కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ దశ దాటినా చాలా మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై పరిజ్ఞానం కరువైంది. ఇప్పటికీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. పాఠశాలల్లోనే పూర్తి స్థాయిలో కంప్యూటర్ విద్యను అందిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య లేకపోతే రాణించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమల్లోకి తీసుకొచ్చినా అమలులో చిత్తశుద్ధి కొరవడింది.
ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన కంప్యూటర్లు ఎందుకూ కొరగాకుండా మూలనపడ్డాయి. మరికొన్ని పాఠశాలల్లో చోరీకి గురయ్యాయి. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించడం పక్కనపెడితే.. వాటి సంరక్షణ ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారమవుతోంది. జిల్లాలో 2008-09 విద్యాసంవత్సరం నుంచి 247 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో నిట్ అనే ప్రైవేటు సంస్థకు ఐదేళ్ల కాంట్రాక్టును అప్పగించారు. కంప్యూటర్‌లతో పాటు జనరేటర్, ఫర్నిచర్, ప్రింటర్ కొనుగోలు చేసి పాఠశాలలకు అందించారు. ఆదోని డివిజన్‌లో 65, డోన్ డివిజన్‌లో 74, కర్నూలు డివిజన్‌లో 58, నంద్యాల డివిజన్‌లో 50 పాఠశాలల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. హైస్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు నిట్ సంస్థ తరఫున ప్రతి పాఠశాలకు ఇద్దరు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. యేడాదికి ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు టీచర్లకు స్టడీమెటీరియల్‌తో శిక్షణనిచ్చి, సర్టిఫికెట్ అందజేశారు. ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయున్ని ల్యాబ్ ఇన్‌చార్జిగా నియమించి శిక్షణనిచ్చారు. నిట్ సంస్థతో ఈ యేడాది సెప్టెంబర్‌తో గడువు ముగిసింది. తాజాగా జిల్లాలోని మరో 62 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. వీటిలో శిక్షణ కొనసాగుతున్నా.. నిట్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలల్లో అటకెక్కింది. ఇన్‌స్ట్రక్టర్లు లేరనే సాకుతో కంప్యూటర్లను మూలనపడేశారు.
ఆదోని పట్టణంలోని 9 పాఠశాలల్లో ఏడింట కంప్యూటర్ విద్య నిలిచిపోయింది. ప్రస్తుతం ఆరేకల్ గురుకుల బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ విద్య అందిస్తున్నారు.
ఆళ్లగడ్డలోని బాలుర ఉన్నత పాఠశాలలో కంప్యూటర్‌లను బీరువాలో పెట్టి భద్రపర్చారు. బాలికల పాఠశాలలో కంప్యూటర్ గదికి తాళం వేసేశారు.
చాగలమర్రిలోని బాలికల ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గదిని ఇతర తరగతులకు వినియోగిస్తున్నారు.
రుద్రవరం మండలంలో కంప్యూటర్ విద్య ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
ఆలూరు బాలుర ఉన్నత పాఠశాల-02లో సిబ్బందిని తొలగించడంతో 11 కంప్యూటర్లు, రూ.60 వేల విలువచేసే జనరేటర్ నిరుపయోగమయ్యాయిహాలహర్వి మండలంలోని బాపురం ప్రాథమికోన్నత పాఠశాల, హాలహర్వి కస్తూర్బా పాఠశాలల్లోనూ సిబ్బంది కరువయ్యారు.
బనగానపల్లె మండలంలోని ఇల్లూరు, కొత్తపేట, పలుకూరు, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు సంవత్సరం క్రితం అపహారణకు లోనయ్యాయి.పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ, దేవనబండ గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూళ్లు ఏర్పాటై ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కంప్యూటర్లను అందివ్వలేకపోయారు.
వెల్దుర్తి మండలం బోయినపల్లి, వెల్దుర్తి బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు కలుగొట్ల, సూదేపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, రామళ్లకోట, గోవర్ధనగిరి, పుల్లగుమ్మి, చెరుకులపాడు, కృష్టాపురం గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి.
కంప్యూటర్ విద్య.. మిథ్య
Published Sat, Dec 28 2013 4:11 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement