కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు రాసేందుకు ఆధార్ నెంబర్ సేకరణ, పరీక్షల అనంతరం విద్యార్థులకు ఇచ్చే మార్కుల జాబితాలో ఆధార్ నెంబర్ నమోదు, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాల మధ్య పరీక్షల నిర్వహణ.. ఇలా ఈ యేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. గురువారం నుంచి సెకెండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.30 గంటలకే చేరుకావాల్సి ఉంటుంది. 9 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 37,533 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 39,391 మంది.. మొత్తం 76,926 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా మొత్తంగా 110 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతి కేంద్రానికి
ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించారు. ఆయా కేంద్రాల అవసరాన్ని బట్టి ఇన్విజిలేటర్ల నియామకం చేస్తారు. ప్రధాన పరీక్షలు 26న, వొకేషనల్ పరీక్షలు 31వ తేదీన ముగియనున్నాయి.
ఆళ్లగడ్డలో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాలో ఆళ్లగడ్డ, ఎర్రగుంట్ల, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, కోసిగి, హోళగుంద కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఇందులో ఆళ్లగడ్డ పరీక్ష కేంద్రంలో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.
అసౌకర్యాల మధ్యే పరీక్షలు
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పైకి చెబుతున్నా చాలా చోట్ల ఫర్నిచర్ సమస్య వెక్కిరిస్తోంది. ప్రధానంగా ఆస్పరి, హోళగుంద, డోన్, ఆలూరు తదితర మండలాల్లోని పలు పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా ఈ కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాస్తున్నా చర్యలు శూన్యం.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రథమ సంవత్సరంలో కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జక్టులకు, ద్వితీయ సంవత్సరంలో తెలుగు, అరబిక్ సబ్జక్టులకు పాత, కొత్త ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. ఫర్నిచర్ కొరత ఉన్న చోట సమీప కేంద్రాల నుంచి తెప్పిస్తామన్నారు. విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
60 శాతం కంటే హాజరు తక్కువుంటే రూ.500
ఇంటర్ మీడియట్ ఆర్ట్స్ సబ్జక్టులు చదివే విద్యార్థులు 60 శాతం కంటే హాజరు తక్కువగా ఉంటే వారు రూ.500లు డీడీ రూపంలో చెల్లించి, వారి ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆర్‌ఐవో తెలిపారు. ప్రిన్సిపాళ్లు సైతం ఇలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అయితే 60 శాతం హాజరు తక్కువగా ఉండే సైన్స్ విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వకూడదన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Wed, Mar 11 2015 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement