సాక్షి, హైదరాబాద్: ఇటీవల యువత, మధ్య వయస్సు వారిలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జిమ్ చేస్తూ కొందరు, సాధారణ పనుల్లో ఉంటూనే మరికొందరు గుండెపోటుతో కుప్పకూలిపోయి అకాల మరణాల పాలవుతున్నారు. కొందరిలో కోవిడ్ సోకి తగ్గిన తర్వాత (పోస్ట్ కోవిడ్) ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా గుండెపోటు మరణాలకు కారణం అవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోట్లను నివారించడానికి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఒక అడ్వైజరీ (సలహాలు, సూచనల నివేదిక)ను విడుదల చేశారు. కొందరు కోవిడ్ సోకి కోలుకున్నా కూడా.. వైరస్ ప్రభావం వల్ల ఎండోథెలియం (గుండె రక్తనాళాల్లోని లోపలి పొర)లో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. యువతీ యువకుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీన్ని వెంటనే గుర్తించలేకపోతారని.. దీనితో ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణాలు సంభవిస్తున్నాయని విశ్లేషించారు.
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన అడ్వైజరీ ఇదీ..
►యువతీ యువకులు కూడా నిర్ణీత కాలంలో ఆ రోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు కనీసం రెండేళ్లకోసారి బీపీ పరీక్షలు చే యించుకోవాలి. 18–39 మధ్య వయసు వారు ఏడాదికోసారి, 40 ఏళ్లు దాటినవారు తరచూ బీపీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
►20 ఏళ్ల వయసు నుంచే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల గుండె జబ్బుల సమస్యను ముందుగా గుర్తించవచ్చు. పెద్దలు కనీసం 4 నుంచి 6 నెలలకోసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.
►గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో మధు మేహం (షుగర్) ఒకటి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా షుగర్ ఉంటే, ముందస్తుగానే షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
►గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. పండ్లు, బీన్స్, చిక్కుళ్లు వంటివి, చేపలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులు, తృణధాన్యా లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలి.
►ఎక్కువ ఉప్పు, చక్కెర ఉండేవి, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు, ఆల్కహాల్, మాంసం, కొవ్వు, పాల ఉత్పత్తులు, వేయించిన ఫాస్ట్ ఫుడ్, చిప్స్, కాల్చిన ఆహారం వంటివాటికి దూరంగా ఉండాలి.
►రోజూ 30 నుంచి 60 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన ఏరోబిక్ వ్యాయామం చేయాలి. లేదా వారానికి 75 నిమిషాలు రన్నింగ్ వంటి శ్రమతోకూడిన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
►ఎత్తుకు తగ్గ శారీరక బరువు ఉండేలా చూసుకో వాలి. 3 నుండి 5 శాతం వరకు బరువు తగ్గడం వల్ల రక్తంలో కొన్ని కొవ్వులు, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) తగ్గడం, టైప్–2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.
►ఏ వయసు వారైనా కంటి నిండా నిద్రపోవాలి. పెద్దలకు రాత్రిపూట కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. రోజూ ఒకే సమయాల్లో పడుకోవడం, మేల్కోవడం చేయాలి. పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా తగినంత నిద్రపోవడం సాధ్యమవుతుంది.
►మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. శారీరక శ్రమ, ధ్యానం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
►ధూమపానం, పొగాకు వాడకాన్ని నిలిపివేయాలి. ఈ అలవాటు ఇప్పటికిప్పుడు మానేసినా గుండె జబ్బు ప్రమాదం సగం తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment