శామీర్‌పేట్: ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్‌భట్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోనూ సోదాలు
కరీంనగర్‌క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్‌లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం.
ఏడాది నుంచి తిరుగుతున్నా...
ధరణి పోర్టల్‌లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.
తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment