ఆమెకెందుకు సార్! ఈ డిపార్ట్‌మెంట్‌ల పనెక్కువుంటది. అయ్యో ఆమెకు పనిరాదు! ఆమెకిద్దరు చిన్న పిల్లలు జల్దిసర్దుకుంటది బ్యాగు! ఆమె చాన దూరం నుంచొస్తది బస్సుపోద్దని టెన్ టు ఫైవే ఆమె టైమ్! ఆమె సీట్లనే ఉండది సార్! ఆమెకు ఫ్రెండ్సెక్కువ! చాయ్‌కంటది, ఫ్రెండ్సంటది, చీరలంటది!
ముఖ్యమైన డిపార్ట్‌మెంట్లు, కీర్తి తెచ్చిపెట్టే సెక్షన్స్, పెద్దపెద్దోళ్లతోని డీల్ చేసే డిపార్ట్‌మెంట్స్ ఆడవాళ్లకివ్వకుండా ఉండేందుకు మగాళ్లు చెప్పే సూక్తులివేనంటారు అణచివేతల దారుల గుండా ఎదిగివచ్చిన జూపాక సుభద్ర. సెక్రటేరియట్‌లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నత స్థానంలో ఉన్న జూపాక సుభద్ర తెలంగాణ పోరుగడ్డపై బలమైన దళిత గొంతుక. ఆమె కథలూ, కవితలూ సమాజంపై విసిరిన సరికొత్త సవాళ్లు.
వరంగల్ జిల్లాలో దళిత వాడలో పుట్టి, అణచివేతనూ, వివక్షనూ ఎదిరించే చైతన్యాన్ని విద్యార్థిదశనుంచే అందిపుచ్చుకుని అదే స్ఫూర్తిని తన రచనల్లోనూ, కథలూ, కవితలూ, వ్యాసాల్లోనూ బలంగా వినిపిస్తూ సామాజిక అసమానతలపై కత్తులు ఝుళిపిస్తోన్న జూపాక సుభద్రని స్త్రీపురుష అసమానతలపై ‘సాక్షి’ తలపెట్టిన అక్షరయుద్ధం పై మాట్లాడమని కదిలించాము.
అంతే ఒళ్లు గగుర్పొడిచే లైంగిక వేధింపులను భరిస్తూ, మండే గుండెలను చిక్కబట్టుకొని ఎప్పుడేం జరుగుతుందో తెలియక నిత్యం అవమానాలనూ, అవహేళనలనూ ఎదుర్కొంటూ అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతోన్న స్త్రీల గుండెచప్పుడును వినిపించారు. స్త్రీ అన్నదే వాస్తవం తప్ప ఆమె ఉన్నతోద్యోగంలో ఉందా, లేక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీనా అనే తారతమ్యం ఎక్కడా లేదనడానికి తన జీవితమే ఉదాహరణ అంటోన్న జూపాక సుభద్రతో సాక్షి జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలివి.
‘‘నువ్వే కలర్ అండర్‌వేర్ వేసుకుంటావ్’’, ‘‘వాడితో క్లోజ్‌గా ఉంటావెందుకు? వాడికి ఎయిడ్స్ ఉంది. నాతో ఉండు’’
ఈ తరహా వేధింపులు ఎక్కడో మారుమూల పల్లెటూళ్లలోనో, ఏ కుగ్రామంలోనో మహిళా ఉద్యోగినికి ఎదురైనవి అనుకుంటే పొరబడ్డట్టే. అక్షరాలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టే చోట పోలీసుల నిత్య పర్యవేక్షణలో ఉండే రాష్ట్ర సచివాలయంలోనే.
అవసరం లేకున్నా ఐదింటి వరకు ఆఫీసరు మహిళా ఉద్యోగిని తన ముందు కూర్చోబెట్టుకోవడం ఏమిటి?
ఐదింటి తరువాతే మా ఆఫీసరుకి మా పని గురించి ఆలోచించే తీరిక చిక్కడం ఏమిటి?
ఎన్నాళ్ళు ‘‘కొత్త....గా’’ ఉంటావన్నాడు!
నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసరు ఐదింటి తరువాత నన్ను పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. నా కొలీగ్స్‌కి చెపితే వాళ్లెళ్లి ఆమె కొత్తగా చేరింది సార్ అని చెపితే ఎన్నాళ్లు ‘‘కొత్త...గా’’ ఉంటుందని ఒత్తిపలుకుతూ అదోరకంగా ద్వంద్వార్థంతో మాట్లాడాడు.
ఏడేడు తరాల్లో ఏకైక దాన్ని గ్రూప్‌టూ రాసి కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఆఫీసరు మాటలకు బెదిరిపోయి మూడు రోజులు సెలవుపెట్టి ఇంట్లోనే ఉన్నాను. అప్పటినుంచి ఎన్నో వేధింపులు, ఎన్నో ఎన్నో జుగుప్సాకరమైన పురుషుల చేతుల పూతలు, బూతులు, గుండెలపైనే గుచ్చే చూపులు, ఏదీ కుదరకపోతే మాపైనే తిరుగుబోతులనే కారెక్టర్ అసాసినేషన్స్.
కనీసం చెప్పుకునే దిక్కులేదు
నేను చేరేటప్పటికి ఈ సెక్రటేరియట్‌లో ఆడాళ్లకి ప్రత్యేకించి టాయ్‌లెట్స్ లేవు. లంచ్‌రూం లేదు. ఎంతో గొడవ చేస్తే ఈ టాయ్‌లెట్స్ వచ్చాయి. కానీ వాటి నిండా బూతుబొమ్మలు, ఆడాళ్లపైన చెత్తరాతలు, లేకపోతే అక్కడే టాయ్‌లెట్ క్లీన్ చేసే అమ్మాయిల పైన అఘాయిత్యాలు కూడా జరిగాయి.
ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. బాత్‌రూం క్లీన్ చేయడానికెళ్లింది. తాగి ఉద్యోగంలో ఉన్న సెక్రటేరియట్ ఎంప్లాయీ ఆమె వెంటే వచ్చి తలుపు మూసేశాడు. ఆమె బయటకు పరిగెత్తుకొచ్చి లబోదిబోమంది. మేమంతా వెళ్లి అతనిపై కంప్లైంట్ ఇస్తే, ఏం జరిగింది? ఎక్కడ పట్టుకున్నాడు? ఆమె అక్కడేం చేస్తోంది? ఇంత పొద్దున్నే ఏం పని? ఇలా ప్రశ్నలు! అఘాయిత్యం చేసినోడిని కాదు, అందుకు బలైన అమ్మాయిని! ఆమె పేరు బయటపడితే కాంట్రాక్టరు ఉద్యోగంలోంచి తీసేస్తాడని భయంతో ఆమె పేరు చెప్పనివ్వలేదు.
ఆకాశరామన్న ఉత్తరం ఒక ఉదాహరణ
ఆర్కైవ్స్‌లో పనిచేసే ఒకామెపై చీకట్లో జరిగిన అఘాయిత్యాన్ని ఇన్‌లాండ్ లెటర్‌లో రాసి పేరు రాయకుండా పోస్ట్ చేస్తే ఒకరి ద్వారా మరొకరికి మొత్తం సెక్రటేరియట్ అంతా తిరిగింది. ఆ ఆకాశరామన్న ఉత్తరంలో తనను ‘‘ఆగం జేసారని రాస్తదామె’’. నా ఫ్రెండే కొన్నేళ్ల క్రితం ఒకామె ఇక్కడ వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో భర్త పెట్టే వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకిద్దరు చిన్నపిల్లలు. ఇక ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ మీద జరిగేవేవీ భయంతో బయటకు చెప్పుకోరు. చెపితే ఉద్యోగం పోద్ది, లేదంటే భర్తే మానిపిస్తాడు. అందుకే బయటికి చెప్పరు.
మేం సంఘటితం కాకూడదు!
మేం ఐక్యంగా ఉండొద్దు. మాకు యూనియన్ ఉండొద్దు. ఇదే ఇక్కడి పురుషులందరి అభిప్రాయం. అందుకే మామీద ఏం జరిగినా కంప్లయింట్ చేయడానికి ఒక కంప్లయింట్ బాక్స్ ఉండదు. కనీసం ఎన్నికల్లో ఆడవాళ్ల పోటీయే లేదు. తొలిసారిగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్‌గా గెలిచాను. నేనొక్కదాన్నే అలా ఓటింగ్ ద్వారా గెలిచిన తొలి మహిళని. తెలంగాణ వచ్చాక మేం ఉమెన్స్ అసోసియేషన్ పెడితే మా కరపత్రాలూ, పోస్టర్లూ చింపేశారు మగ లీడర్లు.
మహిళా ఉద్యోగినులకు ఏదైనా జరిగితే అప్పుడు మాదగ్గరికి ఉరికురికి వచ్చి చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెల్వదు. ఏం జేయాలో కూడా తెల్వదు. మహిళా ఎంప్లాయీస్ ఎంతో అభద్రత మధ్య, రక్షణలేని పరిస్థితుల్లో, గోడలపై లేకి రాతల పనిప్రదేశాల్లో పనిచేస్తున్నారు. సెక్రటేరియట్‌లోనే ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఆడవాళ్ల పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు.
మా పై ఆఫీసర్‌కి చెపితే ఇవి గూడా చెప్పాల్నామ్మా గోడలకు రంగులేస్తే పోతైగద అంటడు. నిజానికి గోడలకైతే రంగులు పూసి మరకలు లేకుండా చేయొచ్చు కానీ మెదడు కేం రంగులు పూయాలే?
మహిళా ఉద్యోగులపై మగ ఉద్యోగుల కామెంట్!
‘సింప్లీ సిట్టింగ్... మంత్లీ గెట్టింగ్’
- ఇంటర్వ్యూ : అత్తలూరి అరుణ
Comments
Please login to add a commentAdd a comment