సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మొత్తంగా ఆరుగురికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురు వైరస్ బారినపడినట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. లోకల్ కాంటాక్ట్ ద్వారా మంగళవారం కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ (57), ఆయన ఇంట్లోని వంట ఆవిడకు (33) కూడా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన ఆ అధికారి కుమారుడు ఇప్పటికే వైరస్ బారిన పడ్డాడు. మరోవైపు రాష్ట్రంలో 25వ పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తి ద్వారా ఓ మహిళకు కూడా లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది.
అయితే ఆమె ఎవరెవరితో కాంటాక్ట్ అయిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ద్వారా వారి కుమారుడికి, 10 మంది పాజిటివ్ వచ్చిన ఇండోనేసియా బృందంతో కలిసి తిరిగిన కరీంనగర్‌వాసికి లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకడం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో స్టేజికి చేరుకోవడం, ఇదే తీవ్రత కొనసాగితే మూడో స్టేజీకి కూడా వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 600 మందితో కలిసి... విదేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో వారి కుటుంబ సభ్యులలో 15 మందిని క్వారంటైన్ చేసినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు వచ్చిన ఫ్లైట్స్‌లో ఎవరెవరు ప్రయాణించారన్న సమాచారం ఇవ్వాలని ఎయిర్‌పోర్టు అధికారులకు వైద్య, ఆరోగ్యశాఖ లేఖ రాసింది. వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సుమారు 600 మంది కలిసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
వాళ్లలో కొంత మంది ఇప్పటికే క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసుకోగా సుమారు 400 మంది ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇండోనేసియా బృందంతో తిరిగిన 62 మందిని కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం రాపిడ్ రెస్పాన్డ్ టీంలో పని చేస్తున్న అధికారికి లక్షణాలు కనపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రస్తుతం ప్రసవానికి సిద్ధమైన వారు రోజుకు 1,650 మంది ఉంటారని సర్కార్ అంచనా వేసింది. ఎవరెవరు ఏ రోజున ప్రసవం అవుతారో ఆ ప్రకారం ఆ తేదీన వారిని ప్రత్యేకమైన అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు చేర్చాలని వైద్య శాఖ నిర్ణయించింది. (దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు)
మంగళవారం నమోదైన విదేశీ ప్రయాణికుల వైరస్ కేసులు...
►రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన 49 ఏండ్ల వ్యక్తి. ఈయన ఇటీవల లండన్ వెళ్లొచ్చాడు.
►రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన 39 ఏండ్ల మహిళ. ఈమె ఇటీవల జర్మనీ నుంచి వచ్చారు.
►హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన 61 ఏండ్ల మహిళ. ఈమె ఇటీవల సౌది అరేబియా నుంచి వచ్చారు
Comments
Please login to add a commentAdd a comment