సాక్షి, హైదరాబాద్: సాహితీ వేత్త, కవి, రచయిత, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ (63) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) సంతాపం వ్యక్తం చేసింది. ‘‘నన్కొక మొక్కను చేయండి/ మీ ఇంటి ముందు పువ్వునవుతాను/... నన్ను దేవున్ని మాత్రం చేయకండి/ముక్కోటి దేవతలతో విసిగిపోయాను/... నన్నొక పిడికిలి చేయండి/ నలుగురికోసం నినదిస్తాను/.. సీతాకోకచిలుకల రెక్కలు విరిచి స్వేచ్ఛ గురించి మాట్లాడకండి..’’ అంటూ మన వ్యవస్థ గూర్చి చెబుతూ తన అభ్యుదయ భావాలను ప్రకటించిన కవి సాహిత్య విమర్శకులు ఎండ్లూరి సుధకర్ అని అరసం గుర్తు చేసుకుంది.
వర్తమానం, కొత్తగబ్బిలం, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, ‘ఆటా’ జనికాంచె, గోసంగి ఇత్యాది కవితా సంపుటులు, జాషువాపై పరిశోధనా గ్రంథాలు, దళిత సాహిత్యంపై పలు కోణాల నుంచి వ్యాసాలను ఎండ్లూరి సుధాకర్ వెలువరించారని పేర్కొంది.వెస్లీ బాయిస్ హైస్కూల్‌లో పనిచేశారని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారని, పలు అవార్డులు పొందారని తెలిపింది.
స్నేహశీలి, మృదు స్వభావి, అరసంకు సన్నిహితులైన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కీర్తిశేషులైనందుకు జంట తెలుగు రాష్ట్రాలు అభ్యుదయ సాహితీవేత్తను కోల్పోయిందని తెలిపింది. అందుకు తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రగాఢ సంతాసాన్ని తెలుపుతోందని అరసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీ రామారావ్, డా.రాపోలు సుదర్శన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment