మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్‌లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.
వేల కోట్ల గిగాబైట్ల సమాచారం
మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్‌పుట్, ఔట్‌పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు.
అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్‌లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్‌లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది.
ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్‌లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు.
సూక్ష్మమైన పొరలుగా..
ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment