గాడితప్పిన సాంఘిక సంక్షేమం
- పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసుల నిర్వహణలో నిర్లక్ష్యం
- ఒక్క డివిజన్‌లోనూ మొదలు కాని ప్రక్రియ
- మరో నెల రోజుల్లో పరీక్షలు
- పలు వసతిగృహాల్లో పనిచేయని బోర్లు
- మెరుగుపడని బయోమెట్రిక్ హాజరు
కర్నూలు(అర్బన్): పదవ తరగతి పరీక్షలు పట్టుమని నెల రోజులు లేవు. ఇప్పటి వరకు విద్యార్థులకు మోటివేషన్ తరగతులూ నిర్వహించని పరిస్థితి. యేటా డిసెంబర్‌లోనే డివిజన్ల వారీగా క్లాసులు నిర్వహిస్తున్నా ఈసారి ఆ ఊసే కరువయింది. ఇందుకు ప్రధాన కారణం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి దీర్ఘకాలిక సెలవులో వెల్లడమే. మొత్తంగా అధికారి లేని లోటుతో ఈ శాఖలో పాలన గాడితప్పింది. పక్క జిల్లాలో ఇప్పటికే తరగతులు ఒకటికి రెండుసార్లు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయగా.. ఇక్కడి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది.
సైకాలజీలో నిష్ణాతులైన వారిని పిలిపించి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టాలనేది ఈ క్లాసుల ముఖ్య ఉద్దేశం. అయితే ఈ విద్యా సంవత్సరం ఒక్క డివిజన్‌లోనూ క్లాసులు నిర్వహించలేదు. అదేవిధంగా పరీక్షలకు అవసరమయ్యే ప్యాడ్, పెన్ను, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌ను కూడా అందివ్వకపోవడం గమనార్హం. ఆయా వసతిగృహాల్లో సంబంధిత అధికారులు రాత్రి బస చేస్తూ విద్యార్థులను చదివించాల్సి ఉంది. అలాగే ప్రతి వసతిగృహంలోని పదో తరగతి విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి గ్రూప్ డిస్కషన్ నిర్వహించాలి. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ప్రక్రియ కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పలు వసతి గృహాల్లో తీరని దాహం
వేసవి సమీపిస్తుండడంతో ఇప్పటికే పలు వసతి గృహాల్లోని మంచినీటి బోర్లలో నీరు ఇంకిపోవడంతో ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వసతి గృహంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని సంక్షేమాధికారులు వినతి పత్రాలు అందజేస్తున్నా ఫలితం లేకపోతోంది. ముఖ్యంగా ఓర్వకల్లు(బాలికలు), ఆలూరు(ఐడబ్ల్యూహెచ్), మద్దికెర (బాలురు), తెర్నేకల్(బాలురు), నందవరం(బాలురు), ఎమ్మిగనూరు (కళాశాల బాలురు) తదితర వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు వసతి గృహాలకు చెందిన సంక్షేమాధికారులు స్వయంగా డబ్బులు వెచ్చించి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆయనకున్న పని ఒత్తిడి కారణంగా సమస్యలపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది.
నామమాత్రంగానే బయోమెట్రిక్ హాజరు
జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ హాజరును అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు, ట్యాబ్‌లను అందించారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల పలు వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు అంతంతమాత్రంగానే నమోదు అవుతోంది. సాంకేతిక కారణాలను తెలుసుకొని వాటిని సరిచేసి అన్ని వసతి గృహాల్లో బయో మెట్రిక్ హాజరు నమోదయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు వసతి గృహాలకు సంబంధించి సిగ్నల్స్ లేకపోవడంతో ఆయా వసతి గృహాల్లో మాన్యువల్‌గానే హాజరును నమోదు చేస్తున్నారు.
మోటివేషన్ క్లాసుల నిర్వహణకు చర్యలు
డివిజన్ల వారీగా పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సంబంధిత సహాయ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటి సమస్య ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. స్పెషల్ హాస్టళ్లపై సంబంధిత హెచ్‌డబ్ల్యూఓలు ప్రత్యేక దృష్టి సారించి ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపడతాం.
- ప్రకాష్‌రాజు, ఇన్‌చార్జి డీడీ