గుండె జబ్బుల వారు అప్రమత్తంగా ఉండాలి | Sakshi Special Interview With Doctor Seshagiri Rao | Sakshi
Sakshi News home page

హార్ట్‌పై అటాక్‌!

Published Sat, Aug 1 2020 3:36 AM | Last Updated on Sat, Aug 1 2020 3:55 AM

Sakshi Special Interview With Doctor Seshagiri Rao

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల్లో గుండెపోట్లు పెరుగుతున్నాయి. లంగ్స్‌తోపాటు గుండెపైనా కోవిడ్‌ ప్రభావం అధికం కావడం ప్రపంచవ్యాప్తంగా వివిధ కేసుల్లో బయటపడుతున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తున్నం దున గొంతు ఆ తర్వాత ఊపిరితిత్తులపై దాడి ప్రారంభించి, అనంతరం గుండెను వివిధ రూపాల్లో ప్రభావితం చేస్తున్న కేసులు పెరుగుతున్నట్టుగా అంచనావేస్తున్నారు. ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటు మరణా లు పెరగడం, అంతకు ముందు కోవిడ్‌కు సంబంధించి లక్షణాలు బయట పడకుండానే వైరస్‌ గుండె ను ప్రభావితం చేయడం వంటివి చోటు చేసుకోవడంపై వైద్యవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 

వెలుగులోకి కొత్త అంశాలు.. 
సార్స్‌–సీవోవీ–2 (కరోనా వైరస్‌) బారిన పడి ఇటీవల కోలుకున్న పలువురు పేషెంట్లపై వివిధ పరిశోధనలు జరిపిన సందర్భంగా కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏప్రిల్‌–జూన్‌ల మధ్య కోవిడ్‌ నుంచి కోలుకున్న వంద మంది పేషెంట్లపై విస్తృత పరిశీలన నిర్వహించారు. దీని ఆధారంగా రూపొందించిన అధ్యయనాన్ని తాజా గా ‘జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’లో ప్రచురించారు. వీరిలో 80 శాతం మందికి ఈ వ్యాధి కారణంగా గుండెలో మార్పులు చోటుచేసుకున్నట్టు (కార్డియాక్‌ మానిఫెస్టేషన్స్‌) గుర్తించారు. ఈ నివేదికల్లో వెల్లడైన విషయాలను బట్టి కోవిడ్‌ రోగుల్లో దీర్ఘకాలిక ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని అక్కడి వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ హాస్పిటల్‌ పేషెంట్లతో పాటు మిగతా వారిని కూడా పరిశీలించినపుడు 78 మంది రోగుల్లో ‘కార్డియాక్‌ ఇన్వాల్వ్‌మెంట్‌’, 60 మందిలో ‘హార్ట్‌ ఇన్‌ఫ్లమేషన్‌’ గుర్తించినట్టుగా ఈ స్టడీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పేషెంట్లు ఏ ప్రాంతానికి చెందినవారు, వీరి గుండె పరిస్థితి ఎలా ఉంది, రక్త పరీక్షలు, కార్డియోవాస్క్యులర్‌ మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ (సీఎంఆర్‌) స్కాన్ల ఆధారంగా ఆయా అంశాలను వారు అంచనావేశారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల్లో 78 మంది సీఎంఆర్‌ స్కాన్లు అసాధారణంగా ఉన్నట్టు తేలింది. ఈ పేషెంట్ల హార్ట్‌ టిష్యూ శాంపిల్‌ అనాలిసిస్‌లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి గమనించారు. అయితే తాము తక్కువ మంది పేషెంట్లపై అధ్యయనం నిర్వహించినందున దానికి పరిమితులున్నాయని, కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడైనందున దీనిపై మరింత విస్తృత పరిశీలన నిర్వహించాల్సి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. లంగ్స్‌తో పాటు హార్ట్‌పైనా పెరుగుతున్న కోవిడ్‌ ప్రభావాలు, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో గుండెజబ్బులున్న పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా.డి. శేషగిరిరావు ‘సాక్షి’కి వివరించారు. 

అప్రమత్తత అవసరం 
‘కోవిడ్‌ పేషెంట్లలో లంగ్స్‌తో పాటు హార్ట్‌కు ఎఫెక్ట్‌ అయితే కొన్ని పరిణామాలు చోటు చేసుకుని గుండెకు రక్తప్రసారాలు బలహీనపడి హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలు లేని కొందరు హఠాత్‌ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. వారిని పరీక్షించినపుడు రక్తం గడ్డకడుతున్న లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. కోవిడ్‌ టెస్ట్‌లు చేస్తే పాజిటివ్‌గా వస్తున్న కేసులూ ఉన్నాయి. దగ్గు, జలుబుతో పాటు లంగ్స్, హార్ట్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నరాల సమస్యలు, వాంతులు, విరోచనాలు వంటివి ఉన్న వారిలోనూ కేసులు బయటపడుతున్నాయి.

శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాలను ఈ వైరస్‌ ప్రభావితం చేస్తోంది. ఎవరిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియనందున అందరినీ అనుమానంతో చూడా ల్సిందే. గుండె జబ్బులున్నవారు మరింత అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టెంట్లు వేసుకున్న వారు, హార్ట్‌ ఆపరేషన్‌ అయినవారు, హార్ట్‌ ఫెయిలయ్యే లక్షణాలున్నవారు మందులు మానేస్తే మళ్లీ ప్రమాదం ఎదురవుతుంది. యోగ, ధ్యానం, ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’. – డాక్టర్‌ శేషగిరిరావు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement