ear surgery
-
20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి
టెక్సాస్: అమెరికా వైద్యులు మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో రూపొందించిన చెవిని 20 ఏళ్ల యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా, అక్రమాకారంలో ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా–కాంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్స్టిట్యూట్కు చెందిన సర్జన్ డాక్టర్ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం గురువారం అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందన్నారు. రోగుల కార్టిలేజ్ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపకారి కాగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్ పక్కటెముకల నుంచి సేకరించి కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. -
పాపం... కుక్క చెవిలో ట్రంప్ ముఖం
వాషింగ్టన్ : ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో.. పక్కన ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఫోటోకు దగ్గరి పోలికలే కనిపిస్తున్నాయి కదా. అందుకే అమెరికా అధ్యక్షుడి పేరిట ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అచ్చం ట్రంప్ ముఖాన్ని పోలి ఉన్న ఇదేంటో తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ఆ సస్పెన్స్ కు తెరదించుతు అదో కుక్క చెవి అంటూ స్పష్టత ఇచ్చారు దాని యజమాని. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టినెసైడ్ ప్రాంతానికి చెందిన జాడె రాబిన్సన్ అనే మహిళ పెంపుడు కుక్క చీఫ్. జాగిలంగా కూడా పనిచేసే చీఫ్ చెవికి కొంత కాలం క్రితం ఇన్ఫెక్షన్ సోకింది. ఆపై వైద్యం తీసుకెళ్తే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె తన శక్తిమేర దానికి వైద్యం అందిస్తూ వచ్చారు. అయితే నానాటికీ చీఫ్ చెవి కుచించుకుపోయి దానికి విపరీతమైన నొప్పిని కలిగించటం ప్రారంభించసాగింది. ఇదిలా ఉండగా ఓ రోజు దాని చెవిని నిశితంగా పరిశీలించిన జాడె స్నేహితురాలు అది ట్రంప్ ఫేస్‌ను పోలి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ విషయాన్ని జాడెకు తెలియజేసిందంట. ముందు జాడెకు అలా అనిపించకపోయినా.. చాలా సార్లు గమనించి అది ట్రంప్ ముఖాన్ని పోలి ఉందని నిర్ధారించుకున్నారు. దీంతో వెంటనే చీఫ్ చెవిని ఫోటోగా పెట్టిన ఓ పేజీని క్రియేట్ చేసి విరాళాలు కోసం అభ్యర్థనలు చేయటం ప్రారంభించింది. ట్రంప్ వ్యతిరేకులు ఆ ఫోటోను ట్రోల్ చేస్తూ ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు రాగా, ఆయన మద్దతుదారులు మాత్రం జాడె చేసిన పనిపై మండిపడుతున్నారు. ఇప్పటిదాకా 40 పౌండ్ల దాకా వసూలు చేసిన ఆమె, చీఫ్ వైద్యం కోసం 430 పౌండ్లు అవసరమని చెబుతున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ముఖం పేరిట ఓ మంచి పని జరిగితే అంతకంటే ఏ కావాలి చెప్పండి. -
చెవిలోన జోరీగ..
చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. అని ఓ పద్యం ఉంది. ఇంగ్లండ్‌లో ఓ మధ్యవయస్కుడికి సరిగ్గా ఇలాంటి బాధే ఎదురైంది. మూడు రోజుల క్రితం చెవిలో దూరిపోయి, అప్పటినుంచి తలలో గుయ్యిమంటూ తెగ ఇబ్బందిపెడుతున్న ఆ జోరీగను తీయించుకోడానికి రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి ఆస్పత్రికి పరుగెత్తాడు. దాంతో అక్కడి వైద్యులు గంటన్నర పాటు కష్టపడి శస్త్రచికిత్స చేసి, అప్పటివరకు బతికున్న ఆ జోరీగను బయటకు తీశారు. ఫీల్డింగ్ మంచం మీద పడుకుని చదువుకుంటుండగా ఆ జోరీగ ముందు అతడి కళ్లజోడు మీద వాలింది. దాన్ని తరిమేస్తుంటే, తాను ఊరుకుంటానా అంటూ చెవిలోకి దూరిపోయింది. అది తన తలలోనే తిరుగుతున్నట్లు అనిపించిందని అతడు గోలపెట్టాడు. ఏం జరిగిందో నర్సులు చెప్పేసరికి తాను షాకయ్యానని, ముందు చెవిలో లైటు వేసి చూస్తే ఒక కాలు మాత్రమే వాళ్లకు కనపడిందని చెప్పాడు. చెవిలో దాదాపు 2 సెంటీమీటర్ల లోతున కర్ణభేరికి సమీపంలోనే ఉండటంతో చాలా నొప్పి పుట్టిందన్నారు. ఓ గరాటును చెవిలో దూర్చి, మార్గాన్ని వెడల్పు చేసి, ఆ జోరీగను చిన్నపాటి శ్రావణం (ఫోర్సెప్స్)తో బయటకు తీశారు. అలా తీసే క్రమంలో జోరీగ చచ్చిపోయింది. ఫీల్డింగ్ దాన్ని భద్రంగా ఓ జార్లో దాచుకున్నాడు.