అనుమానించాడు.. అంతం చేశాడు
భర్త చేతిలో మహిళదారుణ హత్య
ఖమ్మం క్రైం: దాంపత్య జీవితంలో ముప్పై ఏళ్లుకలిసి పయనించినా ఆమెను అతడు నమ్మలేదు. అడుగుడుగునా అనుమానించాడు... అవమానించాడు. చివరకు అంతమొందించాడు. తోడునీడనై రక్షణ కల్పిస్తాని ప్రమాణాలు చేసినోడే కసాయిగా మారి కడతేర్చాడు. బుర్హాన్‌పురంలోని ఇరవై నాలుగు గంటల పంపు వద్ద ఉన్న కొండమ్మకోరి ప్రాంతానికి చెందిన అమృతపు సుభద్ర(50) భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ సంఘటన ఖమ్మంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సుభద్ర తన భర్త సత్యనారాయణతో కలిసి కిరాణ షాపు నిర్వహిస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు.
వీరిలో శేషగిరి, వెంకన్నకు వివాహం జరిగింది. శేషగిరి నేలకొండపల్లి, వెంకన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. చిన్నవాడైన సాయికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సత్యనారాయణకు షుగర్ రావడంతో కొంత కాలం క్రితం కాలు తొలగించారు. దీంతో కిరాణ షాపులోనే అతడు ఉంటున్నాడు. అతడికి భార్యపై మొదటి నుంచే అనుమానం. ఆమెను నిత్యం వేధించే వాడు. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు సాయి బయటకు వెళ్లడానికి చూసి సుభద్రపై సత్యనారాయణ ఇనుప చేతికర్రతో తలపై కొట్టాడు. దీంతో ఆమె కింద పడింది. ఆపై గొంతు నులిపాడు.
గట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు తుడవడానికి సత్యనారాయణ యత్నించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా రాత్రి 2 గంటల సమయంలో దగ్గర్లోని బంధువుకు ఫోన్‌చేసి తన భార్య కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పాడు. దీంతో వారు చిన్నకూమారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. అతడు నేలకొండపల్లిలో ఉన్న అన్న శేషగిరికి సమాచారం అందించి ఇంటికి వచ్చాడు. అదేసమయానికి శేషగిరి కూడా ఖమ్మం చేరుకోవడంతో ఇద్దరు కలిసి వరండాలో ఉన్న సుభద్రను ఆస్పత్రికి తరలించటానికి ప్రయత్నం చేస్తుండగా ఆమె తల వెనుక భాగంలో తగిలిన దెబ్బను గమనించారు.
అప్పటికే సుభద్ర మృతిచెంది ఉంది. అనుమానం వచ్చి తండ్రిని అడుగగా అతడు పొంతన లేకుండా మాట్లాడడంతో బండారం బయటపడింది. దీంతో ఇద్దరు కుమారులు కలిసి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ సారంగపాణి, ఎస్సై సురేష్ సందర్శించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకు హత్యకు ఉపయోగించిన చేతికర్రను స్వాధీన పర్చుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా సుభద్రపై పలుమార్లు సత్యనారాయణ దాడులు చేశాడని ఆమె కుమారులు తెలిపారు.