అమ్మాయిలు అదుర్స్‌! | girls top | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అదుర్స్‌!

Published Thu, Apr 13 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

అమ్మాయిలు అదుర్స్‌!

అమ్మాయిలు అదుర్స్‌!

- ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
- మొదటి సంవత్సరంలో 59 శాతం
- రెండో సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణత 
- ఉత్తీర్ణత శాతాల్లో స్వల్పతేడాలు 
- వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 
  మిడుతూరు ప్రభుత్వ కళాశాల 
 
కర్నూలు(సిటీ): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు గురువారం విజయవాడలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌ విడుదల చేశారు. రెండు ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో పదో స్థానం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఏడో స్థానంలో జిల్లా నిలిచింది. గత ఏడాది కంటే మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. గత ఏడాది ఫస్ట్‌ ఇయర్‌ 64 శాతం ఉత్తీర్ణత కాగా ఈ ఏడాది 59 శాతానికి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది 71 శాతం కాగా ఈ ఏడాది కాస్త పెరిగి 75 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జిల్లాలో మొత్తం 76,807 మంది మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం  36,398 మంది పరీక్షకు హాజరు కాగా.. 21,307 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 19,448 మందికి గాను 10,128 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 16,950 మంది పరీక్షకు హాజరు కాగా 11,179 మంది (66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 30,694 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,164 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 16,081 మందికి గాను 11,357 మంది (71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 14,613 మందికి గాను 11,807 మంది (81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఫలితాల్లో జిల్లా గత ఏడాది 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 10వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గత ఏడాది 8వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 7వ స్థానంలో నిలిచింది. 
 
ప్రభుత్వ కళాశాలల్లో 42.94 శాతం ఉత్తీర్ణత...
జిల్లాలో మొత్తం 41 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం 6,838 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,936 మంది (42.94 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 53 శాతం ఫలితాలు రాగా, ఈ ఏడాది 42.94 శాతానికి తగ్గింది. ఈ ఫలితాల్లో దేవనకొండ మండలం జిల్లాలో అత్యధిక శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 88.89 శాతం, ఆస్పరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 88.18 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. అతి తక్కువ ఉత్తీర్ణత శాతం కౌతాళం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 230 మంది విద్యార్థులకు గాను కేవలం 14 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా గూడూరు జూనియర్‌ కళాశాలలో 230కి గాను 29 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,418 మంది విద్యార్థులకు గాను 3,844 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా స్వల్పంగా పెరిగి 70.95 శాతానికి చేరుకున్నాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా మిడుతూరు  గుర్తింపు పొందింది. 44.91 శాతంతో అతి తక్కువ ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన  కళాశాలగా గూడూరు నిలిచింది.
 
ఎయిడెడ్‌ కళాశాలలు... 
జిల్లాలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సర విద్యార్థులు 1,766 మంది పరీక్షలకు హాజరు కాగా 627 మంది (37.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,332 మంది విద్యార్థులకు 831 మంది (62.37 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పాణ్యం సిమెంట్‌ జూనియర్‌ కళాశాల, బేతంచెర్ల అత్యధిక ఫలితాలు సాధించగా బాలశివ జూనియర్‌ కళాశాల అతితక్కువ ఫలితాలు సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచింది. 
 
ఒకేషనల్‌ కళాశాలలు...
జిల్లాలోని ఒకేషనల్‌ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 1,242 మంది పరీక్షలకు హాజరు కాగా 734 మంది (59.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1,132 మందికి గాను 930 మంది (82.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement