బాలికలదే హవా
బాలికలదే హవా
Published Sat, May 6 2017 9:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
పది ఫలితాల్లో జిల్లాకు 7వ స్థానం
– జీపీఏ పాయింట్లలో 5వ స్థానం
– స్వల్పంగా తగ్గిన ఫలితాల శాతం
– సీసీఈ విధానంలోనూ మెరుగైన ప్రతిభ
– అభినందనలు తెలిపిన కలెక్టర్
కర్నూలు(సిటీ): పదవ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొట్టమొదటి సారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహించిన పరీక్షల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాలో మొత్తం 870 ఉన్నత పాఠశాలలకు చెందిన 49,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 46,329 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 93.4 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గత ఏడాది 94.20 శాతం కంటే 0.80 శాతం తగ్గింది. అయితే గత ఏడాది రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచింది.
ఫలితాల్లో బాలికల హవా
జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపాలిటీ, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్ స్కూల్, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కస్తూర్బా, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల కింద జిల్లాలో 870 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 49,604 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 27,204 మందికి గాను 25,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలురు 90 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2016–17 విద్యా సంవత్సరంలో 92.71 శాతానికి పెరిగింది. బాలికలు 22,400 మంది పరీక్షలకు హాజరు కాగా 21,080 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలికలు 94.43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 2016–17 విద్యా సంవత్సరంలో 94.14 శాతం ఉత్తీర్ణులై స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తంగా ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో బాలికలదే పైచేయిగా కనిపిస్తోంది.
జీపీఏ పాయింట్లలో మెరుగైన ఫలితాలు
పదవ తరగతి పరీక్షల్లో గ్రేస్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అత్యధికంగా జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఈ ఏడాది గత రెండేళ్ల కంటే మూడింతలు పెరిగారు. 2014–15 విద్యా సంవత్సరంలో 429 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా, 2015–16 విద్యా సంవత్సరంలో జీపీఏ పాయింట్ల సంఖ్య తగ్గింది. 379 మంది విద్యార్థులు మాత్రమే 10/10 పాయింట్లు సాధించారు. అయితే ఈ ఏడాది నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించినా 1,372 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా.. రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ స్థాయిలో జీపీ పాయింట్లు సాధించడానికి సీసీఈ విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కులు కూడా ఒక కారణమని తెలుస్తోంది.
విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ అభినందన
పదవ తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గినా స్థానాన్ని మెరుగుపరచుకోవడం పట్ల విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అభినందించారు. ఇక ముందు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement