కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండాలి
పరీక్ష విధానంపై హైకోర్టు వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేని విధంగా పరీక్ష విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే మాస్ కాపీయింగ్ నిరోధానికి వినూత్న సూచనలు, సలహాలు ఇవ్వాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టీకరించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతలను అడ్డుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారని, మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం రెండోసారి విచారించింది.