అయ్యోర్లూ..అప్రమత్తం
అయ్యోర్లూ..అప్రమత్తం
Published Thu, Mar 16 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
- విద్యార్థులు కాపీ కొడితే ఉపాధ్యాయులకే శిక్ష
- పది పరీక్షల నిర్వహణలో చట్టం అమలు
రాయవరం: ‘ఎంకిపెళ్లి సుబ్బిచావు’కు వచ్చిందంటే ఇదేనేమో. పది పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడితే ఆ శిక్ష ఉపాధ్యాయులకే. ఈ ఏడాది పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమైన నేపధ్యంలో ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంత వరకు వారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత విధించడం చేసేవారు. ఈ ఏడాది కఠిన నిర్ణయాలు తీసుకోడానికి విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 1997 చట్టంలో సెక‌్షన్ 25లోని 10 నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ చట్టం ప్రకారం పది పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే కటకటాలపాలు కావాల్సిందేనంటున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించే సమయంలో విద్యార్థులు చీటీలతో పట్టుబడినా, పక్కవారి పేపరులో చూచి రాస్తున్నా అందుకు ఇన్విజిలేటర్‌నే బాధ్యుడ్ని చేస్తారు. ఇన్విజిలేటర్‌తోపాటు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను కూడా భాగస్వామ్యులను చేస్తారు.
శిక్ష సమంజసమేనా..
పరీక్ష కేంద్రాల గదుల్లో ఉపాధ్యాయిని పర్యవేక్షకురాలిగా ఉంటే బాలురను, పురుష ఉపాధ్యాయుడు ఉంటే బాలికలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం సాధ్యపడదు. దీంతో కొందరు విద్యార్థుల వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. తమ తప్పులు ఉండని పక్షంలోనూ శిక్షలు విధించాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఐదు కేంద్రాల్లో సీసీ కెమేరాలు...
జిల్లా విద్యాశాఖ ఐదు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తుంది. కూనవరం, కోలంక, గొల్లలమామిడాడ, జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్, అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా ఇప్పటికే సీసీ కెమేరాలు ఉన్న మరో 30 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం.
16న ఇన్విజిలేటర్లకు సమావేశాలు..
ఈ 17వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 16న మధ్యాహ్నం రెండు గంటలకు 307 పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు పట్టుకెళ్ల కూడదని, పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆ ఇన్విజిలేటర్లుæ విధులు నిర్వర్తించకూడదని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులతో మాట్లాడకూడదని తదితర సూచనలు ఇవ్వనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక విద్యాశాఖ అధికారి, తహసీల్దారు, ఏఎస్సైతో కలిసిన బృందాలు 15 ఏర్పాటు చేశాం. వీరు కాకుండా 20 స్క్వాడ్లతోపాటు రాష్ట్రస్థాయి పరిశీలకుడు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. – ఎస్.అబ్రహాం, జిల్ల విద్యాశాకాధికారి, కాకినాడ.
Advertisement
Advertisement