ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్న బాలిక తల్లి రాణి
తాడేపల్లి రూరల్: ఆరోగ్యశ్రీ పథకంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో ఓ చిన్నారి క్లిష్టమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను మణిపాల్ ఆస్పత్రి అంకాలజీ వైద్యుడు డాక్టర్ జి.కృష్ణారెడ్డి, హెమటో అంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దంతాల మాధవ్ బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన రాణి కుమార్తె సిరిస్పందన (6) ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా అనే వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతోంది. వైద్యం నిమిత్తం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మణిపాల్ ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు సాల్వేజ్ కీమోథెరపీ జీడీపీతో చికిత్స అందించారు.
బాలికకు జబ్బు తగ్గిన తర్వాత బీఈఎం కండిషనింగ్, ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స అందించారు. బాలిక పూర్తిగా కోలుకుని మంచి బ్లడ్ కౌంట్ సాధించటంతో మూడు వారాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ కంటెపూడి సుధాకర్ మాట్లాడుతూ చిన్నారి అన్నిరకాల ఆరోగ్య చిక్కుల నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు మణిపాల్ వైద్య బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. చిన్నారికి చికిత్స అందించిన క్లినికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ మనోజ్‌కుమార్, మెడికల్ అంకాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. బాలిక తల్లి రాణి మాట్లాడుతూ ఈ విధమైన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి సీఎం వైఎస్ జగన్ తన బిడ్డకు ప్రాణం పోశారని కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment