మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్ తదితర పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రశ్నపత్రం కవర్‌ను తెరవడం మొదలు పరీక్ష ముగిసే వరకు మొత్తం ప్రక్రియను ట్యాబ్‌ల ద్వారా రికార్డింగ్ చేసే విధానం అమలుపై రెండు రాష్ట్రాల వైఖరి తెలియజేయాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్ కాపీయింగ్‌ను అడ్డుకోవడంలో ఉభయ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెరిగిపోతోందని, దీనిపై పత్రికల్లో ఆధారాలతో సహా కథనాలు వచ్చాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే దీనికి పరిష్కారం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. గుజరాత్‌లో పబ్లిక్ పరీక్షల ప్రక్రియను ట్యాబ్‌ల ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్నారని, దీంతో అక్కడ మాస్ కాపీయింగ్ ఆగిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ విధానాన్ని ఉభయ రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైనందున, వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఈ ఏడాదే తొలి అడుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మొదట ఐదు నుంచి పది పాఠశాలలను ఎంపిక చేసి, అక్కడ ప్రయోగాత్మకంగా ట్యాబ్‌ల ద్వారా పరీక్షల ప్రక్రియ రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఈ విధానం అమలుతోపాటు మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.