భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది | Hyderabad High Court asks Telangana, AP for steps to stop copying | Sakshi
Sakshi News home page

భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది

Published Wed, Jan 3 2018 3:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Hyderabad High Court asks Telangana, AP for steps to stop copying - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్‌ కాపీయింగ్‌ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్‌ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్‌ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది.

గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్‌ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్‌ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్‌ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది.

మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని మాస్‌ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్‌ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్‌ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement