తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12:15 గంటలకు ముగుస్తాయి.
హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12:15 గంటలకు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు.
మరోవైపు అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండగా ద్వితీయ భాషకు ఒకే పేపర్ ఉన్నందున, ఆ పరీక్ష రోజున మాత్రం విద్యార్థులకు 3:15 గంటల సమయం (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు) ఇవ్వనున్నారు. కాగా పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అంతకు మించి ఆలస్యమైతే వెనక్కి వెళ్లాల్సిందే. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్‌కు (040-23230941, 040-23230942) ఫోన్ చేయాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.