సత్యదేవా! సత్ఫలితమివ్వు!
సత్యదేవా! సత్ఫలితమివ్వు!
Published Sun, Mar 12 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
-రత్నగిరికి వెల్లువెత్తుతున్న టెన్త్ విద్యార్థులు
-వివాహాలతో ఆలయ ప్రాంగణంలో పెరిగిన రద్దీ
అన్నవరం : పౌర్ణమి పర్వదినం, ఆదివారం కలిసి రావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వివాహాలు జోరుగా జరుగుతుండడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులు, సత్యదేవుని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు, సత్రాలు నిండిపోయాయి. కాగా ఈ నెల 17 నుంచి çపరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటూ పెద్దసంఖ్యలో స్వామి సన్నిధికి వస్తున్నారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకుంటున్నారు. వీరందరితో ఆలయప్రాంగణంలో సందడికి తెరిపి ఉండడం లేదు. స్థానిక శ్రీసత్యసాయి విద్యావిహార్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని వారిని పండితులు ఆశీర్వదించారు.
సత్యదేవుని దర్శించిన 20 వేలమంది భక్తులు
ఆదివారం సత్యదేవుని 20 వేలమంది దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు గోకులంలో సప్తగోప్రదక్షణ అనంతరం రావి చెట్టుకు పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,619 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Advertisement