ఇంటర్నల్ మార్కులు తారుమారు
ఇంటర్నల్ మార్కులు తారుమారు
Published Fri, Mar 17 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
- టెన్త్ ఇంటర్నల్ మార్కుల అప్‌లోడింగ్‌లో దొర్లిన తప్పు
- ఇద్దరూ ఒకే పేరుతో ఉండడంతో సిబ్బంది తప్పిదం
- సవరణకు ఏపీ ఆన్‌లైన్‌లో లేని ఆప్షన్
వెల్దుర్తి రూరల్ : ఒకే సెక‌్షన్.. ఒకే తరగతి.. ఒకే పేరు.. తేడా ఉన్నదంతా తండ్రి పేరు మాత్రమే. ఇలాంటి వారి మార్కుల నమోదు విషయంలో స్కూల్ సిబ్బంది చేసిన పొరపాటు మెరిట్ విద్యార్థికి గ్రహపాటుగా మారింది. టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదులో తారుమారు కావడం ఇందుకు కారణం. ఇందుకు వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ వేదికగా మారింది. జి. రాజేశ్ పేరుతో ఇద్దరు విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇందులో ఒకరు బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గిడ్డయ్య కుమారుడు(ఐడీ నెంబరు 6261504) పట్టణంలోని బాలుర హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అన్నింటా ఏ1 గ్రేడ్ మార్కులు సాధించాడు.
మరొకరు వెల్దుర్తికే చెందిన జి. దేవేంద్రుడి కుమారుడు జి.రాజేశ్(ఐడీ నెంబరు 6267823). ఈ విద్యార్థి మార్కుల సాధనలో పూర్. వీరి మార్కుల ఆన్‌లైన్ నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఒకరి మార్కులు ఒకరికి పడ్డాయి. హాస్టల్ వార్డెన్ దొరస్వామి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎం మధు.. విద్యార్థుల మార్కుల సవరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎంఈఓ రామ్మోహన్‌ను కోరారు. అయితే సవరణ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన మార్కులు తనకు వేసి న్యాయం చేయాలని బాధిత విద్యార్థి కోరుతున్నాడు.
Advertisement