూడా డ్యామేజీ చేస్తాయి. ఇలా రక్తం గడ్డకట్టడానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కరోనా నుంచి కోలుకున్నాక కూడా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. కోవిడ్‌తో గుండెపోటుకు కారణాలెన్నో.. రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరం డామేజీ కావడంతో హార్ట్ అటాక్‌కు దారి తీస్తుంది. ఇదేకాకుండా గుండె కండరపై వైరస్ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగా మయో కార్డియారిటీస్ వచ్చి గుండెకు బ్లడ్ పంపింగ్ బలహీనమై లేదా గుండె బలహీనంగా కొట్టుకుని సడన్‌గా హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. గుండెకు రక్తం ద్వారానే ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరా అవుతున్నందున అది తగ్గిపోతే కణాలు చనిపోయి గుండెపోటుకు కారణమవుతుంది. యంగ్ పేషెంట్స్‌పై ప్రభావం అధికం.. వైరస్ వేరియెంట్లు, మ్యుటేషన్లలో వచ్చిన మార్పులు, కొత్త స్ట్రెయిన్లు తదితర కారణాలతో పాటు యువతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈసారి వారిపై అధిక ప్రభావం పడింది. మొదటి దశ తర్వాత వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పబ్‌లు, సినిమాలు, షికార్లలో నిమగ్నమయ్యారు. ఈ సారి వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. దీంతో తమకేమి కాదన్న ధీమాతో ఉండటంతో తేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకదానికి మరొకటని పొరబడొద్దు.. ఛాతీ బరువెక్కడం, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి వచ్చినప్పుడు అవి ఊపిరితిత్తుల సమస్య అని, గుండెకు సంబంధించినవని నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్ల సంప్రదించి తగిన టెస్ట్‌లు చేయించుకోవాలి. కఠిన లాక్డౌన్ మంచిదే.. మరికొన్ని రోజులు కఠినమైన లాక్డౌన్ అమలుతో పాటు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలి. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వైరస్ తీవ్రత ఉండట్లేదు. ఇన్ ఫెక్షన్ సోకినా బ్లడ్ క్లాటింగ్, ఆక్సిజన్ తగ్గుదల వంటి మేజర్ కాంప్లికేషన్స్ వారిలో తక్కువగానే ఉంటున్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తగ్గుతోంది. గుండెజబ్బు ఉన్న వాళ్లందరూ తమ మందులను యథావిధిగా కొనసాగించాలి. కాగా, వెంటిలేటర్‌పై పెట్టినా పరిస్థితి మరింత విషమించే పేషెంట్లకు ఎక్మో ద్వారా చికిత్స అందించాలి. ఇది ఖరీదైన ట్రీట్మెంట్ అయినా ఇటీవల వీటి వినియోగం బాగానే పెరిగింది. దీనిద్వారా ఊపిరితిత్తులు కొంత కోలుకునే అవకాశముంటుంది. ఇది పెట్టాక నెల తర్వాత కూడా కోలుకోకపోతే గుండె, ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. -
గుండె జబ్బుల వారు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగుల్లో గుండెపోట్లు పెరుగుతున్నాయి. లంగ్స్తోపాటు గుండెపైనా కోవిడ్ ప్రభావం అధికం కావడం ప్రపంచవ్యాప్తంగా వివిధ కేసుల్లో బయటపడుతున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తున్నం దున గొంతు ఆ తర్వాత ఊపిరితిత్తులపై దాడి ప్రారంభించి, అనంతరం గుండెను వివిధ రూపాల్లో ప్రభావితం చేస్తున్న కేసులు పెరుగుతున్నట్టుగా అంచనావేస్తున్నారు. ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటు మరణా లు పెరగడం, అంతకు ముందు కోవిడ్‌కు సంబంధించి లక్షణాలు బయట పడకుండానే వైరస్ గుండె ను ప్రభావితం చేయడం వంటివి చోటు చేసుకోవడంపై వైద్యవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. వెలుగులోకి కొత్త అంశాలు.. సార్స్–సీవోవీ–2 (కరోనా వైరస్) బారిన పడి ఇటీవల కోలుకున్న పలువురు పేషెంట్లపై వివిధ పరిశోధనలు జరిపిన సందర్భంగా కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏప్రిల్–జూన్‌ల మధ్య కోవిడ్ నుంచి కోలుకున్న వంద మంది పేషెంట్లపై విస్తృత పరిశీలన నిర్వహించారు. దీని ఆధారంగా రూపొందించిన అధ్యయనాన్ని తాజా గా ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్’లో ప్రచురించారు. వీరిలో 80 శాతం మందికి ఈ వ్యాధి కారణంగా గుండెలో మార్పులు చోటుచేసుకున్నట్టు (కార్డియాక్ మానిఫెస్టేషన్స్) గుర్తించారు. ఈ నివేదికల్లో వెల్లడైన విషయాలను బట్టి కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని అక్కడి వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హాస్పిటల్ పేషెంట్లతో పాటు మిగతా వారిని కూడా పరిశీలించినపుడు 78 మంది రోగుల్లో ‘కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్’, 60 మందిలో ‘హార్ట్ ఇన్ఫ్లమేషన్’ గుర్తించినట్టుగా ఈ స్టడీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పేషెంట్లు ఏ ప్రాంతానికి చెందినవారు, వీరి గుండె పరిస్థితి ఎలా ఉంది, రక్త పరీక్షలు, కార్డియోవాస్క్యులర్ మాగ్నెటిక్ రెసోనెన్స్ (సీఎంఆర్) స్కాన్ల ఆధారంగా ఆయా అంశాలను వారు అంచనావేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో 78 మంది సీఎంఆర్ స్కాన్లు అసాధారణంగా ఉన్నట్టు తేలింది. ఈ పేషెంట్ల హార్ట్ టిష్యూ శాంపిల్ అనాలిసిస్లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి గమనించారు. అయితే తాము తక్కువ మంది పేషెంట్లపై అధ్యయనం నిర్వహించినందున దానికి పరిమితులున్నాయని, కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడైనందున దీనిపై మరింత విస్తృత పరిశీలన నిర్వహించాల్సి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. లంగ్స్‌తో పాటు హార్ట్పైనా పెరుగుతున్న కోవిడ్ ప్రభావాలు, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో గుండెజబ్బులున్న పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.డి. శేషగిరిరావు ‘సాక్షి’కి వివరించారు. అప్రమత్తత అవసరం ‘కోవిడ్ పేషెంట్లలో లంగ్స్‌తో పాటు హార్ట్‌కు ఎఫెక్ట్ అయితే కొన్ని పరిణామాలు చోటు చేసుకుని గుండెకు రక్తప్రసారాలు బలహీనపడి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలు లేని కొందరు హఠాత్ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. వారిని పరీక్షించినపుడు రక్తం గడ్డకడుతున్న లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. కోవిడ్ టెస్ట్‌లు చేస్తే పాజిటివ్‌గా వస్తున్న కేసులూ ఉన్నాయి. దగ్గు, జలుబుతో పాటు లంగ్స్, హార్ట్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నరాల సమస్యలు, వాంతులు, విరోచనాలు వంటివి ఉన్న వారిలోనూ కేసులు బయటపడుతున్నాయి. శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాలను ఈ వైరస్ ప్రభావితం చేస్తోంది. ఎవరిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియనందున అందరినీ అనుమానంతో చూడా ల్సిందే. గుండె జబ్బులున్నవారు మరింత అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టెంట్లు వేసుకున్న వారు, హార్ట్ ఆపరేషన్ అయినవారు, హార్ట్ ఫెయిలయ్యే లక్షణాలున్నవారు మందులు మానేస్తే మళ్లీ ప్రమాదం ఎదురవుతుంది. యోగ, ధ్యానం, ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’. – డాక్టర్ శేషగిరిరావు -
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దాటేశామా..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి దేశంలో మూడో దశ దాటి నాలుగో దశలోకి అడుగుపెడుతోందా? ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌ను దాటి మరింత ముందుకు వెళ్లినట్లేనా? కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరగటంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా కొనసాగుతుండగా, మన రాష్ట్రం ప్రస్తుతం కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నా, వ్యాధి తీవ్రత, వ్యాప్తి నేపథ్యంలో మనకు ప్రస్తుత దశ ఎంతో కీలకమైందని చెబుతున్నారు. (ప్రైవేట్ ల్యాబ్‌లకు సర్కారు పరీక్ష) రాబోయే వారం, పది రోజుల్లో వైరస్ మరింతగా విజృంభించేందుకు అనుకూల పరిస్థితులున్నందున మాస్క్, వ్యక్తుల మధ్య దూరం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత శుభ్రత, ఇళ్లలోనూ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న స్థితిలో ప్రభుత్వపరంగా చేయగలిగింది చేస్తోందని, ప్రజలంతా స్వయం నియంత్రణ పాటించి, ఎవరికి వారే అప్రమత్తంగా వ్యవహరిస్తూ మెలగాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురుకానున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వివిధ రంగాల వైద్యనిపుణులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు.. వారి మాటల్లోనే.. (అతి పెద్ద కరోనా కేర్ సెంటర్ భారత్‌లో రెడీ!) స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష ‘ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్ల కొరత సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోజులుగా 800 పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున, అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దు. 60 ఏళ్ల పైబడిన వారు అస్సలు బయటకు రావొద్దు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవు. మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మందులు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే వీటితోనే పూర్తిగా నయమైపోతుందని భావించడం సరికాదు. వ్యాక్సిన్ రావడానికి కూడా కనీసం 6 నెలలు పడుతుంది. అందువల్ల ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కచ్చితమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం..’ – ప్రముఖ కార్డియాలజిస్ట్ డి.శేషగిరిరావు ఇళ్లలోనూ ఆరడుగుల దూరం ‘కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. బయటికి వెళ్లి వచ్చినవారు తమకేమి లక్షణాలు లేవనుకుని ఇంట్లోని పెద్దవారికి, చిన్న పిల్లలకు స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా బయటే కాదు ఇళ్లలోనూ వ్యక్తుల మధ్య దూరం (కనీసం ఆరడుగులు) కచ్చితంగా పాటించాలి. ఒకరికి వ్యాధి సోకితే సెకండరీ అటాక్‌లో భాగంగా ఇంట్లోని వారికి 40 శాతం ఇది వ్యాప్తి చెందుతుంది. పిల్లలకు పాలు పట్టే తల్లులు, పిల్లలను ఆడించే వారు మాస్క్‌లు పెట్టుకోవాలి. గవర్నమెంట్ లాక్డౌన్ ముగిసింది. ఇప్పుడు స్వయం విధిత లాక్‌డౌన్‌ను పాటించాలి. (డెక్సామెథాసోన్కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్) ప్రస్తుతం వేగంగా వైరస్ విస్తరిస్తున్నందున వివిధ రూపాల్లో స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు ఇప్పుడే ఎక్కువ అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. విటమిన్ సీ, డీతో జింక్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. 7, 8 గంటల పాటు నిద్రపోవాలి. పొగ తాగడం మానేయాలి. మాస్క్‌లు పూర్తిగా ముక్కు, నోరు కప్పేలా ధరించాలి. మాట్లాడేప్పుడు మాస్క్‌ను కిందకు జరిపితే ప్రయోజనముండదు. చీరకొంగు, చున్నీ, కర్చీప్ల వంటివి నోటికో, ముక్కుకో అడ్డుపెట్టుకుంటే సరిపోదు. వృద్ధులు, అనారోగ్యసమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..’ – పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ విశ్వనాథ్ గెల్లా కోవిడ్ స్టేజ్‌లు ఇలా.. స్టేజ్ 1: మహమ్మారి మొదటి దశలో వ్యాధి స్థానికంగా వ్యాప్తి చెందదు. అప్పటికే కోవిడ్ బారిన పడిన ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ట్రావెల్ హిస్టరీ ఉన్న వారు క్యారియర్లుగా పరిగణిస్తారు. వారి నుంచి నమోదైన కేసులనే ఫస్ట్ స్టేజ్‌గా పరిగణిస్తారు. మొదటిసారిగా ఈ వైరస్ బయటపడుతుంది. నియంత్రణకు అవకాశముంటుంది. స్టేజ్ 2: ఈ రెండో దశలో స్థానికంగానే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇది వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు వ్యాపిస్తుంది. ఈ స్టేజ్‌లో వైరస్ ఏ మేరకు ఎవరి నుంచి ఎవరికి అని గుర్తించి క్వారంటైన్‌కు పంపించే వీలుంటుంది. పాజిటివ్‌ల ఐసోలేషన్‌తో పాటు లక్షణాలున్న వారిని ట్రేస్ చేసే వీలుంటుంది. స్టేజ్ 3: మూడో దశను కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గానూ పరిగణిస్తారు. ఈ స్టేజ్‌లో ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఇది వ్యాప్తి చెందిందో కనుక్కోవడం కష్టం. ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారితో కాంటాక్ట్ కాకపోయినా ఇతరులకు సోకుతుంది. ఈ దశలో వ్యాప్తి వేగం పెరుగుతుంది. నియంత్రణ అనేది కూడా కష్టతరమవుతుంది. స్టేజ్ 4: వైరస్ వ్యాప్తి తీవ్రమై, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అవకాశముంటుంది. ఈ స్టేజ్‌లో నియంత్రణ అనేది దాదాపుగా అసాధ్యంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. అక్కడి జనాభాలోనే వ్యాప్తి చెంది మహమ్మారిగా రూపాంతరం చెందుతుంది. మరణాల సంఖ్య పెరుగుతుంది. -
ఈ దశ అత్యంత కీలకం!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉం దని స్పష్టంచేశారు. ప్రస్తుతం లాక్డౌన్లో సడలిం పులు, దశలవారీగా ఎత్తివేత చేపడుతున్న నేప థ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిం దని, ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని కొందరిలో ఏర్పడుతున్న భావన సరికాదన్నారు. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికి పాజిటివ్ లక్షణాలున్నాయనేది బయటపడక పోతుండటం వల్ల వారిని కరోనా పాజిటివ్‌లుగానే పరిగణిస్తూ మన వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన వారిలో 79% మంది వైరస్ లక్షణాలు కనిపించని (అసిమ్టమ్యాటిక్ కేసులు) వారేనని, 21% మంది లోనే ఈ లక్షణాలు బయటపడు తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో రెండింతల జాగ్రత్త చర్యలు తీసు కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వారు వైరస్ వ్యాప్తికి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉండ టంతో, ఇది సోకకుండా కచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేశాక ఈ సమస్య మరింత తీవ్రం కానుందని, వైరస్ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, న్యూమోనియా, గొంతు సమస్యలు వంటి కరోనా లక్షణాలు లేని వారిలోనూ పాజిటివ్ కేసులు నమో దవుతున్నాయని, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, డయాబెటీస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలోనూ ఈ కేసులు బయట పడుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరి స్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశా లను ‘సాక్షి’ఇంటర్వూ్యలో శేషగిరిరావు వివరిం చారు. ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే.. సార్స్, ఎబోలాల కంటే.. సార్స్, ఎబోలాలతో పోల్చితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎబోలా సోకిన వంద మం దిలో 70–80 మంది, సార్స్ సోకిన వంద మందిలో 10–15 మంది చనిపోతున్నారు. కరోనా విషయంలో 3–4% మరణాలే నమోదవుతున్నా, ఎబోలా, సార్స్‌తో పోల్చితే కరోనాతో పెద్ద సంఖ్యలో ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండటంతో దీని వల్ల మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. మన చుట్టూ వైరస్ ఉన్నవారు.. మనతో పాటు సమాజంలో మన చుట్టూ వైరస్ సోకిన వారు మనకు తెలియకుండానే కొనసాగు తారు. కమ్యూనిటీ స్ప్రెడ్ పెరిగి 60% మంది వరకు ఇది వ్యాపించడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం ఏర్పడుతుంది. క్రమక్రమంగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగాక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఒక సాధారణ ఫ్లూ, జలుబు వంటి లక్షణా లతో మనకు తెలియకుండానే తగ్గిపోయే స్థాయికి ఇది చేరుకుంటుంది. అయితే వ్యాక్సిన్లు అందు బాటులోకి వచ్చాక లేక మెజారిటీ ప్రజలకు ఇది అలవాటయ్యే పరిస్థితి వచ్చేందుకు కొంతకాలం పడుతుంది. మరో 6, 7 నెలలు ఇన్ఫెక్షన్లుంటాయి.. వ్యాక్సిన్ రావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చునంటున్నారు. అందువల్ల కనీసం మరో 6, 7 నెలల పాటు కరోనా ఇన్ఫెక్షన్లు కొనసాగుతాయి. ఈ వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరిస్థితులతో ఇంకొంతకాలం సహజీవనం చేయాల్సిందే. ఇక్కడ 3 రకాల వైరస్ స్ట్రెయిన్లు.. ప్రపంచంలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కరోనా వైరస్ స్ట్రెయిన్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. భారత్‌లో మూడు రకాల స్ట్రెయిన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఏ 2 ఏ స్ట్రెయిన్ ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఇమ్యూనిటీతో.. చిన్న వయసు నుంచి బీసీజీ టీకాలు, మలేరియా, టైఫాయిడ్, అమ్మవారు వంటి వాటికి మందులు, వ్యాక్సిన్లు తీసుకోవడం వంటివి మనలో ఈ వైరస్ నుంచి రోగ నిరోధక శక్తిని కల్పించడానికి దోహద పడుతోంది. భారతీయుల్లో జన్యుపరమైన రక్షణ, టీకాలతో వచ్చిన రోగ నిరోధక శక్తి వల్ల అమెరికా, ఇటలీ, బ్రిటన్ దేశాలతో పోలిస్తే ఇక్కడ తీవ్రత తక్కువ కనిపిస్తోంది. గ్లౌజుల వాడకం తప్పనిసరయ్యే చాన్స్ మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడంతోపాటు రాబోయే రోజుల్లో వైరస్ సోకకుండా ఉండేందుకు గ్లౌజుల వాడకం కూడా తప్పనిసరయ్యే అవకాశాలున్నాయి. వృద్ధులు బయటకు రావొద్దు.. 65 ఏళ్లు దాటిన వారు, గుండె జబ్బులు, కిడ్నీ, కేన్స ర్, డయాలిసిస్ చేసుకుంటున్నవారు, శ్వాస సంబం ధ సమస్యలున్న వారు మరో కొన్ని నెలల దాకా బయటకు రాకుండా చూడాలి. హోం క్వారం టైన్లో నూ వారు మాస్క్‌లు ధరించడం, కుటుంబం లోని ఇతర సభ్యుల నుంచి భౌతిక దూరం పాటిం చడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. హార్ట్ పేషెంట్లపైనా ప్రభావం.. గుండె సంబంధిత సమస్యలున్న వారు రాబోయే చాన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. బైపాస్ ఆపరేషన్, స్టెంట్లు వేయించుకున్న వారు, గుండె జబ్బున్న వారు తప్పనిసరిగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూనే క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయాలు ఇతర విటమిన్లు వచ్చే వాటిని తీసుకోవాలి. భవిష్యత్ గురించి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో ఉండాలి. యోగా, సింపుల్ వాకింగ్, మెడిటేషన్‌తో పాటు ఇష్టమైన సంగీతం వింటూ ప్రశాంతంగా ఉండాలి. గుండెనొప్పి వంటిది వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. -
కేసీఆర్ అందర్నీ కలుపుకొని పోలేరు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే మనస్తత్వం లేదని, రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడం కేసీఆర్ వల్ల కాదని బీజేపీ జాతీయ నేత ప్రొఫెసర్ శేషగిరి రావు అన్నారు. కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేయగల సామర్థ్యం కేసీఆర్‌కు లేదని అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పెంపు అంశం చాలా సున్నితమైందని, ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. కేసీఆర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటున్నారని, ఇది దేశంలో విపత్కర పరిస్థితులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో వైషమ్యాలు, అల్లర్లు, విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రంతో పోరాడాలని.. ఇలా మతం పేరుతో రిజర్వేషన్లంటూ ప్రకటనలు చేయొద్దని కేసీఆర్‌కు సూచించారు. -
పన్ను కట్టలేదని గీతకార్మికుల అరెస్టు
జనగామ అర్బన్: గీత కార్మికులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. జనగామకు చెందిన గీత కార్మికులు తాటి పన్ను కట్ట లేదన్న కారణంతో ఎక్సైజ్ సీఐ శేషగిరిరావు ఆదేశాల మేరకు ఎస్సై పవన్ తన సిబ్బందితో కలసి తాటి వనంలోకి వెళ్లారు. వనంలో ఉన్న బూడిద సత్యనారాయణ, పూజారి రమేశ్, బత్తిని ఉపేందర్, గంగాపురం సత్తయ్య, చిర్ర సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. రూ.72 వేలు పన్ను చెల్లిస్తేనే బయటకు పంపుతామం టూ స్టేషన్లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ కల్లు గీత కార్మిక సం ఘం(టీకేజీకేఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బూడిద గోపి నేతృత్వంలో పలువురు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్మికులను అరెస్టు చేయడంపై అధికారులను నిలదీశారు. పన్ను చెల్లించ వద్దని మంత్రి టి.పద్మారావు వెల్లడించారని, అలాంటప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నిర్బం«ధం విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్మికులను సాయంత్రం విడిచిపెట్టారు. దీనిపై జనగామ ఎక్సైజ్ సీఐ శేషగిరిరావు వివరణ కోరగా గీత కార్మికులను అరెస్టు చేయలేదని, తమ విధి నిర్వహణలో భాగంగా బకాయి ఉన్న డబ్బుల కోసం స్టేషన్‌కు తీసుకుని వచ్చామని తెలిపారు. -
రాజకీయాలవైపు తొంగిచూడని వ్యక్తి శేషగిరిరావు
చిన్నపెండ్యాల(స్టేషన్‌ఘన్‌పూర్) : మొదటి నుంచి రాజకీయాల వైపు తొంగి చూడకుండా ప్రజాసేవ కోసమే తపనపడిన వ్యక్తి శేషగిరిరా వు అని విరసం నేత వరవరరావు అన్నారు. చిన్నపెండ్యాలలో స్వాతంత్య్ర సమరయోధు డు పెండ్యాల శేషగిరిరావు సంస్మరణ సభ సా హితీసుధ ఘన్పూర్స్టేషన్ అధ్యక్షుడు పార్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి బస్వరాజు సార య్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్క ర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వరవరరా వు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఎన్నో మాట్లాడాని ఉందని, అయితే తనపై నిర్బంధాన్ని విధించడంతో మాట్లాడలేక పోతున్నానన్నారు. తన అన్న శేషగిరిరావు మొదట టీచర్‌గా, కారోబార్, పోస్టుమన్‌గా గ్రామానికి ఎన్నో సేవలు అందించారని అన్నా రు. తమ కుటుంబం మొదటి నుంచి ప్రజాసే వ కోసమే పరితపించిందని, అందులో మొట్టమొదట ఎంపీగా ఎన్నికైన పెద్ద రాఘవరావుతోపాటు తమ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు ఆస్తులు సంపాదించుకోలేదన్నారు. సీనియర్ జర్నలిస్టు నేరుట్ల వేణుగోపాలరావు మాట్లాడు తూ తమకున్న ఆస్తులను ప్రజలకు ఉపయోగపడేలా చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రీ య విద్యాలయ లెక్చరర్ పెండ్యాల హరి మా ట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన ఇంటిస్థలాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పెండ్యాల కొండల్రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కుటుంబాలకు కుటుంబాలే పాలుపంచుకున్నాయన్నారు. అందులో పెండ్యాల రామానుజరావు కుటుంబం ఒకటని, రామానుజరావు సోదరుడు శేషగిరిరావు ఉద్యమంలో కీలక భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు. ‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ ‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకాన్ని శేషగిరిరావు భార్య సుగుణ, పెండ్యాల దామోదర్‌రావు భార్య సరస్వతి, పెండ్యాల వరవరరావు, రాంచందర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం టీఎమ్మార్పీఎస్ నాయకులు వరవరరావును కలిశారు. సమావేశంలో భాష్యం వరదాచారి, రాజారపు ప్రతాప్, రాంచందర్‌రావు, ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సర్పంచ్ సమ్మయ్య, రామస్వామి, ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌కుమార్, ఎల్ఐసీ బుచ్చయ్య, పేరాల రాజమౌళి, పెండ్యాల ఉపేందర్‌రావు, టి.వెంకటయ్య, ఉప సర్పంచ్ గుంపుల రవీందర్‌రెడ్డి, తాళ్లపెల్లి రాజ్‌కుమార్‌గౌడ్, రవిగౌడ్, బాబుగౌడ్, ఈఎన్.స్వామి పాల్గొన్నారు. -
భూతగాదాలో రైతు హత్య
అనకాపల్లిరూరల్ : భూతగదాలో ఓ రైతు సోమవారం రాత్రి హత్యకు గురైయ్యాడు. మండలంలోని తుమ్మపాలలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ జి. చంద్ర అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మపాలకు చెందిన పిళ్లా నర్సింగరావు(నర్సిమ్మ)(58), పిళ్లా గంగునాయుడు వరసకు అన్నదములు. వీరికి శారదానది ఒడ్డున చెరో 40 సెంట్లు భూమి ఉంది. గంగునాయుడు కొన్నేళ్ల క్రితం తన భూమిని రిటైర్డ్ ఉద్యోగి శేషగిరిరావుకు అమ్మేశాడు. అందులో ఇసుక తవ్వే విషయంలో శేషగిరిరావు, గంగునాయుడు తరచూ గొడవ పడేవారు. శేషగిరిరావుకు తన సోదరుడు నర్సిమ్మ సహకరిస్తున్నాడంటూ గుర్రుగా ఉండేవాడు. ఈ క్రమంలో నర్సిమ్మను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పనిని తుమ్మపాలలో టైర్ల కొట్టు నిర్వహిస్తున్న ధనబాబుకు పురమాయించాడు. ధనబాబు తనషాపులో పనిచేస్తున్న అప్పన్న, మరో వ్యక్తి త్రినాథ్‌లతో కలిసి మందు తాగుదామంటూ నర్సిమ్మను సోమవారం రాత్రి శారదానది సమీపంలోకి తోటలోకి తీసుకెళ్లారు. నలుగురూ పూటుగా తాగారు. తిరిగి వస్తుండగా నర్సిమ్మను శారదానదిలో ముంచి ధనబాబు చంపేశాడు. చీకటి పడుతున్నా తండ్రి ఇంటికి రాకపోవడంతో నర్సిమ్మ కొడుకు సత్యనారాయణ పరిసర ప్రాంతాల్లో వెదికాడు. కానరాలేదు. త్రినాథ్‌ను తన తండ్రి గురించి వాకబు చేయగా 7 గంటల ప్రాంతంలో కలిసి మందు తాగామని చెప్పాడు. కాగా మంగళవారం బహిర్భూమికి వెళ్లిన పంచదార్ల రాము మృతదేహాన్ని చూశాడు. ఈ మేరకు మృతుని కుమారుడు సత్యనారాయణ త్రినాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు త్రినాథ్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన నర్సిమ్మకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నెం పున్నెం ఎరుగని వ్యక్తిని హత్య చేశారంటూ బంధువుల రోదనలు అక్కడివారిని కలిచి వేశాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అనుమానించాడు.. అంతం చేశాడు
భర్త చేతిలో మహిళదారుణ హత్య ఖమ్మం క్రైం: దాంపత్య జీవితంలో ముప్పై ఏళ్లుకలిసి పయనించినా ఆమెను అతడు నమ్మలేదు. అడుగుడుగునా అనుమానించాడు... అవమానించాడు. చివరకు అంతమొందించాడు. తోడునీడనై రక్షణ కల్పిస్తాని ప్రమాణాలు చేసినోడే కసాయిగా మారి కడతేర్చాడు. బుర్హాన్‌పురంలోని ఇరవై నాలుగు గంటల పంపు వద్ద ఉన్న కొండమ్మకోరి ప్రాంతానికి చెందిన అమృతపు సుభద్ర(50) భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ సంఘటన ఖమ్మంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సుభద్ర తన భర్త సత్యనారాయణతో కలిసి కిరాణ షాపు నిర్వహిస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. వీరిలో శేషగిరి, వెంకన్నకు వివాహం జరిగింది. శేషగిరి నేలకొండపల్లి, వెంకన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. చిన్నవాడైన సాయికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సత్యనారాయణకు షుగర్ రావడంతో కొంత కాలం క్రితం కాలు తొలగించారు. దీంతో కిరాణ షాపులోనే అతడు ఉంటున్నాడు. అతడికి భార్యపై మొదటి నుంచే అనుమానం. ఆమెను నిత్యం వేధించే వాడు. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు సాయి బయటకు వెళ్లడానికి చూసి సుభద్రపై సత్యనారాయణ ఇనుప చేతికర్రతో తలపై కొట్టాడు. దీంతో ఆమె కింద పడింది. ఆపై గొంతు నులిపాడు. గట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు తుడవడానికి సత్యనారాయణ యత్నించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా రాత్రి 2 గంటల సమయంలో దగ్గర్లోని బంధువుకు ఫోన్‌చేసి తన భార్య కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పాడు. దీంతో వారు చిన్నకూమారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. అతడు నేలకొండపల్లిలో ఉన్న అన్న శేషగిరికి సమాచారం అందించి ఇంటికి వచ్చాడు. అదేసమయానికి శేషగిరి కూడా ఖమ్మం చేరుకోవడంతో ఇద్దరు కలిసి వరండాలో ఉన్న సుభద్రను ఆస్పత్రికి తరలించటానికి ప్రయత్నం చేస్తుండగా ఆమె తల వెనుక భాగంలో తగిలిన దెబ్బను గమనించారు. అప్పటికే సుభద్ర మృతిచెంది ఉంది. అనుమానం వచ్చి తండ్రిని అడుగగా అతడు పొంతన లేకుండా మాట్లాడడంతో బండారం బయటపడింది. దీంతో ఇద్దరు కుమారులు కలిసి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ సారంగపాణి, ఎస్సై సురేష్ సందర్శించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకు హత్యకు ఉపయోగించిన చేతికర్రను స్వాధీన పర్చుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా సుభద్రపై పలుమార్లు సత్యనారాయణ దాడులు చేశాడని ఆమె కుమారులు తెలిపారు.