పదిలో ‘ప్రయివేట్ స్టడీ’ ఆవుట్
పదిలో ‘ప్రయివేట్ స్టడీ’ ఆవుట్
Published Sun, Sep 25 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
– సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల ఫలితం
– ఇకపై ప్రయివేట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం
– ఈ నెల 30వరకు ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తుల స్వీకరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్(సీసీఈ)) ఫలితంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీకి పులిస్టాప్ పడింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం.
సీసీఈ ఎఫెక్ట్..
ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మెటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది.
ఓపెన్ స్కూలే దిక్కు..
జిల్లాలో ఏటా 3500 నుంచి 4000 మంది విద్యార్థులు పదో తరగతిని ప్రయివేట్ స్టడీ విధానంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
అవును ఆ విధానం రద్దయింది: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ
ఈ ఏడాది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రయివేట్ స్టడీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు తలెత్తిన ఇబ్బందుల కారణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ పూర్తి చేసుకోవాల్సిందే. రెగ్యులర్, ఓపెన్‌స్కూల్ సర్టిఫికెట్‌కు ఎలాంటి తేడా ఉండదు.
Advertisement