డాక్టర్లు కాదు..ఛీటర్లు!  | They are not Doctors ..Cheaters! | Sakshi
Sakshi News home page

డాక్టర్లు కాదు..ఛీటర్లు! 

Published Tue, Nov 27 2018 12:59 PM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

They are not Doctors ..Cheaters! - Sakshi

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌):  వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది. వైద్య విద్యను అభ్యసించాలంటే చాలా కష్టపడాలి. కానీ కొందరు ఎలాంటి కష్టమూ లేకుండానే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో తరచూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతున్నారు.

తాజాగా సోమవారం ఇంటర్మీడియట్‌ చదివి ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా చలామణి అవుతున్న భరత్‌ అనే యువకుడు కర్నూలులోని అమ్మ హాస్పిటల్‌లో పనిచేస్తూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పట్టుబడ్డాడు. అయినప్పటికీ ఇలాంటి వారిని సమూలంగా ఏరివేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసిన తర్వాత అక్కడికెళ్లి రికార్డులు రాసుకోవడంతోనే సరిపెట్టుకుంటోంది. 


ఆర్‌ఎంపీలే పెద్ద డాక్టర్లు! 
ఆదోని డివిజన్‌లోని అన్ని మండలాలు, కర్నూలు డివిజన్‌లోని వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్‌ తదితర మండలాల్లో ఆర్‌ఎంపీలే పెద్ద డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. కర్నూలు నగరంలోని బుధవారపేట, శరీన్‌నగర్, కృష్ణానగర్, వీకర్‌సెక్షన్‌ కాలనీ, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ఆర్‌ఎంపీలే ‘ప్రధాన వైద్యులు’.  వీరికి ఉన్న ‘ప్రాక్టీస్‌’.. నిపుణులైన, అర్హులైన వైద్యులకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

వచ్చీరాని వైద్యంతో  రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి రోగమైనా సరే ముందుగా స్టెరాయిడ్స్, పెయిన్‌ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్‌ ఇవ్వడం, ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం పరిపాటిగా మారింది. కొందరైతే ఏకంగా ప్రసవాలు, అబార్షన్లు చేస్తున్నారు. మరికొందరు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, పత్తికొండ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డ్యూటీ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు.

సోమవారం కర్నూలులో పట్టుబడిన భరత్‌ అనే యువకుడు నగరంలోని అమ్మ హాస్పిటల్‌తో పాటు ఓమిని హాస్పిటల్‌లోనూ పనిచేస్తున్నట్లు అధికారుల వద్ద ఒప్పుకున్నాడు. క్యాజువాలిటీ, ఏఎంసీ, ఐసీయూల్లో డ్యూటీ డాక్టర్లుగా పనిచేసేందుకు ఎంబీబీఎస్‌ చేసిన వారు రాకపోవడంతో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, యునాని, ఆయుర్వేద వైద్యులను నియమించుకుంటున్నట్లు ఆసుపత్రి యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి.

 
విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడిన వారు.. 
- ఈ నెల 19న వెల్దుర్తిలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్లినిక్‌లో డాక్టర్‌ మంగమ్మ అలియాస్‌ డాక్టర్‌ మంజులారెడ్డి పేరుతో ఓ మహిళ తన వద్దకు వచ్చిన రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులు ఇవ్వడమే గాక గర్భిణులకు స్కానింగ్‌ కూడా చేస్తూ పట్టుబడింది.  


-  గూడూరులో 15 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అనురాధ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తిని గత ఏడాది విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి పట్టుకుని, ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఎలాంటి విద్యార్హత లేని అతను 50 పడకల ఆసుపత్రిని నిర్వహించడంతో పాటు ఆయుర్వేదం, అల్లోపతి వైద్యం చేయడం, చిన్నపిల్లలకూ చికిత్స అందించడం గమనార్హం.

అంతటితో ఆగకుండా గర్భిణులకు స్కానింగ్‌ చేసి లింగనిర్ధారణ కూడా చేసేవాడు. కాన్పులతో పాటు అబార్షన్లు చేయడంలోనూ అతను దిట్ట. అయినా అతని ఆసుపత్రి వైపు వైద్య ఆరోగ్యశాఖ కన్నెత్తి చూడలేకపోయింది. చివరకు విజిలెన్స్‌ రంగంలోకి దిగడంతో శ్రీరాములు పాపం పండింది. 


- కర్నూలులోని కొత్తబస్టాండ్‌ ఎదురుగా ఉండే జేపీ హాస్పిటల్స్‌ను ఇంటర్‌ చదివిన యువకులు ఎండీ డాక్టర్లుగా చలామణి అవుతూ నిర్వహించేవారు. విజిలెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి గత సంవత్సరం సీజ్‌ చేశారు. ఈ యువకులే ఆదోనిలో నిర్వహించే విజయగౌరి హాస్పిటల్‌పైనా దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు.

 
- నిబంధనలకు విరుద్ధంగా టైఫాయిడ్, జాండిస్‌ వ్యాక్సిన్లు వేస్తూ ప్రజలను మోసగిస్తున్న కర్నూలు నగరం నెహ్రూనగర్‌లో ఉన్న నకిలీ వైద్యున్ని గత ఏడాది విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇతను 20 ఏళ్లుగా క్లినిక్‌ ఏర్పాటు చేసుకుని.. దర్జాగా వైద్యం చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. 


అనుమతి లేని ఆస్పత్రులు 
జిల్లాలో ఎక్కడైనా ఆసుపత్రి తెరవాలంటే వైద్య, ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఇప్పటి వరకు ప్రైవేటు ఆసుపత్రులు 400, స్కానింగ్‌ కేంద్రాలు 248 రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయి. వీటితో పాటు క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు మరో 150 దాకా రిజిష్టర్‌ అయ్యాయి. అయితే.. వీటికి రెండింతలు ఎక్కువగా జిల్లాలో నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ కోసం చేసుకున్న దరఖాస్తులు వైద్య, ఆరోగ్యశాఖలో పదుల సంఖ్యలో పెండింగ్‌ ఉన్నాయి.

రిజిస్ట్రేషన్‌ గడువు తీరడంతో రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులూ మరో 30కి పైగా ఉన్నాయి. కానీ ఈ ఫైళ్ల వైపు చూసే తీరిక వైద్య,ఆరోగ్యశాఖ అధికారులకు లేకుండా పోయింది. ఇక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లి మామూళ్లు తెచ్చుకుంటూ వాటి అనుమతులు, రెన్యూవల్స్‌ గురించి పట్టించుకోవడం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement