ఎవరికి పట్టింది చాసో శత జయంతి?
తెలుగు కథా శిల్పులలో గురజాడ వారసుడిగా నిలిచి, వజ్రాల వంటి ఐదు కథలు రాసి, అభ్యుదయ రచయితల సంఘంలో కీలకపాత్ర వహించి, తెలుగు కథకు తూర్పు దిక్కు సూర్యుళ్లలో ఒకడుగా నిలిచి చాగంటి సోమయాజులు (చాసో) శత జయంతి ముగింపు వచ్చినా (17, జవనరి) తెలుగు సమాజం ఆయనను గౌరవించుకోవలసిన రీతిలో గౌరవించిందా అనే సందేహం వస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి వస్తున్నది.
తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐకి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. ‘హైదరాబాద్ కేంద్రకం’గా జరుగుతున్న కార్యకలాపాల వల్ల రాష్ట్ర ఇతర ప్రాంతాల సాంస్కృతిక, సాహిత్య ప్రాధాన్యతలు తగ్గిపోతున్నాయి. తెలుగు సాంస్కృతిక నిర్మాతల విషయంలో కూడా ‘మీరూ’, ‘మేమూ’ అనే దృష్టి రావడం హానికారకంగా ఉంది. తరచి చూస్తే శ్రీశ్రీ, గురజాడలకు పట్టిన గతే చాసో విషయంలో కూడా పునరావృతమవుతున్నది. చాసో పుట్టిన రోజు అయిన జనవరి 17న వీరు ఎక్కడైనా చాసోకు ఒక పూల మాల అయినా వేస్తారా అంటే సందేహమే. దిన పత్రికల పేర్లు మార్చుకోవడం, తమ ప్రచురణ సంస్థ పేరు మార్చుకుని చీల్చుకోవడంలో గల ఉత్సాహం సాంస్కృతిక సందర్భాల పట్ల కూడా ఉండాలని ఈ చీలిన రాష్ట్రపు సి.పి.ఐ వారు తెలుసుకుంటారా తెలుసుకుంటే చాసో శతజయంతి ఇలా ఇంత నీరసంగా ఉండేదా? వీరి ప్రచురణ సంస్థ విశాలాంధ్ర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేరు మార్చుకుంది. అయినా పాత పేరు ఎక్కడికీ పోదు. మరి ఈ విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు. చాసో రచనలపై విశ్లేషణో, సమగ్ర రచనల ముద్రణో ఏమీ చేపట్టలేదు. కాపీరైటు విషయాలు వివాదాస్పదమైతే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. దినపత్రిక కలిగి ఉండి కూడా చాసో సాహిత్యం పట్ల పోటీలు పెట్టడం, కథల నాటకీకరణకు ప్రోత్సహించడం వంటి పనులు చేయలేదు. అవన్నీ ఎలా ఉన్నా సావనీర్ తేవచ్చు. కనీసం ఆ పనీ చేయలేదు. మరి ఈ తరం తెలుగు పిల్లలకు రోల్‌మాడల్స్‌ను ఎక్కడి నుంచి వీరు తయారు చేస్తారు?
ఇక వీరి అనుబంధ సాహిత్య సంస్థ అయిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ దగ్గరికొస్తే వీరిలో విభజన వాదులు ‘తెలంగాణ అరసం’గా మారిపోగా ఇటు మిగిలినవారు కూడా చాసో విషయంలో అంతే ఉదాసీనతను చూపించారు. వీరిలో పెనుగొండ లక్ష్మీనారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, చాగంటి తులసి, చందు సుబ్బారావు, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి వంటి రాష్ట్ర అరసం ముఖ్యులెందరో ఉన్నారు. ఇటీవల గుంటూరు నుంచి వెలువడిన అరసం ప్రచురణలలో పదిమంది రచయితలలో ఒకడిగా చాసో కథల సంపుటి కూడా వచ్చిందనేది చిన్న సాంత్వన సమాచారం. ఇంతకు మించి అరసానికి తన వ్యవస్థాపక అధ్యక్షుడి గురించి ఎటువంటి ప్రణాళికా లేకపోవడం శోచనీయం.
ఈ నేపథ్యంలో ఈ శత జయంతి కాలాన్ని 2016 జనవరి దాకా రెండేళ్ల పాటు జరుపుకోవడం సరైన పద్ధతి. తద్వారా కింది లక్ష్యాలు సాధించవచ్చు.
చాసో పేరిట తపాలా బిళ్ల విడుదల చాసో శిలావిగ్రహం ఏర్పాటు చాసో కథలను అంతర్జాతీయ భాషలలోకి అనువాదం, నాటకాలు, లఘు చిత్రాలుగా రూపకల్పన. చాసో నవ్యమైన దృష్టి నాణ్యమైన కథలను ప్రసాదిస్తుందని నమ్మాడు. పెన్సిల్ కంటే రబ్బర్ ఎక్కువ వాడాడు. నచ్చనివి చింపి పారేశాడు. నచ్చినవాటితో ప్రజలకు చేరువ అయ్యాడు. 2014లో చేయలేని పనులన్నీ 2015లో చేసి చూపిద్దాము. అందుకు కలిసి వచ్చే వారు ఎవరైనా వారికి తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం శాశ్వతం.
- రామతీర్థ 9849200385
(చాసో శతజయంతి సందర్భంగా జనవరి 17న విజయనగరంలో చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి ప్రదాన కార్యక్రమం. జనవరి 18న విశాఖలో మొజాయిక్ సంస్థ ఆధ్వర్యంలో ‘తెలుగు సాహిత్యం- అంతర్జాతీయీకరణ’ పేరిట తెలుగు కథల ఆంగ్లానువాదాల సిరీస్ వెలువరింత)
తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐ.కి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు.