వాళ్లేం పాపం చేశారు! | study material for telugu and english medium | Sakshi
Sakshi News home page

వాళ్లేం పాపం చేశారు!

Published Thu, Feb 22 2018 11:28 AM | Last Updated on Thu, Feb 22 2018 11:28 AM

study material for telugu and english medium  - Sakshi

కర్నూలు నగరంలోని ఉర్దూ మీడియం హైస్కూల్‌

వచ్చే నెలలో పదవ తరగతి  పబ్లిక్‌ పరీక్షలు.  వాటిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్టడీ మెటీరియల్‌ దోహదపడుతోంది.  ఎందుకో మరి విద్యాశాఖ ఆ మెటీరియల్‌   తెలుగు, ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు మాత్రమే అందజేసి  ఉర్దూ, కన్నడ మాధ్యమం విద్యార్థులకు  మొండిచేయి చూపించింది.  కారణమేమిటంటే ముద్రణ సమస్య, భాష బదలాయింపు అని చేతులు దులుపుకుంది. విద్యార్థులు మాత్రం స్టడీ మెటీరియల్‌ లేకుండా పరీక్షలకు ఎలా  సన్నద్ధం కావాలని  ఆందోళన చెందుతున్నారు.

కర్నూలు సిటీ: పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు బట్టీ విధానానికి స్వస్తి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి నిరంతర సమగ్ర ముల్యాంకనాన్ని(సీసీఈ) అమలు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు సమాధానాలను గైడ్లు, పుస్తకాల్లో చదివి కాకుండా  ప్రశ్నను అవగాహన చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇందులో 100 శాతం ఫలితాలు సాధించేలా వారిని  సన్నద్ధం చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మాదిరి ప్రశ్నల పుస్తకాన్ని ఆధారం  చేసుకున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న సబ్జెక్టు టీచర్లతో ప్రతి ఏటా స్టడీ మెటీరియల్‌  తయారు చేయించి డీసీఈబీ ద్వారా ఇస్తున్నారు. దీంతో చదువులో వెనుకబడిన విద్యార్థి  సైతం  ఈ స్టడీ మెటీరియల్‌ చదివి  సులువుగా పాస్‌ అయ్యేందుకు అవకాశం ఉంది.  

గతేడాది నిధుల కొరత.. ఈసారి ముద్రణ సాకు  
జిల్లాలో ఉర్దూ పాఠశాలలు 17, కన్నడ మీడియం   పాఠశాలలు 11 ఉన్నాయి.వీటిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు  వెయ్యిమందికి పైగా ఉన్నారు. గతేడాది నిధుల కొరత పేరుతో  మెటీరియల్‌ ఇవ్వలేదు. ఈ ఎఫెక్ట్‌  ఫలితాల్లో కొంత చూపింది. ఈసారి అయినా మెటీరియల్‌ ఇస్తారనుకుంటే ముద్రణ సమస్య అని సాకు చూపి విద్యాశాఖ చేతులు ఎత్తేసింది. మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు  ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఉర్దూ, కన్నడ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు    విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత పాఠ్యపుస్తకాలు ఇచ్చినట్లు వారు వాపోతున్నారు. కన్నడ, ఉర్దూ మీడియం చదివే వారు తక్కువగా ఉంటారనే విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణే దీనికంతటికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

స్టడీ మెటీరియల్‌ ఇవ్వాలని కోరాం
జిల్లాలో ఉర్దూ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ ద్వారా  తెలుగు, ఇంగ్లిషు మీడియం వారికి ఇచ్చినట్లు మెటీరియల్‌ ఇవ్వాలని అధికారులను కోరాం. అయితే ట్రాన్స్‌లేషన్‌ సమస్యతో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు.    – దాదాపీర్, ఏపీ ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement