( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ కల్చరల్: ‘నిరుపేద, మధ్యతరగతి నుంచి వచ్చిన అజ్ఞానిని నేను.. కవిని కాదు’అంటూనే ఎన్నో రచనలు చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ గోపన్‌పల్లిలోని స్వగృహంలో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటాక గుండెపోటు రావ డంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు మానస, మనోజ్ఞ. ఆయన భార్య డాక్టర్ పుట్ల హేమలత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.
అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనతోనే ఉన్నారు. కరోనా వచ్చి తాను కూడా తన హేమ వద్దకు వెళ్లిపోతే బాగుండునని సన్నిహితుల వద్ద తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారు. ‘తారాన్వేషణ’అనే కవితలో తన మనోవేదనను వ్యక్తీకరించారు. ‘...ఏదో ఒక క్రిస్మస్ రాత్రి మన ఇంటి గుమ్మం ముందు దేహధారిత ధ్రువతారలా ఉదయిస్తావు’అంటూ ఆమెను స్మరించుకున్నారు. ఆ కవితను తన స్నేహితులతోనూ పంచుకున్నారు. నారాయణగూడలోని సిమెట్రీలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి.
వీధిబడి చదువులతో ప్రస్థానం...
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాములబíస్తీలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు సుధాకర్ ప్రథమ సంతానం. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. నిజామాబాద్‌లో తన 12వ ఏట వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సుధాకర్... ఆ తర్వాత హైదరాబాద్ నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఒరియంటల్ విద్య, ఓయూలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో విశేష సేవలందజేశారు. ఎంతో మంది విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల లఘు చిత్రాల అనువాదకుడిగా పనిచేశారు.
ఎండ్లూరి రచనలు...: తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో గుర్తింపు పొందిన ఎండ్లూరి సుధాకర్... వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల వంటి రచనలతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. ఇందూరు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన... రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో జరిగిన తెలుగు సాహితీ సభల్లో ఇందూరు కీర్తిని చాటారు.
ఎండ్లూరి కవిత్వానికి మరణంలేదు: జూలూరి
తన రచనలతో దళిత సాహిత్యాన్ని ఉన్నతీకరించిన ఎండ్లూరి సుధాకర్ మృతిపట్ల పలువురు రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ కవిత్వానికి మరణం లేదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి ఇష్టుడైన గొప్ప కవిని సాహిత్య రంగం కోల్పోయిందని ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
వరించిన పురస్కారాలెన్నో...
2002 అమెరికా తెలుగు అసోసియేషన్, 2011 మారిషస్ ప్రపంచ తెలుగు సదస్సు సిలికాన్ ఆంధ్ర రిసోర్స్ పర్సన్‌గా తెలుగు వైభవాన్ని చాటారు. 1980లో లలితకళా పరిషత్ పురస్కారం, కవికోకిల జాషువా పురస్కారం గరికపాటి సాహిత్య పురస్కారం, తెలుగు వర్సిటీ ధర్మనిది పురస్కారం, సినారె పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం, డాక్టర్ జీఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు, అరుణ్ సాగర్ ట్రస్ట్ మెమోరియల్ అవార్డు వంటివెన్నో ఆయన్ను వరించాయి. ఆయన కుటుంబానికి సైతం తెలుగు సాహిత్యంతో విడదీయరాని సంబంధం ఉంది. సుధాకర్ సతీమణి హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు. కుమార్తె మానస కథా రచయిత్రి. ఆమె రాసిన కథా సంపుటి ‘మిళింద’కథల సంపుటికి 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment