Progressive Writers Association
-
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి
చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా వైరస్, మలేరియా, డెంగీ జ్వరం, దోమలతో పోల్చారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించడం కాదు, నాశనం చేయాలన్నారు. శనివారం చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడారు. ‘సనాతన్ అనేది సంస్కృత పదం. సనాతన్ అంటే ఏమిటి? ఇది శాశ్వతమైంది. అంటే మార్చేందుకు వీల్లేనిది. ఎవరూ ప్రశ్నించలేనిది. మతం, కులం ఆధారంగా ఇది ప్రజలను విడదీస్తుంది’ అని ఉదయనిధి అన్నారు. ‘సనాతన ధర్మం కారణంగా భర్త కోల్పోయిన మహిళలు నిప్పుల్లోకి నెట్టివేయబడ్డారు(గతంలో సతీసహగమనం). వితంతువులకు శిరోముండనం చేయించారు. తెల్ల చీరలు ధరింపజేశారు. బాల్య వివాహాలూ జరిగాయి. ద్రవిడ విధానంలో అటువంటి వాటిని లేకుండా చేశాం . వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విశ్వకర్మ యోజన పథకం, 1953లో రాజగోపాలాచారి తీసుకువచ్చిన కులాధారిత విద్యా పథకం వంటిదే. డీఎంకే దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు నోచుకోరాదనే నీట్ వంటి వాటిని కేంద్రం తీసుకు వచ్చింది. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం’అని ఉదయనిధి చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అని ఉదయనిధి అన్నారు. ‘అన్ని కులాల వారు ఆలయా ల్లో అర్చకత్వానికి అర్హులేనంటూ కరుణా నిధి చట్టం తెచ్చారు. మన సీఎం స్టాలిన్ అర్చకత్వంలో శిక్షణ పొందిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించారు. ఇదే ద్రవిడియన్ మోడల్’ అని ఆయన చెప్పారు. అది విద్వేష ప్రసంగం: బీజేపీ సనాతన ధర్మాన్ని ఆచరించే 80% మందిని సామూహికంగా చంపేయాలంటూ ఉదయనిధి వ్యాఖ్యానించడం విద్వేష ప్రసంగమేనని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ అన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకవైపు ప్రేమ దుకాణం తెరుద్దామని పిలుపునిస్తుండగా డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారన్నారు. సామూహికహననం వ్యాఖ్యలపై కాంగ్రెస్ మౌనం మద్దతు నివ్వడమే అవుతుంది. పేరుకుతగ్గట్లే ఇండియా కూటమికి అధికారమిస్తే వేలాది సంవత్సరాల భారత సంస్కృతిని ధ్వంసం చేస్తుంది’ అని పేర్కొన్నారు. నేనలా అనలేదు: ఉదయనిధి తన వ్యాఖ్యలపై చెలరేగిన విమర్శలపై ఉదయనిధి ‘ఎక్స్’లో స్పందించారు. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని సాధించడమే. సనాతన ధర్మం కారణంగా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన వారి తరఫున మాట్లాడాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని సామూహికంగా హతమార్చాలని మాత్రం నేను అనలేదు. సమాజంపై సనాతన ధర్మం ఎటువంటి చెడు ప్రభావం చూపిందనే విషయంలో అంబేడ్కర్, పెరియార్ వంటి వారు అధ్యయనం చేసి రాసిన పుస్తకాల్లో ఏముందో చూపిస్తాను. ఎటువంటి సవాళ్లయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం’అని పేర్కొన్నారు. ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుంగార్పూర్(రాజస్తాన్): సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ఈ విధమైన ఆరోపణలకు దిగుతున్నాయని మండిపడ్డారు. లష్కరే తోయిబా కంటే హిందుత్వ సంస్థలే మరింత ప్రమాదకరమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇలాంటివి వీరికి కొత్తకాదు, ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని పేర్కొన్నారు. -
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతిపట్ల అరసం సంతాపం
సాక్షి, హైదరాబాద్: సాహితీ వేత్త, కవి, రచయిత, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ (63) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) సంతాపం వ్యక్తం చేసింది. ‘‘నన్కొక మొక్కను చేయండి/ మీ ఇంటి ముందు పువ్వునవుతాను/... నన్ను దేవున్ని మాత్రం చేయకండి/ముక్కోటి దేవతలతో విసిగిపోయాను/... నన్నొక పిడికిలి చేయండి/ నలుగురికోసం నినదిస్తాను/.. సీతాకోకచిలుకల రెక్కలు విరిచి స్వేచ్ఛ గురించి మాట్లాడకండి..’’ అంటూ మన వ్యవస్థ గూర్చి చెబుతూ తన అభ్యుదయ భావాలను ప్రకటించిన కవి సాహిత్య విమర్శకులు ఎండ్లూరి సుధకర్ అని అరసం గుర్తు చేసుకుంది. వర్తమానం, కొత్తగబ్బిలం, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, ‘ఆటా’ జనికాంచె, గోసంగి ఇత్యాది కవితా సంపుటులు, జాషువాపై పరిశోధనా గ్రంథాలు, దళిత సాహిత్యంపై పలు కోణాల నుంచి వ్యాసాలను ఎండ్లూరి సుధాకర్ వెలువరించారని పేర్కొంది.వెస్లీ బాయిస్ హైస్కూల్లో పనిచేశారని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారని, పలు అవార్డులు పొందారని తెలిపింది. స్నేహశీలి, మృదు స్వభావి, అరసంకు సన్నిహితులైన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కీర్తిశేషులైనందుకు జంట తెలుగు రాష్ట్రాలు అభ్యుదయ సాహితీవేత్తను కోల్పోయిందని తెలిపింది. అందుకు తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రగాఢ సంతాసాన్ని తెలుపుతోందని అరసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీ రామారావ్, డా.రాపోలు సుదర్శన్ పేర్కొన్నారు. -
ఎవరికి పట్టింది చాసో శత జయంతి?
తెలుగు కథా శిల్పులలో గురజాడ వారసుడిగా నిలిచి, వజ్రాల వంటి ఐదు కథలు రాసి, అభ్యుదయ రచయితల సంఘంలో కీలకపాత్ర వహించి, తెలుగు కథకు తూర్పు దిక్కు సూర్యుళ్లలో ఒకడుగా నిలిచి చాగంటి సోమయాజులు (చాసో) శత జయంతి ముగింపు వచ్చినా (17, జవనరి) తెలుగు సమాజం ఆయనను గౌరవించుకోవలసిన రీతిలో గౌరవించిందా అనే సందేహం వస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి వస్తున్నది. తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐకి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. ‘హైదరాబాద్ కేంద్రకం’గా జరుగుతున్న కార్యకలాపాల వల్ల రాష్ట్ర ఇతర ప్రాంతాల సాంస్కృతిక, సాహిత్య ప్రాధాన్యతలు తగ్గిపోతున్నాయి. తెలుగు సాంస్కృతిక నిర్మాతల విషయంలో కూడా ‘మీరూ’, ‘మేమూ’ అనే దృష్టి రావడం హానికారకంగా ఉంది. తరచి చూస్తే శ్రీశ్రీ, గురజాడలకు పట్టిన గతే చాసో విషయంలో కూడా పునరావృతమవుతున్నది. చాసో పుట్టిన రోజు అయిన జనవరి 17న వీరు ఎక్కడైనా చాసోకు ఒక పూల మాల అయినా వేస్తారా అంటే సందేహమే. దిన పత్రికల పేర్లు మార్చుకోవడం, తమ ప్రచురణ సంస్థ పేరు మార్చుకుని చీల్చుకోవడంలో గల ఉత్సాహం సాంస్కృతిక సందర్భాల పట్ల కూడా ఉండాలని ఈ చీలిన రాష్ట్రపు సి.పి.ఐ వారు తెలుసుకుంటారా తెలుసుకుంటే చాసో శతజయంతి ఇలా ఇంత నీరసంగా ఉండేదా? వీరి ప్రచురణ సంస్థ విశాలాంధ్ర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేరు మార్చుకుంది. అయినా పాత పేరు ఎక్కడికీ పోదు. మరి ఈ విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు. చాసో రచనలపై విశ్లేషణో, సమగ్ర రచనల ముద్రణో ఏమీ చేపట్టలేదు. కాపీరైటు విషయాలు వివాదాస్పదమైతే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. దినపత్రిక కలిగి ఉండి కూడా చాసో సాహిత్యం పట్ల పోటీలు పెట్టడం, కథల నాటకీకరణకు ప్రోత్సహించడం వంటి పనులు చేయలేదు. అవన్నీ ఎలా ఉన్నా సావనీర్ తేవచ్చు. కనీసం ఆ పనీ చేయలేదు. మరి ఈ తరం తెలుగు పిల్లలకు రోల్మాడల్స్ను ఎక్కడి నుంచి వీరు తయారు చేస్తారు? ఇక వీరి అనుబంధ సాహిత్య సంస్థ అయిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ దగ్గరికొస్తే వీరిలో విభజన వాదులు ‘తెలంగాణ అరసం’గా మారిపోగా ఇటు మిగిలినవారు కూడా చాసో విషయంలో అంతే ఉదాసీనతను చూపించారు. వీరిలో పెనుగొండ లక్ష్మీనారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, చాగంటి తులసి, చందు సుబ్బారావు, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి వంటి రాష్ట్ర అరసం ముఖ్యులెందరో ఉన్నారు. ఇటీవల గుంటూరు నుంచి వెలువడిన అరసం ప్రచురణలలో పదిమంది రచయితలలో ఒకడిగా చాసో కథల సంపుటి కూడా వచ్చిందనేది చిన్న సాంత్వన సమాచారం. ఇంతకు మించి అరసానికి తన వ్యవస్థాపక అధ్యక్షుడి గురించి ఎటువంటి ప్రణాళికా లేకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో ఈ శత జయంతి కాలాన్ని 2016 జనవరి దాకా రెండేళ్ల పాటు జరుపుకోవడం సరైన పద్ధతి. తద్వారా కింది లక్ష్యాలు సాధించవచ్చు. చాసో పేరిట తపాలా బిళ్ల విడుదల చాసో శిలావిగ్రహం ఏర్పాటు చాసో కథలను అంతర్జాతీయ భాషలలోకి అనువాదం, నాటకాలు, లఘు చిత్రాలుగా రూపకల్పన. చాసో నవ్యమైన దృష్టి నాణ్యమైన కథలను ప్రసాదిస్తుందని నమ్మాడు. పెన్సిల్ కంటే రబ్బర్ ఎక్కువ వాడాడు. నచ్చనివి చింపి పారేశాడు. నచ్చినవాటితో ప్రజలకు చేరువ అయ్యాడు. 2014లో చేయలేని పనులన్నీ 2015లో చేసి చూపిద్దాము. అందుకు కలిసి వచ్చే వారు ఎవరైనా వారికి తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం శాశ్వతం. - రామతీర్థ 9849200385 (చాసో శతజయంతి సందర్భంగా జనవరి 17న విజయనగరంలో చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి ప్రదాన కార్యక్రమం. జనవరి 18న విశాఖలో మొజాయిక్ సంస్థ ఆధ్వర్యంలో ‘తెలుగు సాహిత్యం- అంతర్జాతీయీకరణ’ పేరిట తెలుగు కథల ఆంగ్లానువాదాల సిరీస్ వెలువరింత) తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐ.కి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు.