సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి దేశంలో మూడో దశ దాటి నాలుగో దశలోకి అడుగుపెడుతోందా? ప్రస్తుతం కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌ను దాటి మరింత ముందుకు వెళ్లినట్లేనా? కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరగటంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా కొనసాగుతుండగా, మన రాష్ట్రం ప్రస్తుతం కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నా, వ్యాధి తీవ్రత, వ్యాప్తి నేపథ్యంలో మనకు ప్రస్తుత దశ ఎంతో కీలకమైందని చెబుతున్నారు. (ప్రైవేట్ ల్యాబ్లకు సర్కారు పరీక్ష)
రాబోయే వారం, పది రోజుల్లో వైరస్ మరింతగా విజృంభించేందుకు అనుకూల పరిస్థితులున్నందున మాస్క్, వ్యక్తుల మధ్య దూరం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత శుభ్రత, ఇళ్లలోనూ అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న స్థితిలో ప్రభుత్వపరంగా చేయగలిగింది చేస్తోందని, ప్రజలంతా స్వయం నియంత్రణ పాటించి, ఎవరికి వారే అప్రమత్తంగా వ్యవహరిస్తూ మెలగాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురుకానున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వివిధ రంగాల వైద్యనిపుణులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు.. వారి మాటల్లోనే.. (అతి పెద్ద కరోనా కేర్ సెంటర్ భారత్లో రెడీ!)
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
‘ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్‌మిషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్ల కొరత సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోజులుగా 800 పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున, అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దు. 60 ఏళ్ల పైబడిన వారు అస్సలు బయటకు రావొద్దు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవు. మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మందులు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే వీటితోనే పూర్తిగా నయమైపోతుందని భావించడం సరికాదు. వ్యాక్సిన్ రావడానికి కూడా కనీసం 6 నెలలు పడుతుంది. అందువల్ల ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కచ్చితమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం..’ – ప్రముఖ కార్డియాలజిస్ట్ డి.శేషగిరిరావు
ఇళ్లలోనూ ఆరడుగుల దూరం
‘కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. బయటికి వెళ్లి వచ్చినవారు తమకేమి లక్షణాలు లేవనుకుని ఇంట్లోని పెద్దవారికి, చిన్న పిల్లలకు స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా బయటే కాదు ఇళ్లలోనూ వ్యక్తుల మధ్య దూరం (కనీసం ఆరడుగులు) కచ్చితంగా పాటించాలి. ఒకరికి వ్యాధి సోకితే సెకండరీ అటాక్‌లో భాగంగా ఇంట్లోని వారికి 40 శాతం ఇది వ్యాప్తి చెందుతుంది. పిల్లలకు పాలు పట్టే తల్లులు, పిల్లలను ఆడించే వారు మాస్క్‌లు పెట్టుకోవాలి. గవర్నమెంట్ లాక్‌డౌన్ ముగిసింది. ఇప్పుడు స్వయం విధిత లాక్‌డౌన్‌ను పాటించాలి. (డెక్సామెథాసోన్కు కేంద్రం గ్రీన్సిగ్నల్)
ప్రస్తుతం వేగంగా వైరస్ విస్తరిస్తున్నందున వివిధ రూపాల్లో స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు ఇప్పుడే ఎక్కువ అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. విటమిన్ సీ, డీతో జింక్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. 7, 8 గంటల పాటు నిద్రపోవాలి. పొగ తాగడం మానేయాలి. మాస్క్‌లు పూర్తిగా ముక్కు, నోరు కప్పేలా ధరించాలి. మాట్లాడేప్పుడు మాస్క్‌ను కిందకు జరిపితే ప్రయోజనముండదు. చీరకొంగు, చున్నీ, కర్చీప్‌ల వంటివి నోటికో, ముక్కుకో అడ్డుపెట్టుకుంటే సరిపోదు. వృద్ధులు, అనారోగ్యసమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..’ – పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ విశ్వనాథ్ గెల్లా
కోవిడ్ స్టేజ్‌లు ఇలా..
స్టేజ్ 1: మహమ్మారి మొదటి దశలో వ్యాధి స్థానికంగా వ్యాప్తి చెందదు. అప్పటికే కోవిడ్ బారిన పడిన ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ట్రావెల్ హిస్టరీ ఉన్న వారు క్యారియర్లుగా పరిగణిస్తారు. వారి నుంచి నమోదైన కేసులనే ఫస్ట్ స్టేజ్‌గా పరిగణిస్తారు. మొదటిసారిగా ఈ వైరస్ బయటపడుతుంది. నియంత్రణకు అవకాశముంటుంది.
స్టేజ్ 2: ఈ రెండో దశలో స్థానికంగానే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇది వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు వ్యాపిస్తుంది. ఈ స్టేజ్‌లో వైరస్ ఏ మేరకు ఎవరి నుంచి ఎవరికి అని గుర్తించి క్వారంటైన్‌కు పంపించే వీలుంటుంది. పాజిటివ్‌ల ఐసోలేషన్‌తో పాటు లక్షణాలున్న వారిని ట్రేస్ చేసే వీలుంటుంది.
స్టేజ్ 3: మూడో దశను కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ గానూ పరిగణిస్తారు. ఈ స్టేజ్‌లో ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఇది వ్యాప్తి చెందిందో కనుక్కోవడం కష్టం. ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నవారితో కాంటాక్ట్ కాకపోయినా ఇతరులకు సోకుతుంది. ఈ దశలో వ్యాప్తి వేగం పెరుగుతుంది. నియంత్రణ అనేది కూడా కష్టతరమవుతుంది.
స్టేజ్ 4: వైరస్ వ్యాప్తి తీవ్రమై, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అవకాశముంటుంది. ఈ స్టేజ్‌లో నియంత్రణ అనేది దాదాపుగా అసాధ్యంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. అక్కడి జనాభాలోనే వ్యాప్తి చెంది మహమ్మారిగా రూపాంతరం చెందుతుంది. మరణాల సంఖ్య పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment