పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్లలో నంబర్లు వేయడం, ఇతర ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్లలో నంబర్లు వేయడం, ఇతర ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పరీ క్షలకు హాజరవుతున్న 53,044 మంది విద్యార్థుల్లో రెగ్యులర్ విద్యార్థులు 48562 మంది ఉండగా 4482 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు.
అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి
రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే అర్ధగంట ముందే సెంట ర్‌కు చేరుకోవాలి. పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఒకేషనల్, తరగతి స్పెషల్ సబ్జెక్టుల వారికోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ జిల్లా నుంచి హాజరయ్యే విద్యార్థులంతా సాధారణ సబ్జెక్టుల వారే కావడం వల్ల ఏప్రిల్ 11వ తేదీన జరిగే సోషల్ పేపర్-2తో పరీక్షలు పూర్తవుతాయి.
14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ అధికారులు, ఐదుగురు అదనపు డీఈఓలు, 118 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్లు, 28 మంది పేపర్ కస్టోడియన్లు, 4600 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో భాగస్వాములవుతున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు, సలహాల కోసం 08682-244208కు ఫోన్ చేయవచ్చు.
సహాయకుల ఏర్పాటు
జిల్లాకేంద్రంలో అంధులు, శారీరక వైకల్యంతో రాయలేని వారి కోసం 20 మంది స్క్రైబ్స్ (సహాయకులు)ను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇతర చోట్ల ఎవరైనా అంధులు, శారీరక వికలాం గులు ఉన్నట్లయితే సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌లను సంప్రదించి సహాయకులను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సహాయకులుగా తొమ్మిదో తరగతి వారిని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.