సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు..
రాష్ట్రవ్యాప్తంగా 26 సమస్యాత్మక కేంద్రాలతో పాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అదేవిధంగా ఎంఈవో, డీఈవోలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాల నివృత్తికి 1800–4257462కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment