US Doctors Transplant Ear Of Human Cells, Made By 3-D Printer - Sakshi
Sakshi News home page

20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్‌ చెవి

Published Mon, Jun 6 2022 6:00 AM | Last Updated on Mon, Jun 6 2022 8:35 AM

US Doctors Transplant Ear of Human Cells, Made by 3-D Printer - Sakshi

టెక్సాస్‌: అమెరికా వైద్యులు మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్‌ సాంకేతికతతో రూపొందించిన చెవిని 20 ఏళ్ల యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్‌ అనే సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా, అక్రమాకారంలో ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్‌ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు.

అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా–కాంజెనిటల్‌ ఇయర్‌ డిఫార్మిటీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సర్జన్‌ డాక్టర్‌ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం గురువారం అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందన్నారు.

రోగుల కార్టిలేజ్‌ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్‌ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపకారి కాగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్‌ పక్కటెముకల నుంచి సేకరించి కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement