పటిష్ట ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహించాలి
-కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలి
-పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ ఆదేశం
కాకినాడ సిటీ : పదోతరగతి పబ్లిక్ పరీక్షలను పటిష్ట ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 304 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 68,853 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లైయింగ్ స్క్వాడ్‌లుగా ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. పరీక్షా పత్రాల పంపిణీలో పోలీస్ ఎస్కార్ట్, అర్మ్‌డ్ గార్డ్స్, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని కాకినాడ, రాజమహేంద్రవరం పోలీస్ సూపరింటెండెంట్లకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులను మూసివేయించాలని ఆదేశించారు. సబ్ ట్రెజరీల్లో ప్రశ్నాపత్రాల డిపాజిట్‌కు, తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఖజానాశాఖాధికారిని ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలని, జవాబు పత్రాలను ఎప్పటికప్పుడు స్పీడ్ పోస్ట్‌లో పంపించడానికి పరీక్ష జరిగే అన్ని రోజులలో తోడ్పాటునందించాలని వైద్యారోగ్య, ఆర్టీసీ, పోస్టల్ అధికారులకు సూచించారు. జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్‌ఓ చెన్నకేశవరావు, డీఈఓ ఎస్.అబ్రహం, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.