టెన్త్ పరీక్షలు పూర్తి...
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 42,169 మందికి గాను 42,059 హాజరుకాగా 110 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ పరీక్షలకు గాను 1459 మందికి గాను 1369 మంది హాజరుకాగా 90 మంది పరీక్షలకు హాజరుకాలేకపోయారు.
బుధవారం జరిగిన పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు బృగుమాహర్షి బీహెచ్‌ఇఎల్‌లోని జ్యోతి విద్యాలయంలోని రెండు పరీక్ష కేంద్రాలను, బెల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని, సెయింట్ ఆంథోని హైస్కూల్ అర్‌సి పురం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జ్యోతి విద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోని హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నాత బాలుర పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ రావు పరిశీలించారు. సెయింట్ ఆంధోని హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమిల్ నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోని తీసుకొచ్చినందుకు గాను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలిక విద్యాలయంలో పాఠశాల భవనం పనులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని అందుకు పనులు నిలిపివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాంట్రాక్టర్‌కు సూచించగా తాను పనులు నిలిపేది లేదన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష సమయంలో పనులు నిర్వహించడం వల్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఒక దశలో కాంట్రాక్టర్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు సమాచారం అందించడంతో వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. పలు పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్లకు జిల్లా విద్యాశాఖ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులపై ఫొటోలు పెట్టుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.