subhadra
-
కారుకూతలు కూస్తే ఖబడ్దార్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కారుకూతలు కూస్తూ... లేనిపోని రాద్ధాంతాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం నాయకులకు జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ సంఘటనను బూచిగా చూపిస్తూ టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపైన దాడికి పాల్పడిన వీళ్లా మహిళల రక్షణ గురించి ప్రశ్నించేదన్నారు. ఇదేనా మహిళలపై గౌరవమని ధ్వజమెత్తారు. మచ్చలేని ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌పై బురద చల్లేందుకు గోతికాడి గుంట నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మహిళల రక్షణకు దిశ చట్టంగా మార్చేందుకు సహకరించపోవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో బాలికపై ఓ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఆనాడు ఓ గిరిజన ఎమ్మెల్యేపైన దేశ ద్రోహం కేసు నమోదు చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ అక్కచెల్లెలు అని ప్రశ్నించారు. చట్టసభలో ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో వనజాక్షి, రితేశ్వరి లాంటి బాధిత మహిళలు ఎందరో ఉన్నారన్నారు. ఎన్నో కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉనికి చాటుకోవడానికి లేనిపోని రాద్ధాంతాలు చేసి అభాసు పాలవుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే వి«ధంగా ప్రజల్లోకి వెళ్లండి, చిల్లర వేషాలు మానుకోవాలని హితువు పలికారు. పేదలకు పట్టాల పంపిణీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి:ఉన్మాద పాలన ఘనత చంద్రబాబుది: రాష్ట్రంలో ఉన్మాద పాలన సాగించిన ఘనుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. తహసీల్దార్పైన, అధికారులపైనా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వేధింపులు, చిత్రహింసలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిక్కుబిక్కుమంటూ మహిళలు గడిపేవారన్నారు. దిశా యాప్‌తో మహిళలు నేడు ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలు అందరికి అర్థమవుతున్నాయన్నారు. మాది ఆడబిడ్డలకు అండగా ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు 50 శాతం నామినేటెడ్ పదవులతో ఉన్నత స్థానంలో కూర్చొబెట్టామన్నారు. అగ్రవర్గాల మహిళలకు ఈబీసీ కింద రుణాలు, గ్రామ సచివాలయాల్లో 2 లక్షల ఉద్యోగులు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యల చేయడానికి వంగలపూడి అనితకు అర్హత లేదన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే హేళన చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బెయిల్ కోర్టులిస్తాయా.. ప్రభుత్వాలు ఇస్తాయో మాజీ ఎమ్మెల్యే అనితకు తెలియకపోవడం దురదృష్టమన్నారు. 14 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేయలేని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని కోరుతున్నానన్నారు. నారా లోకేష్ పీఏ టీడీపీ ఆఫీస్‌లో ఇబ్బందులున్నాయని చెప్పినప్పడు తెలుగు మహిళల నోరు ఎందుకు లేవలేదన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్లో అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధాలున్నాయని తెలిసినప్పడు నిరసన ఎందుకు చేయలేదన్నారు. ధ్వజమెత్తిన మహిళా నాయకులు... రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ మహిళా నాయకులు హెచ్చరించారు. దిశ యాప్ పట్ల లేనిపోని రాద్ధాంతం చేయాలని చూస్తే మహిళలు ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు కొండా రమాదేవి, పిళ్లా సుజాత, చొక్కాకుల లక్ష్మి, మాధవివర్మ, చిన్నతల్లి, వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు పేడాడ రమణకుమారి, నల్ల కృపాజ్యోతి హెచ్చరించారు. (చదవండి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి) -
‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా సుభద్ర..'
ఆర్యా రాజేంద్రన్ (21) గురించి ఆ మధ్య దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఆర్య చిన్న వయసులో తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికవడమే అందుకు కారణం. ఆర్య వయసు అమ్మాయే సుభద్ర. ఇరవై ఒక్కేళ్లు. అయితే తనేమీ రాజకీయాల్లో లేదు. తనింటి కోసం నాలుగు పనులు చేస్తోంది. ఆ ఘనతే ఆమెను ఊళ్లో వండర్ గర్ల్‌గా నిలబెట్టింది. సుభద్ర పాఠాలు చెబుతుంది. డిగ్రీ చదివింది కనుక అంతవరకు ఒకే. అయితే అదొకటే ఆమెకు ఉపాధి కాదు. పొలం పనులు చేస్తుంది. పుట్టగొడుగుల సాగు పనులు చూస్తుంది. రైతుల్నించి పాలు సేకరించి డైరీలకు రవాణా చేయిస్తుంది. పిండి మర నడుపుతుంది. ఒడ్ల నుంచి పొట్టు తీస్తుంది. ఇంకా కొన్ని బండ పనులు, భారమయ్యే పనులు మీద వేసుకుంది. అన్ని పనులూ కుటుంబ పోషణ కోసం. సాధారణంగా గ్రామాల్లో ఈ తరహా పనులన్నీ మగవాళ్లే చేస్తారు. ఒడిశా, జైపూర్ జిల్లాలోని మారుమూల గ్రామం ‘బందా’ సుభద్ర వాళ్లది. ఇంట్లో ఆమెతో కలిపి ముగ్గురే ఉంటారు. తండ్రి, అన్న, తను. తల్లి లేదు. అన్నకు ఉద్యోగం లేదు. తండ్రి అప్పులు చేయడంతో అవి తీర్చందే ఆయన ఊరు దాటి వెళ్లి పరిస్థితి లేదు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు పండించేవాడు. పాడి రైతుల నుంచి పాలను చుట్టుపక్కల డెయిరీలకు సరఫరా చేసేవాడు. వరి పొట్టు తీసేవాడు. అలా కొంత డబ్బు వచ్చేది. అన్న ఇంజినీరింగ్ చేసే సమయంలో తండ్రికి ఆ పనుల్లో సహాయం చేసేది సుభద్ర. ‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా..’ అంటున్నా వినిపించుకునే కాదు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నాన్న కూలబడిపోతాడు. కూలబడే వరకు ఎందుకు చేయడం? ఎందుకంటే.. అప్పు తీరాలి. ఐదేళ్ల క్రితం కొడుకు చదువు కోసం యాభై వేల రూపాయలు అప్పు చేశాడాయన. ఆ అప్పు సంగతీ, అదింకా తీరని సంగతీ సుభద్రకు తెలుసు. పిల్లలిద్దరికి డిగ్రీలు చేతికి వచ్చేసరికి అజయ్‌కి (సుభద్ర తండ్రి) అప్పు తీర్చాల్సిన నోటీసులు చేతికొచ్చాయి. వాస్తవాన్ని గ్రహించింది సుభద్ర. అన్నయ్యని ఉద్యోగం వెతుక్కోమని చెప్పి తను ఊళ్లో పనుల్లో పడిపోయింది. అప్పు తీర్చడం, నాన్నకు సహాయంగా ఇంటిని నడిపించడం ఇప్పుడు ఆమె బాధ్యతలు. గత ఏడాదే సుభద్ర తమ గ్రామానికి దగ్గర్లోని ఛటియాలోని ఎం.హెచ్.డి. మహావిద్యాలయ కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. పేరుకు రెండు ఎకరాలున్నా, పంట దిగుబడులు లేవు. వడ్ల పొట్టు తీసే మిషన్ సొంతదే అయినా కరెంట్ బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్ తీసేశారు. వేరే రాబడులూ తగ్గిపోయాయి. ఆ స్థితిలో తండ్రికి సహాయంగా కాక, ఇంటికి సహాయంగా దొరికిన పనులన్నీ మీద వేసుకుంది సుభద్ర. ఊళ్లో వాళ్లు కూడా.. ‘ఆడపిల్ల ఇంత అలసిపోవడం ఏంటమ్మా..’ అని వారించారు. ఆమె వినలేదు. వినే పరిస్థితీ లేదు. తను ఇంటర్ చదివేటప్పటి నుంచే పిల్లలు పాఠాలు చెబుతుండేది. ఆ అనుభవంతో ట్యూషన్లు మొదలుపెట్టింది. ట్యూషన్లకు, తక్కిన పనులకు ఆమె చేసుకున్న సమయ విభజన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘అద్భుతమైన అమ్మాయి’ అనే మాట తప్ప ఆమెకు ఇంకే ప్రశంసా సరిపోదని అనిపిస్తుంది. సుభద్ర రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తుంది. పొలానికి వెళుతుంది. తొమ్మిది వరకు పొలం పనులు. ఇంటికొచ్చాక దైనందిన చర్యలు ముగించుకుని రైతుల్నించి పాలు సేకరించడానికి వెళుతుంది. వాడుకకు కుదుర్చుకున్న వాహనాలలో ఆ పాలను డైరీలకు చేరుస్తుంది. తర్వాత వడ్ల పొట్టు తీసే పని, పిండి మర నడిపే పని. ఇవన్నీ ఉదయం 11 సాయంత్రం 6 ఆరు గంటల మధ్య జరిగిపోతాయి. మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే తమ పొలంలోని పుట్టగొడుగుల పంట బాగోగులు పరిశీలిస్తుంది. ఆరు తర్వాత ట్యూషన్‌కు వచ్చే 40 మంది పిల్లలతో మళ్లీ బిజీ. ఆమె ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు కానీ, నెలంతా ఇలా కష్టపడితే వచ్చేది దాదాపు 30 వేల రూపాయలు. డబ్బు కన్నా కూడా ఆమెకు ఒకటి అనుభవం అయింది. ‘‘కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకోవడమే జీవితం. జీవితమే ఉపాధి చూపిస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాలి. మగ పని అని చతికిల పడకుండా.. మనిషి పని అనుకుని గడప దాటాలి’’ అంటుంది సుభద్ర. తనొక పెద్ద పారిశ్రామిక వేత్త అయి, ఊరికి దగ్గరల్లో మంచి వృద్ధాశ్రమం నెలకొల్పాలని ఆమె ధ్యేయం. -
మథనం
చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి. సుభద్ర కూర వండిన కళాయిని కట్టెల పొయ్యి మీద నుంచి పైకి తీసింది. దాన్ని బాగా శుభ్రం చేసి, తిరిగి పొయ్యి మీద పెట్టింది. అప్పుడే తెప్పించిన కవోయీ చేపల్ని పసుపు నీటితో కడిగింది. కళాయిలో వేడెక్కిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటిగా వేసింది. వాటి జీవకణాలు తప్పనిసరి మరణానికి వ్యతిరేకంగా పోరాడి ఓడిపోతున్నాయి. ఒక్కొక్కటే చిన్న విల్లు ఆకారాన్ని పొందుతున్నాయి. గతంలో ఆమె సోదరుడు కూడా సైనికుల కాల్పుల్లో చనిపోతూ ఇలాగే విల్లులా వొంగిపోయాడు.సుభద్ర చేపల్ని గరిటెతో ఇటూ అటూ తిప్పింది. వాటి చలనం క్రమంగా మందగించింది. బాగా వేగిపోయాయి. వాటిని కళాయిలోంచి తీసి ఒక ఇత్తడి పళ్లెంలో వేసింది. అవి నిర్జీవంగా పడి ఉన్నాయి. వాటి కళ్లు మాత్రం నిలబడిపోయి ఆమె వైపే చూస్తున్నట్లున్నాయి.గతంలో ఆమె తండ్రి కూడా సైనికుల బాయినెట్ల పోట్లకు నేల మీద వెల్లకిలా పడి చనిపోయాడు. అతని కళ్లు కూడా ఇలాగే నిలబడిపోయాయి.ఈ మధ్య ఈ చేపల్ని ఆమె అసలు తినలేకపోతున్నది. కాని అకోన్‌కు ఈ చేపలంటే ఇష్టం. కాస్తంత గోధుమ రంగు వచ్చేట్టు వేయిస్తే చాలా ప్రీతిగా తింటాడు.ఇంతలో తన ఇంటి గేటుని ఎవరో తెరుస్తున్నట్లయింది. బహుశా అకోన్ కావచ్చు అని భావించి తలుపు తెరిచి చూసింది. కాని కాదు. ఒక మేక తన కొమ్ములతో గేటుని తెరవడానికి ప్రయత్నిస్తున్నది. నిరాశతో తలుపు మూసేసింది. వేయించిన చేపలు గల పళ్లెం మీద మూతపెట్టింది. వరండాలో చిన్న బల్ల వేసుకుని కూర్చున్నది.గాఢాంధకారం నెమ్మదిగా ప్రపంచాన్ని అలముకుంటున్నది. ఇటువంటి కాళరాత్రే అప్పటికి ఎంతోకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆమె సోదరుడు ఆమెని చూడటానికి ఇంటికి వచ్చాడు. వెంటనే ఒక కప్పు టీ తయారు చేసింది. కాని ఆ టీని అతడు ఒక గుక్క కూడా తీసుకోకుండానే ఇంటి బయట విజిల్ మోగింది. తక్షణం అతడు చీకట్లో కలిసిపోవడానికి వీలుగా పెరటి ద్వారం గుండా పరుగెత్తాడు. వెనువెంటనే ఆమెకు తుపాకీ పేలిన శబ్దం వినపడింది. సోదరుడి బలమైన తొడలు ఈ చేపల్లాగే గిలగిలా కొట్టుకుని చచ్చుపడిపోయాయి.కొందరు పురుషులు బరువైన బూట్లతో భుజాల మీద తుపాకీలతో సుభద్ర వైపు రావటాన్ని ఆమె తండ్రి గమనించాడు. ఆమెకు అడ్డంగా నిల్చున్నాడు. వారు అతణ్ణి సులువుగానే ఈడ్చి నేల మీద పడేశారు. బాయినెట్ మొనలతో పొడిచి, బూట్లతో తన్ని తోసేశారు. అతడు వెల్లకిలా పడిపోయాడు. అతని నోటి నుంచి రక్తం స్రవించడాన్ని సుభద్ర చూసింది. అతడి కళ్లు కూడా నిలబడిపోయాయి. భయభ్రాంతురాలై పెరటి ద్వారం గుండా పరుగెత్తింది. కాని దుండగులు ఆమెని వెంబడించారు. పెరటి కొలను ఒడ్డున పొగడ చెట్టు కింద ఆమె వారికి చిక్కిపోయింది. వారు ఆమె పొడవైన జడని పట్టుకున్నారు. తప్పించుకుని పారిపోవడానికి శతవిధాల ప్రయత్నించింది. కాని విఫలమైంది. వారు ఆమె దుస్తుల్ని ఒలిచేశారు. సైనికులు ఒక పద్ధతి ప్రకారం ఆమె హృదయంలో ప్రేమగా పదిలంగా దాచుకున్న పవిత్రతని చీలికపేలికల్ని చేసి పోయారు.ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలీదు. కాని ఆస్పత్రిలో కళ్లు తెరవగానే మొదట చూసింది అకోన్ మెరుపు కళ్లనే. ఆమెలో విషాదం పెల్లుబికింది. తన సొంతమైన, రహస్యమైన, నిద్రాణమైన భావనా మహారణ్యంలోని వృక్షాలు ఒకదాని తర్వాత ఒకటి నేల కూలిపోసాగాయి. మధురమైన గీతాల్ని ఆలపించిన పక్షులు రెక్కలు తెగి ఇప్పుడే తను మాడ్చిన కవోయి చేపల్లా నేలపై నిర్జీవంగా పడిపోయాయి. ఆమె తనదనుకున్న సర్వమూ ఎడారిమయమైపోయింది. ఆమె ఆశలూ ఆశయాలూ కలలూ కోరికలూ పాతాళానికి కృంగిపోయాయి. చెప్పలేని, చెప్పుకోలేని బాధ ఆమెని ఆవహించింది. అకోన్ ఆమె చేతుల్ని పైకెత్తి పట్టుకుని కన్నీరు తుడిచాడు.బాధోదేవిని తులసి, త్రికంటక మొక్కల మధ్యనున్న ఒక సమున్నతమైన వేదికపై ప్రతిష్ఠించి, పవిత్రంగా పూజిస్తారు. సుభద్ర తన శరీరాన్ని అంతవరకు అంతే పునీతంగా అనాఘ్రాతంగా కాపాడుకున్నది. ఆ స్థితిలోనే అకోన్‌కు సమర్పించాలనుకున్నది. కాని ఆ కిరాతకులు ఆమె శరీరాన్ని ఒక దోసపండు మాదిరిగా చిదిమి నమిలేశారు. అకోన్‌కు ఏమీ మిగల్లేదనే వేదన ఆమెని బలంగా ఆవహించింది.అయినా అకోన్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలోకి ఆహ్వానించాడు. బోకుల్ పుష్పాల పరిమళం గల చుంబనని అందించాడు. కాని సుభద్ర గత పీడకల నుంచి విముక్తురాలు కాలేకపోయింది. అకోన్ ఆలింగనలో ఉన్నప్పుడు కూడా ఆమె వేడినూనెలో చుట్టుకుపోయిన చేపలాగే వంకర్లు తిరిగేది. ఆమె శరీరం తిరుగుబాటు చేసేది. అకోన్ సముదాయించేవాడు. కాని ఆమె అపరాధనాభావం నుంచి తప్పుకోలేకపోయింది. మనసులు ఒకటిగా ఉన్నా, శరీరాలు వేరుగా ఉండేవి. అకోన్ బోకుల్ పుష్పాల సువాసనని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించేది. కాని ఆనాటి వేడి నిట్టూర్పుల దుర్భరమైన దుర్వాసన ఆ సువాసనని తుడిచివేసేది. ఆమె భయాల్ని తొలగించడానికి అకోన్ ఎంతగానో ప్రయత్నించేవాడు. మృదువుగా తాకి లాలించి ఆలింగనం చేసుకునేవాడు. కాని ఆమెలో ఏమాత్రమూ స్పందన కలిగేది కాదు. అకోన్ విసిగిపోయాడు. ఒకవిధమైన అలసటా అసహాయతా ఆవరించాయి. ఆశాంతితో అల్లాడిపోయాడు.కాలం గడుస్తున్నది. గ్రీకు పురాణాల్లోని టాంటాలిస్లాగా చుట్టూ నీటిని పెట్టుకుని దాహంతో అలమటించేవారు.నెమ్మదిగా అకోన్‌కు సుభద్ర మానసిక వైకల్యం అర్థమైంది. అకోన్ భౌతికావసరాలు తీరడంలేదని ఆమెకూ తెలుస్తున్నది. ఇద్దరూ పక్కపక్కనే నిద్రపోయేవారు. వారి చేతి వేళ్లు అల్లుకునే ఉంటాయి. కళ్లు తెరుచుకునే ఉంటాయి. కాని రెండు శరీరాల మధ్య వేల మైళ్ల దూరం ఉన్నట్లుంటుంది.ఈ దశలో సుభద్ర ఎంతో ఆలోచించింది. అకోన్కి దీపాలీతో పెళ్లిని ప్రతిపాదించింది. అకోన్ వ్యతిరేకించాడు. కాని అతణ్ణి ఒప్పించింది. చివరికి అకోన్‌ని దీపాలీకి సమర్పించింది. ఈ ఏర్పాటు తప్పనిసరైంది.ఇప్పుడు సుభద్ర అకోన్‌ని గత ఐదు నెలలుగా చూడలేదు. అతడు ఎప్పుడూ ఇంతకాలం సుభద్ర నుంచి దూరంగా ఉండలేదు. ప్రతిరోజూ ప్రతిక్షణమూ అతని కోసమే ఎదురుచూస్తున్నది. చిన్న గాలి తెర కూడా ఆమెను ఉత్తేజితం చేస్తున్నది.ఎవరో గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అకోన్ కావచ్చు. ఒక్కసారిగా ఆమె సంతోషపు ఉద్వేగానికి లోనైంది. కాని ఆ మనిషి దగ్గరకు వచ్చేసరికి అకోన్ కాడని గుర్తించింది. బాపూ కోన్ అనే బంధువు నిన్నటి దినపత్రిక పట్టుకొని వచ్చి ఇచ్చాడు. వారికి నిన్నటి దినపత్రిక ఈరోజు సాయంకాలానికి వస్తుంది. ఆ ఊరికి పట్నం నుంచి వెళ్లే ఒకే ఒక్క బస్సు ఉన్నది. ఆ బస్సులోనే దినపత్రిక ఒక దినం ఆలస్యంగా వస్తుంది. ఆమె పేపరు అందుకొని పక్కన పెట్టేసింది. దాన్ని తిరగవెయ్యాలని ఆమెకు అనిపించలేదు.సుభద్ర పరుపుమీద చేరబడింది. ప్రపంచమే ఆమెకు శత్రువైనప్పుడు ఇంక చేసేదేముంది?ఈ మధ్య అకోన్ పరోక్షంలో ఆమె మనస్సు దేనిపైనా లగ్నం కావడం లేదు. ఏమీ ఆలోచించలేకపోతున్నది. ఏమీ చెయ్యలేకపోతున్నది. రోడ్డు పక్కన ఉన్న కాలువలో చేపలు పట్టడానికి స్నేహితురాళ్లతో కలసి వెళుతుంది. కాని వెదురు వల వైపు చేపల్ని రొప్పటం మరచి పరధ్యానంగా చూస్తూ ఉండిపోతుంది. కొన్నిసార్లు చేతికి దొరికిన చేపల్ని తన పక్కనున్న బుట్టలో వెయ్యడానికి బదులుగా తిరిగి వల వైపు పడవేస్తుంది. సాయంకాలమయ్యే సరికి అకోన్ ఇంటి వద్దకు వెళుతుంది. నేలకు ఒంగిన ఉసిరి కొమ్మల మధ్య నిలుచుంటుంది. దాని కాండంలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అకోన్ ఇంటి వద్ద ఉంటే ఆ కొమ్మ మీదనే ఎక్కువ కాలం కూర్చొని గడుపుతుంటాడు.‘‘సుభద్రా! నువ్వు తిన్నావా?’’ పినతల్లి పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చింది. ‘‘తిన్నాను’’ అబద్ధం చెప్పింది. ‘‘ఆకుకూర చేశాను. నీకు కావాలా?’’ సుభద్ర అడిగింది.‘‘ఇవ్వు. నాకూ ఇష్టమే’’ పినతల్లి ఉత్సాహంగా అడిగింది. సుభద్ర ఆమెకు ఆకుకూరతో పాటు వేయించిన చేపల్నీ ఇచ్చింది. ఎందుకంటే చనిపోయిన ఆ చేపల కళ్లు రాత్రంతా తన వైపే చూడటాన్ని సుభద్ర భరించలేదు. చంపబడ్డ ఆమె తండ్రి జ్ఞాపకాలు ఆమెని వేధిస్తాయి.ఒక గ్లాసు మంచినీరు తాగి తలుపు మూసుకుని పరుపు మీదకు చేరింది. ‘‘అకోన్ తనని మరచిపోయాడా? ఈ భావం ఆమె తలను పదే పదే గుచ్చసాగింది. మానసికారణ్యంలో ఒకప్పుడు కూలిపోయిన చెట్లు ఇప్పుడు మట్టిలో కలసిపోయినట్లుగా భావిస్తున్నది. ఒకప్పుడు ఆ నేల కళకళలాడుతుండేది. కాని ఆ అవశేషాలు కూడా ఇప్పుడు శాశ్వతంగా మాయమయ్యాయి.దీపాలీతో పెళ్లికి అకోన్ను ఒప్పంచింది తనే. అతణ్ణి దీపాలీకి అప్పచెప్పింది తనే. మరి ఇప్పుడు అకోన్ దీపాలీతో సంతోషంగా ఉన్నాడనీ, తనకు దూరమైపోతున్నాడనీ విచారించడం, అసూయపడటం అర్థంలేని అంశం.విజయదశమి తర్వాత నిమజ్జనం చేసిన దేవతని తిరిగి ఆవాహన చెయ్యడం సాధ్యం కాదు.సుభద్ర తనని తానే సంభాళించుకున్నది. వృక్షరహిత శూన్య మహారణ్యం వంటి ఏకాంతాన్ని భరించడానికి సిద్ధపడక తప్పదు. తన వంటి వారికి సగం చచ్చిన జీవితమే లభిస్తుంది. ఆ స్థితి నుంచి తప్పించుకోలేరు.ఆనాటి వేడి దుర్గంధపూరితమైన నిశ్వాసాలు ఆమె ముక్కుకు అంటిపట్టేసి ఉన్నవి. చెరిగిపోవడం లేదు. నిజానికి ఆమె ఘ్రాణశక్తి పూర్తిగా చెడిపోయింది. ఎంత మంచి సువాసనైనా ఆమెకు ఆ దుర్వాసనలాగానే ఉంటున్నది. మంచు ముట్టుకున్నా వేడి నిశ్వాసాలే గుర్తొస్తున్నాయి.అయినా ఈరోజు అన్నీ మరచి, గతాన్ని విస్మరించి, ఉత్సాహంగా అకోన్ కోసం ఎదురు చూస్తున్నది. ఆమె పరిస్థితి తనని స్పృశించబోయే రంగు కోసం ఎదురు చూస్తున్న కాన్వాస్‌లా ఉన్నది.ఇది నిజంగా ఆమెకు సిగ్గుచేటైన విషయం. ఆమెకు ఇటువంటి తలపులు రానేకూడదు. జరగని దాన్ని అతడి నుంచి ఆశించడం, దీపాలీని బాధపెట్టడంలో ఏమాత్రమూ న్యాయం లేదు.సుభద్ర సోదరుడు ఉగ్రవాదిగా మారి ఒక రైలులోని అమాయకులైన వందలాది ప్రయాణికుల్ని బలి తీసుకున్నాడు. మరి వారికీ ఆశలూ ఆశయాలూ ఉండి ఉంటాయి. ఆ కారణం చేతనే సైనికులు వాణ్ణి మట్టుపెట్టారు.కాని సుభద్ర ఎవరికీ ఏమీ అపకారం చెయ్యలేదు. కనీసం కీడు తలపెట్టలేదు. అయినా ఆమె జీవితం నాశనమైపోయింది. సుభద్ర తండ్రి కూడా సాధారణ రైతు. అతడూ ఎవరికీ హాని చెయ్యలేదు. కాని వాళ్లు అతణ్ణి కూడా చంపేశారు. వారికి విచక్షణ లేదు.ఆమె చేసిన నేరమంతా సోదరుడికి కప్పు టీ ఇచ్చింది. ఆ కుమారుడికి తండ్రి కావడం వల్ల తన తండ్రి కూడా బాయినెట్ మొనకు జీవితాన్ని బలి చేసుకున్నాడు. అందరు అమ్మాయిల్లాగానే సుభద్ర కూడా చదువుకున్నది. తన జన్మభూమికి సంబంధించిన సంస్కృతీ సంపదల్నీ, నాగరికత ఔన్నత్యాన్నీ అధ్యయనం చేసింది. కాని ఆమె మిగిలిన అమ్మాయిల కంటే భిన్నమైనదిగా తయారైంది. ఆమె గుండె అవమాన భారంతోనూ నిష్ఫలత్వంతోనూ కొట్టుకుంటున్నది. ఇటువంటి అన్యాయానికి ఎవరైనా బదులు తీర్చుకోవాలి. ఆమె మనస్ఫూర్తిగా అకోన్‌ని అక్కున చేర్చుకుని ఆనందించలేకపోవడానికి బాధ్యులెవరు? అందరూ ఒకే దేశానికి చెందినవారమని చెబుతారు. మరి వారిలో తనూ, సోదరుడూ, తండ్రీ ఎందుకు లేరు?మట్టి గోడల రంధ్రాల్లోంచి సూర్యకిరణాలు ముఖం మీద పడగా సుభద్ర లేచింది. బాగా ఆకలి వేస్తున్నది. మొన్న మధ్యాహ్నం నుంచి ఆహారం ఏమీ తీసుకోలేదు. ‘అకోన్ వస్తున్నాడు’ అనే ఆలోచనే ఆకలి లేకుండా చేసింది. అది తర్వాత ‘అకోన్ రావడం లేదు’ గా మారింది. విషాదమూ, కన్నీరూ ఆకలిని మరచిపోయేట్టు చేశాయి. ఆమెలో ఒక శూన్యం ఏర్పడింది. ఈరోజు ఆదివారం. కాబట్టి తొందరేమీ లేదు.టీ చప్పరిస్తున్న సుభద్ర నిన్నటి పేపర్ని తిరగవేసింది. ‘చబుదా వద్ద కొందరు స్త్రీలపై సైనికులు అత్యాచారం చేశారు’ అన్న వార్త కంటపడింది. హఠాత్తుగా ఆపాదమస్తకమూ ఒక అగ్నికీల ఆమెలో వ్యాపించింది.గోడకు చేరబడి కనులు మూసుకున్నది. ఆ స్త్రీలు ఆమెకు స్పష్టంగా కనపడుతున్నారు. వారి ఆర్తనాదాలు అతి చేరువగా వినపడుతున్నాయి. వారి మనోవేదన అర్థమవుతున్నది.మానవజాతిలో కేవలం స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే దారుణమైన దౌర్భాగ్యం ఇది. ఈ భారాన్ని జీవితాంతం మోసుకు తిరగాలి. గత్యంతరం లేదు. తప్పించుకునే మార్గమే లేదు. ఇప్పుడు ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని నియమించి నిజ నిర్ధారణ చెయ్యమంటారు. కేవలం అదొక ప్రహసనం మాత్రమే. ఆ తర్వాత ఆ నివేదికలు బుట్టదాఖలవుతాయి. అటువంటి కాగితాలు ఆయా కార్యాలయాల్లో గుట్టలుగా పోగుపడి ఉంటాయి. అంతే! ఆ నిర్భాగ్య స్త్రీలు కంటి మీద కునుకు లేకుండా, సుదీర్ఘమైన దుర్భరమైన రాత్రుల్ని జీవితాంతం గడుపుతారు. దుర్గంధపు వేడి నిట్టూర్పులు వారి నాసికా పుటాలకు పట్టేసి ఉంటాయి. ఆ జ్ఞాపకాలు వారి మనసుల్ని తూట్లు పొడుస్తూ ఉండగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఈ పరిస్థితే కొనసాగితే ఇలా నాశనమైన స్త్రీల గణనీయమైన వర్గం ఒకటి అస్సాంలో తయారవుతుంది. వీరందరూ ఏకమైతే ఆ కిరాతకుల్ని గొంతు పిసికి చంపగలరు. ‘‘బైద్యూ! మేమొచ్చాం.’’ సుభద్ర వద్దకు ట్యూషన్‌కు వచ్చే పిల్లల కేకతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ‘‘వెళ్లండి. చాప పరుచుకోండి’’ అంటూ తనూ ఒక చిన్న బల్ల తెచ్చుకుని కూర్చున్నది. ‘‘ఇవాళ మనం డిక్టేషన్ చెప్పుకుందాం’’ అన్నది. పుస్తకం తెరిచి అందులోని వాక్యాల వైపు చూసింది.‘‘భారతదేశం మా మాతృభూమి. ఇప్పుడు మేం స్వతంత్ర భారత పౌరులం. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరుస్తున్నవి. వీటిని కాపాడవలసిన బాధ్యత మనకున్నది. ఈ దేశంలో అత్యంత పురాతనమైన సంస్కృతీ నాగరికతలు వేలాది సంవత్సరాలుగా చోటు చేసుకున్నవి. ఇక్కడ పౌరులందరూ సమానమే..’’ సుభద్ర అంతరాత్మలోంచి ఏదో తిరుగుబాటు ధ్వని వినపడింది. నిజంగానే పౌరులందరూ స్వతంత్రంగానే జీవిస్తున్నారా? నిజంగానే దేశమాత తన అమృత దృక్కులతో ప్రజలందర్నీ సమానంగానే చూస్తున్నదా? తమ తల్లులూ సోదరీమణులూ అయిన స్త్రీలను ఈ దేశపు పురుషులే మానభంగాలు చేసే దేశం నాగరికమైనదేనా? మరి ఈనాటి ‘రేపటి పౌరుల’కు అబద్ధాలను బోధించడం సబబేనా?ఈ చిన్నారి బాసంతి ఈ పాఠాలన్నీ చదివి పెరుగుతుంది. చివరకు ఏదో ఒకరోజు తన తోటివారే తన జీవితాన్ని నాశనం చెయ్యగలరని తెలుసుకుంటుంది.ఈ చిట్టి గోకుల్ ఇవన్నీ చదివి యువకుడవుతాడు. తన ప్రజల్ని ఉద్ధరించాలనుకుంటాడు. సమస్యలనీ, దరిద్రాన్నీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రశ్నిస్తాడు. ఎవరూ పట్టించుకోరు. చివరికి నిరసన గళం విప్పుతాడు. వాణ్ణి తూటాలకు బలి చేస్తారు. ‘‘బైద్యూ! ఏమని రాయమంటారు?’’ అడిగారు పిల్లలు.‘‘పిల్లలూ! ఇప్పుడు రాయండి’’ సుభద్ర అన్యమనస్కంగా చెప్పసాగింది. సతత హరితమైన మా నేలలో ఉద్భవించిన లతల వలెనే మా శరీరాలు మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. మానవత్వాన్ని కాపాడటమే మా బాధ్యత. నాగరికమైన దేశం అని చెప్పుకుంటున్న ఈ నేల హత్యలనీ, మానభంగాలనీ భరించలేదు. అరణ్యాల సుకుమారమైన ఏకాంతాన్నీ నిశ్శబ్దాన్నీ తుపాకీ కాల్పులు భగ్నం చెయ్యలేవు. చెయ్యకూడదు. ఇక్కడ నిర్భయంగా జీవించడం మా జన్మహక్కు..’’సుభద్ర ఆగింది. బయటి నుంచి ముకుల్ అనే అబ్బాయి చేరువగా వచ్చి ఆమెకు ఒక ఉత్తరాన్ని అందించాడు. ‘‘అకోన్దా మీకిమ్మని పంపాడు’’సుభద్ర దాన్ని అందుకున్నది. ‘‘పిల్లలూ! ఇప్పుడు ఇళ్లకు వెళ్లండి. సాయంత్రం రండి’’ అని పంపేసింది.ఉత్తరాన్ని తెరిచింది. చదివింది. ‘‘దీపాలీకి ఒంట్లో బాగాలేదు. లేవలేకపోతున్నది. ఏమీ తినలేకపోతున్నది. చాలా ఇబ్బందిపడుతున్నది. అందుకే ప్రస్తుతం నేను రాలేకపోతున్నాను. కాబట్టి..’’ఆమె ఉత్తరాన్ని మడిచింది. అకోన్ దీపాలీని పెళ్లి చేసుకునే ముందు ఉత్తరం రాయవలసి వస్తే, ‘‘ప్రియమైన సుభద్రా!’’ అని మొదలుపెట్టి ‘‘నీ అకోన్’’ అని ముగించేవాడు. ఇప్పుడు అటువంటి పాటింపులు ఏమీ లేవు. ఉత్తరం బజారుకెళ్లేటప్పుడు రాసే జాబితాలాగా ఉన్నది. సుభద్రలో ఏదో తీవ్రమైన సంచలనం కలిగింది.తమ వివాహం తర్వాత అకోన్ బాధని కళ్లారా చూసింది. ఆమె కూడా ఖేదించింది. కానీ అతడికి సాంత్వన ఇవ్వలేకపోయింది. అందుకే గత్యంతరం లేక ఇష్టపూర్వకంగానే అతణ్ణి దీపాలీకి ఇచ్చివేసింది.త్యాగం చేసిన పదార్థం కోసం విచారించడం వివేకం కాదు.సుభద్ర ఎవరికీ చెందదు. ఈ నేలకూ చెందదు. ఈ గాలికీ చెందదు. ఏ వ్యక్తికీ చెందదు. అకోన్ దూరమవుతుండటంతో ఆమె మార్గం మరింత సుగమమవుతున్నది.ఒక్క అంశం మాత్రం మిగిలి ఉన్నది. ఆ దుర్మార్గుల్ని గుర్తించి, వారి లైంగికావయవాల్ని కత్తిరించి, వారిని కవోయి చేపల్లా మాడ్చి చంపాలి. ఇదొక్కటే ఆమె జీవిత ధ్యేయం.ఈ దేశంలో ఒకనాటి సువర్ణమయమైన గతాన్ని భవిష్యత్తులో వికసింపచెయ్యాలి. సుభద్ర గుండె వేగంగా కొట్టుకున్నది. ఇంతలో ఎవరో వచ్చిన సడి వినిపించింది.‘‘సుభద్రా! మా అబ్బాయి చేత ఏమిటిలా రాయించావు?’’ జతుల్ తండ్రి ఒక నోట్ పుస్తకాన్ని ఆమెకు అందించాడు. ‘‘మీ నాన్నా, సోదరుడూ సైనికుల తూటాల వల్లనే చనిపోయారు. అలా అయితే నువ్వు కూడా తొందర్లోనే జైలుకెళ్తావు. మా పిల్లవాడికి ఇలాంటి తిరుగుబాటు ధోరణులు తలకెక్కించదలచుకుంటే వాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు అనేసి చిరాగ్గా వెళ్లిపోయాడు.సుభద్ర ఆ నోట్ పుస్తకం వైపు చూసింది.నిజమే తన ఆలోచనల్నే డిక్టేషన్‌గా చెప్పింది.ఒకప్పుడు జతుల్ తండ్రి కూడా తన సోదరుడిలాగానే విప్లవ భావాలతో సాటి కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేవాడు. కాని ఆ మార్గం కంటకమయమని గ్రహించి, ఇప్పుడు పోలీసు శాఖలో చేరిపోయాడు. కత్తి మీద సాము చేస్తున్నాడు. ‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు ట్యూషన్‌కు పంపను’’ ఈ మాటలు సుభద్ర మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. సుదూరంగా మంచు నిండిన పర్వతశ్రేణుల్లో వేగిన కవోయి చేపల కళ్ల వంటి ఆమె తండ్రి నిర్జీవమైన నేత్రాలు కనపడుతున్నాయి. నేలకూలి గిలగిలా కొట్టుకుని స్తంభించిపోయిన తన సోదరుడి తొడలు కనపడుతున్నాయి. ఆ పర్వతసానువుల్లో మహావృక్షాలు నేలకు ఒరిగిపోతున్నాయి.‘‘మా పిల్లవాణ్ణి నీ వద్దకు..’’ ఈ మాటలు ఆమె దీనస్థితిని సవాలు చేస్తున్నాయి.లేదు. నేను ఇక ముందు స్థిరంగా నిలబడాలి. పరిస్థితుల్నీ, జీవితాన్నీ ఎదుర్కోవాలి. ఇలా ఒక దృఢమైన నిశ్చితమైన వైఖరితో యోచించసాగింది. ‘‘నా ట్యూషన్లో ఎవరో ఒకరు చదవకపోయినా నష్టంలేదు’’ అనుకున్నది. అస్సామీ మూలం : ఫూల్ గోస్వామి అనువాదం: టి.షణ్ముఖరావు -
లోదుస్తుల రంగుఅడిగారు!
ఆమెకెందుకు సార్! ఈ డిపార్ట్మెంట్ల పనెక్కువుంటది. అయ్యో ఆమెకు పనిరాదు! ఆమెకిద్దరు చిన్న పిల్లలు జల్దిసర్దుకుంటది బ్యాగు! ఆమె చాన దూరం నుంచొస్తది బస్సుపోద్దని టెన్ టు ఫైవే ఆమె టైమ్! ఆమె సీట్లనే ఉండది సార్! ఆమెకు ఫ్రెండ్సెక్కువ! చాయ్కంటది, ఫ్రెండ్సంటది, చీరలంటది! ముఖ్యమైన డిపార్ట్మెంట్లు, కీర్తి తెచ్చిపెట్టే సెక్షన్స్, పెద్దపెద్దోళ్లతోని డీల్ చేసే డిపార్ట్మెంట్స్ ఆడవాళ్లకివ్వకుండా ఉండేందుకు మగాళ్లు చెప్పే సూక్తులివేనంటారు అణచివేతల దారుల గుండా ఎదిగివచ్చిన జూపాక సుభద్ర. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నత స్థానంలో ఉన్న జూపాక సుభద్ర తెలంగాణ పోరుగడ్డపై బలమైన దళిత గొంతుక. ఆమె కథలూ, కవితలూ సమాజంపై విసిరిన సరికొత్త సవాళ్లు. వరంగల్ జిల్లాలో దళిత వాడలో పుట్టి, అణచివేతనూ, వివక్షనూ ఎదిరించే చైతన్యాన్ని విద్యార్థిదశనుంచే అందిపుచ్చుకుని అదే స్ఫూర్తిని తన రచనల్లోనూ, కథలూ, కవితలూ, వ్యాసాల్లోనూ బలంగా వినిపిస్తూ సామాజిక అసమానతలపై కత్తులు ఝుళిపిస్తోన్న జూపాక సుభద్రని స్త్రీపురుష అసమానతలపై ‘సాక్షి’ తలపెట్టిన అక్షరయుద్ధం పై మాట్లాడమని కదిలించాము. అంతే ఒళ్లు గగుర్పొడిచే లైంగిక వేధింపులను భరిస్తూ, మండే గుండెలను చిక్కబట్టుకొని ఎప్పుడేం జరుగుతుందో తెలియక నిత్యం అవమానాలనూ, అవహేళనలనూ ఎదుర్కొంటూ అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతోన్న స్త్రీల గుండెచప్పుడును వినిపించారు. స్త్రీ అన్నదే వాస్తవం తప్ప ఆమె ఉన్నతోద్యోగంలో ఉందా, లేక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీనా అనే తారతమ్యం ఎక్కడా లేదనడానికి తన జీవితమే ఉదాహరణ అంటోన్న జూపాక సుభద్రతో సాక్షి జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలివి. ‘‘నువ్వే కలర్ అండర్వేర్ వేసుకుంటావ్’’, ‘‘వాడితో క్లోజ్‌గా ఉంటావెందుకు? వాడికి ఎయిడ్స్ ఉంది. నాతో ఉండు’’ ఈ తరహా వేధింపులు ఎక్కడో మారుమూల పల్లెటూళ్లలోనో, ఏ కుగ్రామంలోనో మహిళా ఉద్యోగినికి ఎదురైనవి అనుకుంటే పొరబడ్డట్టే. అక్షరాలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టే చోట పోలీసుల నిత్య పర్యవేక్షణలో ఉండే రాష్ట్ర సచివాలయంలోనే. అవసరం లేకున్నా ఐదింటి వరకు ఆఫీసరు మహిళా ఉద్యోగిని తన ముందు కూర్చోబెట్టుకోవడం ఏమిటి? ఐదింటి తరువాతే మా ఆఫీసరుకి మా పని గురించి ఆలోచించే తీరిక చిక్కడం ఏమిటి? ఎన్నాళ్ళు ‘‘కొత్త....గా’’ ఉంటావన్నాడు! నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసరు ఐదింటి తరువాత నన్ను పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. నా కొలీగ్స్‌కి చెపితే వాళ్లెళ్లి ఆమె కొత్తగా చేరింది సార్ అని చెపితే ఎన్నాళ్లు ‘‘కొత్త...గా’’ ఉంటుందని ఒత్తిపలుకుతూ అదోరకంగా ద్వంద్వార్థంతో మాట్లాడాడు. ఏడేడు తరాల్లో ఏకైక దాన్ని గ్రూప్టూ రాసి కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఆఫీసరు మాటలకు బెదిరిపోయి మూడు రోజులు సెలవుపెట్టి ఇంట్లోనే ఉన్నాను. అప్పటినుంచి ఎన్నో వేధింపులు, ఎన్నో ఎన్నో జుగుప్సాకరమైన పురుషుల చేతుల పూతలు, బూతులు, గుండెలపైనే గుచ్చే చూపులు, ఏదీ కుదరకపోతే మాపైనే తిరుగుబోతులనే కారెక్టర్ అసాసినేషన్స్. కనీసం చెప్పుకునే దిక్కులేదు నేను చేరేటప్పటికి ఈ సెక్రటేరియట్లో ఆడాళ్లకి ప్రత్యేకించి టాయ్‌లెట్స్ లేవు. లంచ్రూం లేదు. ఎంతో గొడవ చేస్తే ఈ టాయ్‌లెట్స్ వచ్చాయి. కానీ వాటి నిండా బూతుబొమ్మలు, ఆడాళ్లపైన చెత్తరాతలు, లేకపోతే అక్కడే టాయ్‌లెట్ క్లీన్ చేసే అమ్మాయిల పైన అఘాయిత్యాలు కూడా జరిగాయి. ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. బాత్రూం క్లీన్ చేయడానికెళ్లింది. తాగి ఉద్యోగంలో ఉన్న సెక్రటేరియట్ ఎంప్లాయీ ఆమె వెంటే వచ్చి తలుపు మూసేశాడు. ఆమె బయటకు పరిగెత్తుకొచ్చి లబోదిబోమంది. మేమంతా వెళ్లి అతనిపై కంప్లైంట్ ఇస్తే, ఏం జరిగింది? ఎక్కడ పట్టుకున్నాడు? ఆమె అక్కడేం చేస్తోంది? ఇంత పొద్దున్నే ఏం పని? ఇలా ప్రశ్నలు! అఘాయిత్యం చేసినోడిని కాదు, అందుకు బలైన అమ్మాయిని! ఆమె పేరు బయటపడితే కాంట్రాక్టరు ఉద్యోగంలోంచి తీసేస్తాడని భయంతో ఆమె పేరు చెప్పనివ్వలేదు. ఆకాశరామన్న ఉత్తరం ఒక ఉదాహరణ ఆర్కైవ్స్‌లో పనిచేసే ఒకామెపై చీకట్లో జరిగిన అఘాయిత్యాన్ని ఇన్లాండ్ లెటర్లో రాసి పేరు రాయకుండా పోస్ట్ చేస్తే ఒకరి ద్వారా మరొకరికి మొత్తం సెక్రటేరియట్ అంతా తిరిగింది. ఆ ఆకాశరామన్న ఉత్తరంలో తనను ‘‘ఆగం జేసారని రాస్తదామె’’. నా ఫ్రెండే కొన్నేళ్ల క్రితం ఒకామె ఇక్కడ వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో భర్త పెట్టే వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకిద్దరు చిన్నపిల్లలు. ఇక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ మీద జరిగేవేవీ భయంతో బయటకు చెప్పుకోరు. చెపితే ఉద్యోగం పోద్ది, లేదంటే భర్తే మానిపిస్తాడు. అందుకే బయటికి చెప్పరు. మేం సంఘటితం కాకూడదు! మేం ఐక్యంగా ఉండొద్దు. మాకు యూనియన్ ఉండొద్దు. ఇదే ఇక్కడి పురుషులందరి అభిప్రాయం. అందుకే మామీద ఏం జరిగినా కంప్లయింట్ చేయడానికి ఒక కంప్లయింట్ బాక్స్ ఉండదు. కనీసం ఎన్నికల్లో ఆడవాళ్ల పోటీయే లేదు. తొలిసారిగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్‌గా గెలిచాను. నేనొక్కదాన్నే అలా ఓటింగ్ ద్వారా గెలిచిన తొలి మహిళని. తెలంగాణ వచ్చాక మేం ఉమెన్స్ అసోసియేషన్ పెడితే మా కరపత్రాలూ, పోస్టర్లూ చింపేశారు మగ లీడర్లు. మహిళా ఉద్యోగినులకు ఏదైనా జరిగితే అప్పుడు మాదగ్గరికి ఉరికురికి వచ్చి చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెల్వదు. ఏం జేయాలో కూడా తెల్వదు. మహిళా ఎంప్లాయీస్ ఎంతో అభద్రత మధ్య, రక్షణలేని పరిస్థితుల్లో, గోడలపై లేకి రాతల పనిప్రదేశాల్లో పనిచేస్తున్నారు. సెక్రటేరియట్‌లోనే ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఆడవాళ్ల పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. మా పై ఆఫీసర్‌కి చెపితే ఇవి గూడా చెప్పాల్నామ్మా గోడలకు రంగులేస్తే పోతైగద అంటడు. నిజానికి గోడలకైతే రంగులు పూసి మరకలు లేకుండా చేయొచ్చు కానీ మెదడు కేం రంగులు పూయాలే? మహిళా ఉద్యోగులపై మగ ఉద్యోగుల కామెంట్! ‘సింప్లీ సిట్టింగ్... మంత్లీ గెట్టింగ్’ - ఇంటర్వ్యూ : అత్తలూరి అరుణ -
అనుమానించాడు.. అంతం చేశాడు
భర్త చేతిలో మహిళదారుణ హత్య ఖమ్మం క్రైం: దాంపత్య జీవితంలో ముప్పై ఏళ్లుకలిసి పయనించినా ఆమెను అతడు నమ్మలేదు. అడుగుడుగునా అనుమానించాడు... అవమానించాడు. చివరకు అంతమొందించాడు. తోడునీడనై రక్షణ కల్పిస్తాని ప్రమాణాలు చేసినోడే కసాయిగా మారి కడతేర్చాడు. బుర్హాన్‌పురంలోని ఇరవై నాలుగు గంటల పంపు వద్ద ఉన్న కొండమ్మకోరి ప్రాంతానికి చెందిన అమృతపు సుభద్ర(50) భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ సంఘటన ఖమ్మంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సుభద్ర తన భర్త సత్యనారాయణతో కలిసి కిరాణ షాపు నిర్వహిస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. వీరిలో శేషగిరి, వెంకన్నకు వివాహం జరిగింది. శేషగిరి నేలకొండపల్లి, వెంకన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. చిన్నవాడైన సాయికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సత్యనారాయణకు షుగర్ రావడంతో కొంత కాలం క్రితం కాలు తొలగించారు. దీంతో కిరాణ షాపులోనే అతడు ఉంటున్నాడు. అతడికి భార్యపై మొదటి నుంచే అనుమానం. ఆమెను నిత్యం వేధించే వాడు. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు సాయి బయటకు వెళ్లడానికి చూసి సుభద్రపై సత్యనారాయణ ఇనుప చేతికర్రతో తలపై కొట్టాడు. దీంతో ఆమె కింద పడింది. ఆపై గొంతు నులిపాడు. గట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు తుడవడానికి సత్యనారాయణ యత్నించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా రాత్రి 2 గంటల సమయంలో దగ్గర్లోని బంధువుకు ఫోన్‌చేసి తన భార్య కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పాడు. దీంతో వారు చిన్నకూమారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. అతడు నేలకొండపల్లిలో ఉన్న అన్న శేషగిరికి సమాచారం అందించి ఇంటికి వచ్చాడు. అదేసమయానికి శేషగిరి కూడా ఖమ్మం చేరుకోవడంతో ఇద్దరు కలిసి వరండాలో ఉన్న సుభద్రను ఆస్పత్రికి తరలించటానికి ప్రయత్నం చేస్తుండగా ఆమె తల వెనుక భాగంలో తగిలిన దెబ్బను గమనించారు. అప్పటికే సుభద్ర మృతిచెంది ఉంది. అనుమానం వచ్చి తండ్రిని అడుగగా అతడు పొంతన లేకుండా మాట్లాడడంతో బండారం బయటపడింది. దీంతో ఇద్దరు కుమారులు కలిసి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ సారంగపాణి, ఎస్సై సురేష్ సందర్శించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకు హత్యకు ఉపయోగించిన చేతికర్రను స్వాధీన పర్చుకున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. గతంలో కూడా సుభద్రపై పలుమార్లు సత్యనారాయణ దాడులు చేశాడని ఆమె కుమారులు తెలిపారు.