డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్‌ కొట్టు! | tenth class mass copying | Sakshi
Sakshi News home page

డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్‌ కొట్టు!

Published Mon, Mar 20 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్‌ కొట్టు!

డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్‌ కొట్టు!

- పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల దందా
- గ్రేడ్‌ల కోసం కొంతమంది విద్యార్థులతో మాస్‌ కాపీయింగ్‌
- పరీక్ష కేంద్రాల సీఎస్‌లతో కుమ్మక్కు
- దానవాయిపేట పాఠశాలలో ఇదే తంతు
- సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలతో తనిఖీలు
- గేటు వద్దే ఆర్ఐ, వీఆర్‌ఓల నిలిపివేత
- 10 నిమిషాల తర్వాత ఆర్‌ఐకి మాత్రమే అనుమతి
- ఆలోగా అంతా సర్దేశారంటూ ఆరోపణలు
 
పదో తరగతి పరీక్షల్లో అధిక సంఖ్యలో గ్రేడులు సాధించుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు రకరకాల పైరవీలు చేస్తున్నాయి. పుస్తకాలు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌)లతో కుమ్మక్కవుతున్నాయి. అధిక మొత్తం ఆశ చూపడంతో కొన్ని పరీక్ష కేంద్రాల సీఎస్‌లు వారు చెప్పినట్టే నడచుకుంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులతో పుస్తకాలు పెట్టి రాయిస్తున్నారు. ఇటువంటి దందాకు నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా నిలిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
 
సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా పరీక్షలు రాస్తోంది. ఆ విద్యార్థిని స్నేహితులు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం తెలుగు పేపర్‌-2 పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని బోరున ఏడవసాగింది. విషయం ఏమిటని తల్లిదండ్రులు ఆరా తీయగా ‘‘నేను ఏడాదంతా కష్టపడి చదివి రాస్తుంటే నా స్నేహితులు కొందరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు. ఇప్పటివరకూ క్లాస్‌లో నేను ఫస్ట్. రేపు ఫలితాల్లో వారికి నాకన్నా మంచి గ్రేడులు వస్తాయి’’ అంటూ విలపించింది. దీంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టి తీసుకొచ్చారు.
సోమవారం హిందీ పరీక్ష జరుగుతుండగా దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో జరుగుతున్న దందాను ‘సాక్షి’ సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ఇతరులు రాకూడదని చెప్పిన అక్కడి సిబ్బంది ‘సాక్షి’ని లోపలికి అనుమతించలేదు. ఈలోగా సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ ఆదేశాల మేరకు అర్బన్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాయుడు, వీఆర్‌ఓలు వాసు, దోసలరావు పాఠశాల వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండడంతో అక్కడి వాచ్‌మన్‌ను పిలిచి, తమ గుర్తింపు కార్డులు చూపించి తాళం తీయాలని చెప్పారు. అలా తీయడం కుదరదని అంటూ విషయాన్ని పరీక్ష చీఫ్‌ సూపరింటెండెంట్‌కు చెప్పారు. చీఫ్‌ సూపరింటెండెంట్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రశాంత్‌ వచ్చి తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అనుమతించబోమని ఆర్‌ఐ, వీఆర్‌ఓలకు చెప్పారు. తాను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌నంటూ నాయుడు తన గుర్తింపు కార్డు చూపించినా కూడా అనుమతించలేదు. ఈలోగా సీఎస్‌ రాజా ప్రశాంత్‌ ఫోనులో మాట్లాడుతూ పది నిమిషాల పాటు తాత్సారం చేశారు. అనంతరం ఆర్‌ఐ నాయుడును మాత్రమే లోనికి అనుమతించారు. వీఆర్‌ఓలు వాసు, దోసలరావులను గేటు బయటే నిలిపివేశారు. ఆర్‌ఐని, వీఆర్‌ఓలను పది నిమిషాలపాటు గేటు బయట నిలిపివేసిన సమయంలోనే లోపల ఏమీ దొరకకుండా సర్దేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్దకు వచ్చిన పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన ఆర్‌ఐకి అక్కడ ఏమీ దొరకలేదు.
ఈలోగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందంటూ విలేకర్లకు చెప్పారు. ఆర్‌ఐ, వీఆర్‌ఓలను పది నిమిషాల పాటు ఎందుకు అనుమతించలేదన్న విలేకర్ల ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈ విషయంపై డీఈఓ అబ్రహం వివరణ కోరగా.. తహసీల్దార్‌ క్యాడర్‌ వరకు నేరుగా అనుమతిస్తామని చెప్పారు. అంతకన్నా దిగువ క్యాడర్‌ అధికారులు తనిఖీకి వస్తే వారి పై అధికారులు ఫలానా అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ సంబంధిత పరీక్ష కేంద్రానికి ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులు ముందుగానే సమాచారం ఇస్తే ఇక తనిఖీ అన్న పదానికి అర్థం ఏముంటుందని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ నిబంధనలు అలా ఉన్నాయి’’ అని డీఈఓ అన్నారు.
పది నిమిషాల తర్వాత పంపారు
సబ్‌కలెక్టర్‌ ఆదేశాల మేరకు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి పరీక్ష తనిఖీకి వచ్చాం. నాతోపాటు వీఆర్‌ఓలు వాసు, దోసలరావు వచ్చారు. తనిఖీ చేయాలన్న సబ్‌కలెక్టర్‌గారి ఆదేశాల మేరకు వచ్చామని చెప్పినా సీఎస్‌ రాజా ప్రశాంత్‌ మమ్మల్ని అనుమతించలేదు. మా గుర్తింపు కార్డులు చూపించినా ససేమిరా అన్నారు. చివరకు పది నిమిషాల తర్వాత నన్ను ఒక్కడినే లోపలికి అనుమతించారు. మా వీఆర్‌ఓలు బయటే ఉన్నారు.
- నాయుడు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement