భూతగాదాలో రైతు హత్య | Bhutagada farmer's murder | Sakshi
Sakshi News home page

భూతగాదాలో రైతు హత్య

Published Wed, Jul 30 2014 1:25 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

Bhutagada farmer's murder

అనకాపల్లిరూరల్ : భూతగదాలో ఓ రైతు సోమవారం రాత్రి హత్యకు గురైయ్యాడు. మండలంలోని తుమ్మపాలలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ జి. చంద్ర అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మపాలకు చెందిన పిళ్లా నర్సింగరావు(నర్సిమ్మ)(58), పిళ్లా గంగునాయుడు వరసకు అన్నదములు. వీరికి శారదానది ఒడ్డున చెరో 40 సెంట్లు భూమి ఉంది. గంగునాయుడు కొన్నేళ్ల క్రితం తన భూమిని రిటైర్డ్ ఉద్యోగి శేషగిరిరావుకు అమ్మేశాడు.

అందులో ఇసుక తవ్వే విషయంలో శేషగిరిరావు, గంగునాయుడు తరచూ గొడవ పడేవారు. శేషగిరిరావుకు తన సోదరుడు నర్సిమ్మ సహకరిస్తున్నాడంటూ గుర్రుగా ఉండేవాడు. ఈ క్రమంలో నర్సిమ్మను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పనిని తుమ్మపాలలో టైర్ల కొట్టు నిర్వహిస్తున్న ధనబాబుకు పురమాయించాడు. ధనబాబు తనషాపులో పనిచేస్తున్న అప్పన్న, మరో వ్యక్తి త్రినాథ్‌లతో కలిసి మందు తాగుదామంటూ నర్సిమ్మను సోమవారం రాత్రి శారదానది సమీపంలోకి తోటలోకి తీసుకెళ్లారు. నలుగురూ పూటుగా తాగారు.

తిరిగి వస్తుండగా నర్సిమ్మను  శారదానదిలో ముంచి ధనబాబు చంపేశాడు. చీకటి పడుతున్నా తండ్రి ఇంటికి రాకపోవడంతో నర్సిమ్మ కొడుకు సత్యనారాయణ పరిసర ప్రాంతాల్లో వెదికాడు. కానరాలేదు. త్రినాథ్‌ను తన తండ్రి గురించి వాకబు చేయగా 7 గంటల ప్రాంతంలో కలిసి మందు తాగామని చెప్పాడు. కాగా మంగళవారం బహిర్భూమికి వెళ్లిన పంచదార్ల రాము మృతదేహాన్ని చూశాడు.
 
ఈ మేరకు మృతుని కుమారుడు సత్యనారాయణ త్రినాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు త్రినాథ్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన నర్సిమ్మకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నెం పున్నెం ఎరుగని వ్యక్తిని హత్య చేశారంటూ బంధువుల రోదనలు అక్కడివారిని కలిచి వేశాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement