Chaganti Somayajulu
-
బొమ్మల పెళ్లి
‘‘తుమ్ములా తుమ్మలా? రెండూ ఉన్నాయి. మీరేది చెప్పమంటే అది చెపతాను’’ అన్నాది ముత్తవ్వ. ‘‘తుమ్ముల మాటే’’ అన్నాది మునిమనవరాలు. తుమ్ములమాట తొంభైసార్లు మునిమనవరాలు వింది. విన్నదే వినడం దానికి సరదా. చెప్పిందే చెప్పడం ముత్తవ్వకి సరదా. ‘‘తుమ్ముల తగాయిదా గొడవ గొడవగా ఉంటుంది. మా ఊళ్లో మా చిన్నతనంలో తుమ్మ అడవి కోసం రామరావణ యుద్ధం అయిపోయింది. దాంట్లో వ్యవహారపు పేచీలు ఇన్నీ అన్నీ కావు. ఇద్దరు చచ్చిపోయారు. పాతిక ముప్పై మందికి గాయాలు తగిలి రక్తమండలాలై పోయాయి. అదుగో, ఆ దొమ్మీ అయిపోయినాకే మా నాన్న కట్టుకాసుల పేరు మా అమ్మకు చేయించాడు. అందులోకి ఆ రామునాయుడున్నాడే వాడు రావణాసురుడే. వాడికి పుట్టిన పోయి కాలం బుద్ధి ఇంతా అంతా కాదు’’ అంటూ ముత్తవ్వ తుమ్మడొంకల్లోకి పోయింది. ‘‘తుమ్మలు కాదు తుమ్ములు’’ అన్నాడు మునిమనవడు. ‘‘అలాగేదో చెప్పండి మరి’’ అన్నాది ముత్తవ్వ. ‘‘బాగా చెప్పు. బాగా చెప్పితే పొద్దున్నే నీకు దోరజామికాయలు బోలిడు కోసి పెడతాను’’ అన్నాడు మనవడు. ముత్తవ్వ వొళ్లు వొడిలిపోయినా, దృష్టి మాంద్యం వొచ్చీసినా పళ్ళు మాత్రం ఊడలేదు. దోరజామికాయలు ఉడతలాగ ఎన్నిచ్చినా అంత చక్కగాను కొరుక్కు తింటుంది. ‘‘రుధిరోద్గారినామ సంవత్సరానికి అరవై ఏళ్లు. ఇది ఈశ్వరనామ సంవత్సరం. రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన’’ అని ముత్తవ్వ వేళ్లు లెక్క పెట్టింది. ‘‘ధాత, ఈశ్వర ఇవి పదిహేనేళ్లు. డెబ్భై ఐదేళ్లు అప్పుడే అయిపోయింది. అంతా నిన్న మొన్నలాగుంది! అప్పుడు నేనింకా ఏడేళ్ళదాన్ని. గోచీ పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని’’ ‘‘ఛీఛీ తవ్వా! గోచీ పెట్టుకొని తిరిగేదానివా?’’ అని పరమసహ్యంతో మునిమనవడు అడిగేడు. ముత్తమ్మ వాళ్లమ్మమ్మకి అమ్మ. ముని మనవలంతా తవ్వా తవ్వా అని పిలిచేవాళ్లు. ‘‘తవ్వని కాకపోతే సోల నౌతానర్రా?’’ అని ముత్తవ్వ పొంగిపోతూ అలాగ పిలిస్తేనే సంబరపడిపోయేది. ‘‘ఛీఛీ ఏం? అంచక్కా గోచీలు పెట్టుకునే వాళ్ళం. ఎంత పెద్దింటి పిల్లలైనా గోచీలే! చిన్నపిల్లలకి వొండినిండా బట్టలేమిటి నా నెత్తి! పసుపులు రాసుకొని దబ్బపండులాగా మిసమిసలాడుతూ వొళ్లంతా కనబడితేనే ఆ ఈడు పిల్లలకి అందం. ఓ పెళ్ళిళ్లకీ, పేరంటాలకీ, కార్యాలకీ, కథలకీ వెళ్ళినప్పుడు లంగాలు కబ్బాలు తొడుక్కునేవాళ్ళం. ఇప్పుడంతా తెనుగు మీరిపోయారు’’ ‘‘గోచీల గొడవలో పడకు’’ అన్నాడు మునిమనవడు. ‘‘తవ్వ అలాగే చెబుతుంది. చెప్పు చెప్పు తవ్వా’’ అన్నాది మునిమనవరాలు. కణకణలాడుతున్న నిప్పులతో పెద్ద మట్టికుంపటిని మధ్య పెట్టుకుని తవ్వా మనవలు తెల్లవారుజామున వెచ్చగా కూచున్నారు. తవ్వ తాపీగా ప్రారంభించింది. ‘‘ఊళ్లోకి ఎరకలాళ్లు కర్ణపిశాచి ఉన్నట్లు నల్లపూసలూ పట్టుదారాలు తీసుకొచ్చారు. వొడ్లు వెల పెట్టి పుచ్చుకున్నాం’’ ‘‘వొడ్లంటే?’’ మునిమనవడు అడిగేడు. ‘‘వొడ్లంటే తెలీయదురా నాగమ్మా! ఇప్పుడు పట్నాల్లో పిల్లలకి ఏమీ తెలియవు వొడ్లంటే ధాన్యం. వెల పెడితేనే ఏ వొస్తువేనా కొనుక్కోవడం. ఎర్రని రాగి డబ్బు కంట పడేది కాదు. గరిసెలకొద్దీ, పుట్లకొద్దీ ఇంటినిండా దినుసులుండేది. ఎన్ని పుట్లు కొలిచి పోసినా కోవటి పదిరూపాయిలు చేతిలో పెట్టేవాడు కాదు. సంవత్సరానికీ ఐదు రూపాయిలు–ఐదంటే ఐదు రూపాయిలు–పన్ను కట్టుకోలేక మా మేనమామ ఏభై ఎకరాల భూమి వొదులుకున్నాడు’’ ‘‘తవ్వా తవ్వా తుమ్ములమాట మరిచిపోతున్నావు’’ అన్నాడు మునిమనవడు. ‘‘తవ్వ అలాగే చెపుతుంది. చెప్పు చెప్పు తవ్వా’’ అంది మునిమనవరాలు. ‘‘నీకేం పోయింది. జేగంట వేళైపోతుంది’’ అన్నాడు మనవడు. వాళ్ల నాన్నగారు నట్టింట్లో ధావళి కట్టుకుని, ధావళి కప్పుకుని, దేవుడు పట్టుకెదురుగ్గా కూర్చొని ‘కలియుగే ప్రథమపాదే’ అని ఏనాడో దేవతార్చన సంకల్పించాడు. వాళ్లమ్మా బామ్మా రెండు పేడా పొయ్యలు బండెడు కర్రలతో ముట్టడించి వంట వండేస్తున్నారు. తెల్లవారుజామున రోజో పిండివంటతో వంట వండుకుని దేవతా నైవేద్యాలు పెట్టి సూర్యోదయానికి పూర్వమే ధనుర్మాసమంతా భోజనాలు చేసేవారు. వాళ్ల నాన్న జేగంట కొట్టారా అంటే పూజ పూరై్త భోజనం దగ్గిరపడ్డాదన్నమాటే. ముత్తవ్వ మళ్లీ మొదలుపెట్టింది. ‘‘ఇత్తడిరేకు ఇచ్చి కంసాలిని పుస్తెలు చెయ్యమన్నాము. అలాగేనమ్మా అని కంసాలి నిలుచున్న పాళంగా మధ్యని ఎర్రపాళ్లు వేసి పుస్తెలు చేసి పెట్టేడు’’ ‘‘కంసాలికీ వొడ్లు ఇచ్చారా?’’ అన్నాడు మునిమనవడు. ముత్తవ్వ మొహం మీది ముడతలన్నీ గర్వంతో నిండిపోయాయి. తొంభైఏళ్ల తొక్కు పులికొదమలాగ మొహం పెట్టుకుని చెప్పింది. ‘‘వొడ్లు ఇవ్వడం ఖర్మమేం? ఊళ్లో కంసాలి ఊరికే చేసి పెట్టేడు. మా నాన్న మరెవ్వరూ కాదు కరణంగారు. గడగడలాడి పోయేవారు అధికార్లంతా. మా ఇంట్లోనే బస. అంతా వెట్టిచాకిరీకి చెయ్యవలసిందే. ఏది కావలసి వచ్చినా కాకి చేత కబురు పంపితే చాలు బెల్లపుదిమ్మలు, నేతికుండలు సర్వం–దిసుసులన్నీ వొచ్చి పడిపోయేవి. శుభకార్యమంటే ఇహ చెప్పతరం కాదు. మా నాన్న ఏలుబడి మా గొప్ప ఏలుబడి. జిల్లాకే పేరు మోసిపోయేడు. ఏ నాడున్నాడో ఏ లోకంలో ఉన్నాడో! ఎక్కడికేను వెళ్ళేడంటే రెండెడ్ల సవారీ. బండి ఘల్లుఘల్లుమని మువ్వలు మోగుతూ ఠీవీగా వెళ్ళేది. ముందు దివిటీలు పట్టుకుని ఇద్దరు చాకళ్లు పరిగెట్టేవారు. వెయ్యిమంది వెంటవెళ్లేవారు. ఇదిగో మా అన్నదమ్ములు చేజేతులా మిరాసీ వొదులుకుని ఉద్యోగాల్లో ప్రవేశించారు. బూరెల్లోనూ బొబ్బట్లలోనూ గిన్నెడేసి నెయ్యి దిమ్మరించేకునేవాళ్లం. ఇప్పుడు పప్పు వొణ్ణంలోకి మిల్లి గరిటెడు నెయ్యికి మొహం వాచిపోతున్నాము’’ ‘‘తవ్వా తవ్వా నేతుల గొడవలో పడిపోయావు’’ అన్నాడు మునిమనవడు. ‘‘చెప్పు చెప్పు తవ్వా’’ అన్నాది ముని మనవరాలు. ‘‘ఏం చెయ్యమన్నావురా, మా తండ్రుల నాడు నేతులు తాగేము. జ్ఞాపకమొస్తే వొళ్లు ఝల్లుమంటుంది. మా తాతతండ్రుల ఇల్లు తాటేకుల మిద్దె ఇల్లే. వాస తరవాత వాస, వాస తరవాత వాస. నాలుగు వాసల ఇల్లు. ముఫ్ఫైరెండు గదులుండేవి. మా తండ్రుల నాటిదాకా సమిష్టిగా ఏకకుటుంబమే. నిత్యం పెళ్లివారిల్లులాగుండేది. వొణ్ణం ఎప్పుడూ బిందెలతో వార్చడమే. ఆ వంటలు వార్పులూ ఇప్పుడు లేనేలేవు. ఆడవాళ్లలో ఆ జవసత్తువలూ లేవు. ఆ మనుషులూ ఆ అభిమానాలు అన్నీ వెళ్లిపోయాయి ఆ ఇంట్లో. మా ఆడపిల్లలకి వేరే బొమ్మరిల్లు ఉండేది. ఆడపిల్లలు బొమ్మల పెళ్లిళ్లు చేసుకుంటారని పెద్దవాళ్లే బొమ్మరిల్లు కట్టించారు. లక్కస్తంభాలతో పెద్ద పందిరీ. మా తాతల అప్ప చెల్లెళ్లు, మా మేనత్తలు వాళ్ల నాడు వాళ్లు ఎన్ని పెళ్లిళ్లో ఆ పందిట్లో చేసుకున్నారు. మానాడు మేమూ చేసుకున్నాము. బొమ్మల పెళ్లి బొమ్మల పెళ్లిలాగ చేసేవాళ్లమా? నిజం పెళ్లిలాగు యధావిధిగా అన్ని తంతులు జరిపి ఐదురోజులూ పెను ప్రళయంగా చేసేవాళ్ళము. రుధిరోద్గారినామ సంవత్సర వైశాఖ బహుళ విదియ ఆదివారం మా అక్కయ్య వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్లిలోనే నా ఆడబొమ్మకీ మా వొదిన మొగబొమ్మకీ పెళ్లిచేయడానికి నిశ్చయ తాంబులాలు మా వొదినా నేనూ ఇచ్చుకున్నాము. పందిట్లో మా అక్కయ్య పెళ్లి అయిన మరి నాలుగు ఘడియలకి మేము మంచి ముహుర్తం చేశాము. మా బొమ్మల పెళ్లికి ఒక టకోరామేళం వీరణాలతో సహా మా నాన్న ప్రత్యేకం ఏర్పాటు చేయించాడు. పిల్లలు సరదా పడుతున్నారంటే మా నాన్న కొండ మీది కోతిని తెప్పించి అక్కడ పెట్టేవాడు. పెళ్లికి కావలసిన సమస్త వస్తుజాలం బొమ్మరింట్లో ఉండేది. ఊరేగించడానికి మా ముసలమ్మలనాటి లక్కపల్లకీ మాదాకా ఉంది. గంగడు లేత తాటిమట్ట కొట్టి తెచ్చి పెట్టేడు. పచ్చగా బంగారంలాగ మెరుస్తున్న వెడల్పాటి తాటిరేకులతో బొమ్మల్నీ చేశాము’’ ‘‘అబ్బా! ఇంత పెళ్ళీ తాటేకు బొమ్మలకా?’’ అని ఏవగించుకొన్నాడు మునిమనవడు. ‘‘తాటేకులైతేనేం? దర్జీ దగ్గరకి వెళ్లి పట్టుపరికిణీ కబ్బా పెళ్లి కూతురికీ, చెమ్కీ ముఖమల్లుకోటు పెళ్లికొడుక్కీ కుట్టించి తొడిగేము. ఐతే అవి ఎదురు సన్నాహానికీ ముత్యాల పల్లకిలో ఊరేగించడానికి మాత్రమే...మధుపర్కాలు కట్టిన దగ్గర నుంచీ–దీక్షా వస్త్రాలు కదూ–వాటితోటే ఊరేగించేవారము. పసుపు నలుగులు పెట్టి మంగళ స్నానాలు చేయించిన దగ్గర నుంచి తాటేకు బొమ్మలైనా కళకళలాడుతూ ఎంత బాగుండేవి! పెద్దపెద్ద వాళ్లంతా ఎంతో మెచ్చుకున్నారు. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా చేశారంటే ఎంత బాగా పెళ్లి చేశారని అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. లగ్గం మొదలు నాగవిల్లీ దాకా ఏ వొక్కటీ వొదిలి పెట్టలేదు. ఎప్పుడేది చేస్తారో మాకు తెలియకపోతే కదూ? పాటలతో పెళ్లిపందిరి ఎగరగొట్టేశాము. ఎన్నెన్ని పాటలు! బొమ్మపెళ్లికని– చదువులు రావు కదా! నోటితోటే అన్ని పాటలూ చెప్పించుకున్నాము. నలుగుల పాటలు, ద్వారబంధం దగ్గర పాటలు, మంగళ హారతులు, అలకపాన్పు దగ్గర పాటలు, అంపకపు పాటలు ఇన్నీ అన్నీనా? ఎక్కడా–ఒక్క వరస తప్పిపోకుండా– ఏ సమయంలో–ఏది పాడాలో–అది పాడి శబాషనిపించుకున్నాము. అక్కయ్య పెళ్లికి పెద్దపందిట్లో నాగవిల్లి బాజా వాయించారు. నాగవిల్లి బాజా స్వరం వింటేనే కళ్లు చెమరుస్తాయి. మేమూ పెళ్లికూతుర్ని అంపకాలు పెట్టేశాము. ఇహ నాకు దుఃఖమాగింది కాదు. ఏడుపు ఒకటే ఏడుపు! ఎంతమంది ఓదార్చినా ఏడుపు ఆగింది కాదు!’’ ‘‘బొమ్మని అంపకం పెట్టినా ఏడుస్తారా?’’ అన్నాది మునిమనవరాలు. ‘‘ఏడుపొచ్చీసింది దానంతకదే! నా కెవరూ చెప్పనయినా లేరు పెళ్లికూతురు బొమ్మ నాది. పెళ్లికొడుకు బొమ్మ మా వొదినది. అదీ నా ఈడుదే. వియ్యపురాలితనం ఇంతా అంతా చేసిందా. అలకల మాలక్ష్మి అంటే అదే వెయ్యి వియ్యాలరింపులు వియ్యారించుకొని ప్రాణాలు రాచి రంపాన పెట్టింది. అప్పగింతల వేళరాగానే– ‘‘వెళ్లిపోతాం బళ్లు కట్టించియ్యండి’ అని గంగవెర్రులెత్తించింది. నా కూతురు అత్తారింటి కెళ్లిపోతుందర్రా అని నేనొక్కటే ఏడుపు! ఆ బొమ్మల పెళ్లితో నా సరదాలన్నీ సరి. మరి నాలుగు నెలలైనా తిరక్కండానే పెళ్లి అయిపోయింది. అనుకోకుండా నాకు కళ్యాణధార కొట్టుకొచ్చింది.’’ అని జాలిగా చెప్పింది ముత్తవ్వ. తన కళ్యాణ విషయం సంతోషంగా చెప్పలేదు! ‘‘బొమ్మల పెళ్లి సరదాగా అయింది. తరువాత నీకు పెళ్లైంది’’ అన్నాడు మునిమనవడు. ‘‘పెళ్లే అయింది నాయనా! ఆడదాని బతకంత హీనం మరొహటి లేదు’’ అంది ముత్తవ్వ. ‘‘తవ్వా, నిన్ను ముసీలి మొగుడికిచ్చేరు కదూ?’’ అన్నాది మునిమనవరాలు. ‘‘మొగాడికి ముసిలేనిటి తల్లీ ఆడదాని కైదోనతం ఉండాలి కాని’’ అన్నాది ముత్తవ్వ. ‘‘మీ నాన్న అంత గొప్ప కరణంగారు కదా ముసిలాడి కెందుకిచ్చాడు?’’ అనడిగింది మునిమనవరాలు. ‘‘ఇవ్వక తప్పుతుందా? ఆయనెవరో అనుకున్నారా? మా పెద్ద మేనత్త పెద్ద కొడుకు. నడి వయస్సులో పెళ్లాం చచ్చిపోయియింది. ఉన్న మేనమామల కూతుళ్లలో పెద్దదాన్ని నేనే. వాణ్ణో ఇంటివాణ్ణి చెయ్యకపోతే ఎలాగ అని మా నాన్నే నడుం కట్టుకొని చేశాడు. ఆరోజులూ అభిమానాలువేరు’’ అన్నాది ముత్తవ్వ. ‘‘గొడవ గొడవ చేస్తున్నావు. ఓ మూల నుంచి తెల్లారిపోతున్నాది’’ అన్నాడు మునిమనవడు. వాడికి ముత్తవ్వ పెళ్లిగొడవ బోధ పడలేదు. ‘‘తెల్లారే పోయింది!...నాయన్నాయన ఒక్కసారి వీపు గోకి పెడుదూ. చివచివలాడిపోతున్నాది. దబ్బు దబ్బున చెప్పేస్తాను’’ అన్నాది ముత్తవ్వ. ‘‘గోకుతాను చెప్పీ’’ అని మనవడు వీపంతా బరుకూ బరుకూ బక్కిరీశాడు. ‘‘చచ్చేన్రోయ్ చచ్చేన్రోయ్! ఇహ చాలు. వీపంతా రాసి’’ అన్నాది ముత్తవ్వ. ‘‘పెళ్లి పూర్తయిందా? ఇహ చెప్పీ. జేగంట వేళైపోతున్నాది’’ అన్నాడు మనవడు. వాళ్ల నాన్న సుస్వరంతో కంఠం బాగా ఎత్తి దేవతార్చన చేస్తున్నాడు. మహా నైవేద్యానికి వంటకాలన్నీ వాళ్లమ్మ నట్టింట్లో తెచ్చిపెట్టేసింది. బుడబుక్కల వాడు ఏ వీధిలోనో బుడబుడ బుక్కంటున్నాడు. దేవాలయంలోంచి గంటలు జేగంటలు బయల్దేరాయి. ‘‘ఎవరైనా సాయం ఉంటే బావుణ్ణు. ఆచారిగారు దద్ధోజనం చక్రపొంగలి హాయిగా పెడతారు’’ అన్నాడు మునిమనవడు. ‘‘మనింట్లో పిండివంట లేకపోతే కదా?’’ అన్నాది మనవరాలు. ‘‘తవ్వా చెప్పీ చెప్పీ’’ అని తొందరపడ్డాడు మనవడు. ముత్తవ్వ కుంపట్లో నిప్పులన్నీ కూడదీసి మళ్ళా మొదలెట్టింది. ‘‘ఇహ నేముంది? అయేపోయింది. నాగవిల్లి బాగా వాయించీశాము. తెల్లవారుజామున పిల్లలందర్నీ దబదబా లేపేసి దబ్బూ దబ్బున చద్దన్నాలు పెట్టేశారు. మేము వొణ్ణాలు తింటూ ఉంటే వీధిలో భజంత్రీలు హోరెత్తుతూ వాయించారు బాకాలతో. మేము చూడకుండానే పెళ్లికూతుర్నీ పెళ్లికొడుకునీ సవారిలో ముందు పంపించేశారు. మేము వీధిలో కొచ్చేసరికి వీధి నిండా రెండెడ్ల గూడుబండ్లు పూసేసి సిద్ధంగా ఉన్నాయి. గర్భిణి స్త్రీలకీ ప్రత్యేకంగా మేనాలు పందిట్లో ఉన్నాయి. మమ్మల్నో రెండెడ్ల బండీలో కుక్కీశారు. మాకు జ్ఞాపకం లేకపోయింది. తొందర తొందర. ఏమైనా తోస్తేనా? ఇహ బళ్లు కదలడానికి సిద్ధంగా ఉన్నాయి. మా వొదినకి జ్ఞాపక మొచ్చింది. ఏవిటి సాధనమంటే ఏవిటి సాధనం అనుకొని ఏం బుద్ధి అంటే ఏం బుద్ధి అనుకొని గుంజాటన పడిపోయాము. బండి గూడు నుంచి ఈనె పీకి ముక్కులో పెట్టుకుని ‘‘హాచ్చీ’’ అని తుమ్మేను. ఇహ వరసగా తుమ్ము తరవాత తుమ్ము తుమ్ము తరవాత తుమ్ము! మా నాన్న పెద్ద చేపాటికర్ర పట్టుకుని చుట్ట కాలుస్తూ పందిట్లో నిలబడి అందరికీ పనులు పురమాయిస్తున్నాడు. ‘‘ఎవరర్రా వెధవల్లారా తుమ్ములూ?’’ అన్నాడు. ఒక పక్క నేనని తెలిస్తే చావబాత్తాడని భయం, ఇంకో పక్క తుమ్ములు నాన్న చెవిలో పడ్డాయని సంబరం! కుక్కిన పేనులాగా కిక్కురుమనకుండా కూర్చున్నాను. ముక్కులో దురద వొదలక మళ్లా తుమ్మొస్తూ ఉంటే ఓ బలవంతాన ఆపుకొని చచ్చాను. అంతా మొహమొహాలు చూసుకొన్నారు. విసవిసలాడారు. ‘నయమే పెళ్లికొడుకు పెళ్లికూతురూ వెళ్లిపోయారు’ అని సముదాయించుకొన్నారు. ‘తుస్సుతుస్సుమని వెధవ తుమ్ములు’ అన్నాడు మా నాన్న. గోల గోల అయిపోయింది. అందర్నీ దింపి అందరినీ కాళ్లు కడుక్కోమని కూచోపెట్టారు. ‘‘ప్రయాణానికి సిద్ధంగా ఉంటే బుద్ధీ జ్ఞానం లేకుండా ఎందుకు తుమ్మేవు? నీ బుర్ర చితగొట్టవలసింది’’ అన్నాడు మునిమనవడు. ‘‘విను విను చెపుతుంది’’ అన్నాది మునిమనవరాలు. మనవడు అన్నమాట ముత్తవ్వకి మహాకోపం వచ్చింది. ఆనాడు వాళ్లెవ్వరో అన్నట్టు ఈనాడు మనవడు బుద్ధీ జ్ఞానం లేదంటే ఉక్రోషం వొచ్చింది. పెద్దగొంతుకతో పళ్లు కొరుక్కుంటూ మనవడి మీద విరుచుకుపడ్డాది. ‘‘భడవా ఎందుకు తుమ్మేనా? నీ సొమ్మేం పోయింది. గండగత్తిర మాకొచ్చి పడ్డాది. ఇంత బొమ్మల పెళ్ళీ చేశామా? పెళ్లీ కూతుర్నీ పెళ్లికొడుకునీ గృహప్రవేశానికి తీసికెళ్లాలా? ఆ బొమ్మలు బొమ్మరింట్లో ఉండిపోయాయి. బండెక్కి మేము కూచున్నాం. దాంతో ప్రయాణం వో ఘడియ ఆగిపోయింది. దబ్బుదబ్బున బొమ్మరింట్లోకి పరిగేట్టేము. బొమ్మలు, సవారీ, మిగతా సరంజామా పెద్ద రంగురంగుల తాటేకుల బుట్టలో పెట్టి సిద్ధంగా ఉంచాము. అది పట్టుకు పందిట్లోకి పరిగెట్టేము’’ అని ముత్తవ్వ ఎందుకు తుమ్మిందో చెప్పింది. తమ్ముల మాటైపోగానే క్షీరాన్నంలో ఏలక పళ్ల వాసన ఘముఘమలాడుతూ వసారాలోకి వచ్చింది. వాళ్ల నాన్న దేవతార్చన మాత్రం ‘పాపాత్మా పాపసంభవా’లో పడి ‘రక్షో రక్షో మహేశ్వరా’ అనలేదు. (రచనా కాలం: 1955) -
మూగ గీతం
రాజ్యానికి వొంటిమీద స్పృహ తప్పిపోయింది. వెంకటప్పయ్య పెళ్లాం మొహంలోకి చూశాడు. పెదిమలు కదులుతున్నాయి. ‘‘వొసే రాజ్యం!’’ ఆదుర్దాగా పిలిచాడు. పలకలేదు. మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్నాది. వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. ‘‘వెధవల్లారా ఏమిటా అల్లరి!’’ వెంకటప్పయ్య కసిరాడు. ‘‘అబ్బ తుళ్లిపడ్డానండీ! పిడుగు పడ్డట్టు విరుచుకు పడుతున్నారేం?’’ రాజ్యం తెలివి తెచ్చుకొని అడిగింది. ‘‘కసిరితే కసిరాను. వంట్లో ఎలాగుందో చెప్పు?’’ ‘‘ఇప్పుడేమొచ్చిందని?’’ రాజ్యం నవ్వింది. నవ్వుమొహం చూడ్డానికి భయంకరంగా వుంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్లు, పొడుచుకు కనబడుతున్న ముందు పళ్లు. రాజ్యం టైఫాయిడ్ జ్వరంతో తీసుకొని కిందపెట్టవలసినంతా అయి బతికి బట్టకడుతున్నాది. పత్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది. జ్వరం మూడు వారాలుగా పొక్కిపోసిన తరువాత దిగజారలేదు. మళ్లా తిరగబెట్టింది. ఏ క్షణంలోనైనా ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి! ‘‘నా వంట్లో హాయిగా ఉంది. తింటున్నది అరుగుతున్నాది. అంత జబ్బు పడ్డాక నిలుచున్న పాళంలా మామ్మూలు మనిషిని కమ్మంటే అవుతానా?’’ అన్నాది రాజ్యం. ‘‘నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలార్చుకు పోయాయి’’ అన్నాడు. ‘‘ఈ యింటికి మారిన దగ్గరనుంచీ హాయిగా ఉంది. ఎటొచ్చి అద్దెకే బెంగగా ఉంది’’ అన్నాది రాజ్యం. అంతకుముందు వాళ్లు ఇరుకు సందులో ఉండేవారు. ఇప్పుడు కొత్తగా కట్టిన డాబాలో రెండు చిన్న గదులూ, వసారా అద్దెకు తీసుకొన్నారు. చుట్టూ విశాలంగా పెరళ్లున్నాయి. ‘‘వెధవ డబ్బు. ఏదో కూడిక చేసుకొంటాము. నువ్వు బతికావు చాలు’’ అన్నాడు. ‘‘నా జబ్బుకి ఎక్కణ్ణుంచి తెచ్చారో, ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు’’ అన్నాది. ‘‘ఆ వూసు నిన్నెత్తొద్దన్నానా? ఆరోగ్యం చూసుకో. కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్లన్నీ తినెయ్యి. పిల్లలకు కూడా పెట్టకు.’’ ‘‘తినకేం చేస్తున్నాను? కాళ్లు జాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా? మనకింకో విధం ఉంది కనకనా?’’ డబ్బు మాటెత్తగానే వాడికి గాభరా పుట్టింది. జీతం రెండు నెలలదీ కాక రెండువందలకి దాటి ఖర్చు అయిపోయింది. వాడికా సంభాషణ పెంచటం ఇష్టం లేదు. పెరట్లో కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కొని వచ్చాడు. రాజ్యం మళ్లా ఈ ప్రపంచంలో లేదు. మొహం మీదపడి బంగారపు పూత పూస్తున్నాది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు. కాపరానికొచ్చిన తొలి సంవత్సరం కిలకిల నవ్వుతూ ఉండేది. సంవత్సరం తిరక్కుండా గుండెలికి చంటికుర్రాణ్ణి వప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకుంటూవెళుతూ, అవతలదరికి చేరమంది జీవితం! కాపరానికొచ్చి ఆరేళ్లయింది. ముగ్గురు కొడుకుల తల్లి అయి ఈదుతున్నాది. అకస్మాత్తుగా రాజ్యం తల ఓ పక్కకు పెట్టి ఆడిస్తున్నాది. వెంకటప్పయ్య పకాలున నవ్వాడు. ‘‘ఎందుకూ అంత విరగబాటు నవ్వు?’’ మొగుణ్ణడిగింది. ‘‘ఏదీ, మళ్లా మెడవండి ఆడించు’’ ‘‘అదా! ఎదురింటి పిల్ల పాడుతున్నాది, వినండి’’ అన్నాది. రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది. ‘‘ఓహో! అదియా సంగతి! చిన్నప్పుడు నువ్వు వాయులీన విద్వాంసురాలివి కదూ!’’ అన్నాడు. ‘‘చీకటిపడుతూ ఉంటే ఇప్పుడెందుకూ వీధిలోకి? పెందరాళే అన్నం తినకూడదూ?’’ అన్నాది. ‘‘అనుకొంటూ ఉండగా ఆలస్యమైపోతున్నాది. ఇలాగ్గా ఇహనెళ్లి పాపపరిహారార్థం మంచిపని చెయ్యాలి’’ అన్నాడు. ‘‘పాపాలు కూడా చేస్తున్నారా?’’ ‘‘పాపం చెయ్యందీ బతుకు వెళ్లలేదు.’’ వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు. పిల్లలిద్దరూ సంగీతం వింటున్నారు. రాజ్యం మెల్లిగా లేచి స్విచ్చి నొక్కింది. గదినిండా కాంతి పడ్డాది. రాజ్యం ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూవుంటే ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తున్నాది. ఆరేళ్ల క్రితం రాజ్యాన్ని చూడడానికి పెళ్లివారు వచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ల నాన్న నాలుగేళ్లయి సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చింది. తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది. గొంతుకెత్తేసరికి అపశృతి. ఉసిలోకి రావాలసిన తాళం వేలుమీదకొచ్చింది. వొళ్లంతా జలదరించి పాటంతా గాభరా అయింది. రాజ్యానికి ఏడుపు పర్యంతం అయింది. కాని పెళ్లిపెద్దలు సెహబాస్ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవనీ, వాళ్ల జీవితాలలో సంగీతం లేనేలేదనీ అమాయకపు పెళ్లికూతుళ్లకి ఏమి తెలుసు! వెంకటప్పయ్య పెళ్లినాటికి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్ర ప్రభుత్వపు డెబ్బయి రెండు రూపాయల ఎల్.డి. గుమస్తాలలో ఒకడు. పెళ్లయిన కొత్తలో రాజ్యం మాబాగా పాడుతుందని ఊళ్లోవాళ్లు పేరంటానికి వెళితే పాడించేవారు. అత్తవారింట్లో నోరెత్తి పాడుకొనే సమయం రాకుండానే వేవిళ్లతో పుట్టింటి కెళ్లింది. వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. ‘‘తమ్ముడు నిద్రపోతున్నాడా??’’ అనడిగింది. ‘‘గుర్రు పెడుతున్నాడు’’ అన్నాడు పెద్దవాడు. ‘‘అల్లరి చేస్తే లేచిపోడూ. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నాది. కూచుని వినండి’’ అన్నాది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే. పానకంలో పుడకలాగ ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. ‘‘గిమపదని ఓజగ...’’ గొంతుక చించుకొని అపశృతిలో స్వరాలు వేశాడు. ఆ అమ్మాయి తంబూరా, పాటా ఆపేసింది. ‘‘వెధవా! సంగీతం నేర్చుకోమంటే రావుకానీ అల్లరికి సిద్ధం’’ అన్నాది. ‘‘ఇంక పాడదేంటమ్మా?’’ పెద్దకొడుకు అడిగాడు. ‘‘అదిగో మీలాంటి అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళీ చేస్తే కోపం వచ్చి పాట మానేసింది.’’ ‘‘నువ్వు పాడతావూ?’’ ‘‘ఓ పాడతాను. నీకు చెప్పమన్నావా?’’ ‘‘ఛీ! మొగాళ్లు పాడరు.’’ ‘‘మొగాళ్లూ పాడతారమ్మా’’ అని రాజ్యం కాళ్లు జాపి గదిలో అడ్డంగా పడుకుంది. ‘‘ఒరే పెద్దాడూ! కాళ్లు పట్టుబాబూ’’ అంది. పెద్దవాడు మెల్లిగా కాళ్లు గుద్దుతూ కూచున్నాడు. ‘‘నేను చేతులు గుద్దుతానమ్మా!’’ అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూచున్నాడు. రాజ్యం కళ్యాణి కృతి అనుకొంటూ పడుకుంది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కుపడ్డ కురుల్లాగ అవకతవక అయిపోయాయి. ‘‘నువ్వా పిల్లలాగ పాడ్డం లేదు’’ అన్నాడు పెద్దవాడు. ‘‘అంతా మరిచిపోయానురా!’’ పెరటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడు. ‘‘కుక్క కాబోలు కొట్టండి. గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు!’’ అన్నాది రాజ్యం. కొడుకులు పరిగెట్టారు. ‘‘కుక్క కాదమ్మా పిల్లి. అన్నంగిన్నె మీదా సిబ్బి తిరగదోసింది’’ అన్నాడు పెద్దవాడు. ‘‘నయమే. మళ్లా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడూ తినవలసిన రోజులు. గడియ పెట్టి రావొద్దూ?’’ అన్నాది రాజ్యం. వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు. ‘‘పెరట్లో వెన్నెలా, పువ్వువెలగ వాసన మహబాగున్నాయి’’ అన్నాడు. ‘‘అప్పడే వచ్చేశారేం? పాపపరిహారం అయిందా?’’ ‘‘కొంచెం అయింది.’’ వెంకటప్పయ్య కండువాలో దాచి చంకక్రింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపరు చుట్టి ఉంది. ‘‘ఏమిటిది?’’ అన్నాది రాజ్యం. లోపల నాలుగువేళ్ల వెడల్పు చుట్టు జరీ అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికల గుడ్డా ఉంది. ‘‘కొన్నారా?’’ ‘‘కొన్నాను. ఉన్నడబ్బు కాస్తా అయిపోకుండా కొనేశాను.’’ ‘‘డబ్బెక్కడిది?’’ ‘‘చెపితే నువ్వు నన్ను క్షమించవు.’’ ‘‘ఏం చేశారండీ?’’ ‘‘ఏమీ అననని చేతిలో చెయ్యివెయ్యి’’ అన్నాడు. ముందుకు చెయ్యి జాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నాది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది. ‘‘అలాగ వొణికిపోతున్నారేం? దొంగతనం చెయ్యలేదు కదా?’’ ‘‘అంతకన్నా హీనమైనదే. నీకు టైఫాయిడు మళ్లా తిరగబెట్టింది కదూ! నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికివచ్చి చూసీచూడ్డంతో సలహా ఇచ్చాడు. తెగించి వాడికిచ్చేశాను.’’ ‘‘ఏమిటిచ్చేశారు?’’ ‘‘నీ కింకా తెలియలేదు. వాడే పట్టుకెళ్లి రెండువందల ఏభైకి అమ్మేశాడు. అంతడబ్బు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట!’’ రాజ్యానికి అర్థమైంది. గది నాలుగుపక్కలా కలియజూసింది. ‘‘ఇహ నువ్వు చూడనక్కర్లేదు.’’ ‘‘వెళ్లిపోయిందా?’’ అని దీర్ఘంగా నిట్టూర్చింది. ‘‘నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!’’ అని నేరస్తుడిలాగ మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది. ‘‘ఏ తప్పూ చెయ్యలేదు. ఏ సంసారైనా అదే చేస్తాడు. మీరేం తినేశారా?’’ ‘‘మనకంతా మొగపిల్లలే కదా అని ధైర్యం చేశాను.’’ ‘‘పోనియ్యండి, నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సర్వతీ కటాక్షం నా కంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. నాకో చీరా రవికలగుడ్డా పెట్టింది’’ అని గుడ్లనిండా నీళ్లు నింపుకొంది. ‘‘నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను’’ అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య. ‘‘జ్ఞాపకంగా ఉంటుంది లెండి!’’ అన్నాది రాజ్యం. చాసోగా సుప్రసిద్ధులైన కథకులు, కవి చాగంటి సోమయాజులు (1915–1994) ‘వాయులీనం’ కథకు ఇది సంక్షిప్త రూపం. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్. -
చరిత్ర కెక్కిన చరితార్ధుడు ‘చాసో’
నేడు 102వ జయంతి విజయనగరం టౌన్ : తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన చాగంటి సోమయాజులు 1915 జనవరి 17న నాగావళి తీరాన శ్రీకాకుళంలో కానుకొలను తులసమ్మ, లక్ష్మీనారాయణలకు జన్మించారు. అప్పుడు ఆయన పేరు నరహరిరావు. పెంపుడు తల్లిదండ్రులు చాగంటి తులసమ్మ బాపిరాజు విజయనగరం తీసుకొచ్చాక చాగంటి సోమయాజులుగా పేరు మారింది. చాసో ఆత్మీయ మిత్రులు రోణంకి, శ్రీశ్రీ , నారాయణబాబు, ఆరుద్ర. తోరుదత్, సరోజీనినాయుడుల రచనల ప్రభావంతో చాసో తొలినాట సాహితీ జీవితం ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధం, రష్యా విప్లవం, టాల్‌స్టాయ్, గోర్కీ రచనలు, మార్కిస్టు రాజకీయ సిద్ధాంతం చాసోను విశేషంగా ప్రభావితున్ని చేశాయి. ప్రపంచ యుద్ధ బీభత్సం రోజుల్లో ఆయన తొలికవిత ‘ధర్మ క్షేత్రం’ శీర్షికతో 1941లో అచ్చయింది. ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణబాబు గీతాలు హృదిర జ్యోతి, చాసో కథలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆణిముత్యాల్లాంటి 46 కథలు చాసో రాసిన కథలు 46 అయినప్పటికీ తెలుగు కథాసాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించారు. చాసోకు ఆత్మీయమైన రచన ‘చిన్నాజీ’ సమాజంలో అట్టడగు వర్గాలు, దిగువ, మధ్య తరగతి సహా ఉన్నత వర్గాల జీవితాల్లోని దోపీడీ వ్యవస్థ కనిపిస్తుంది. కష్టాలు, కార్మికుల బతుకులు, అవిద్య, అమాయకత్వం, సౌందర్య పిపాస, మతం తదితర అంశాలన్నీ చాసో కథా వస్తువులుగానే వాడేవారు. తాను నడయాడిన ప్రాంతాల్లోని మనుషులను చదివారు. భాషల్ని, యాసల్ని పట్టుకుని తానెరిగిన జీవితాల నుంచే కథలు సృజించారు. పరబ్రహ్మం, మాతృధర్మం, బొండుమల్లెలు, కుక్కుటేశ్వరం, బొచ్చు తువ్వాలు తదితర కథలు ఆలోచింపజేస్తాయి. గురజాడది విమర్శనాత్మకమైన, వాస్తవికతతో కూడిన సామాజిక చైతన్య పురోగమనమైతే.. చాసో కాలం నాటికి మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల నేపథ్యంలో మారŠ?క్సజ దృక్ఫథం ఆయన కథల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏలూరెళ్లాలి, వేలం, వెంకడు, ఎందుకు పారేస్తాను నాన్నా’ తదితర కథల్లో చిన్న చిన్న వాక్యాలతోనే బరువైన భావాలను పలికించిన చాసో 1994 జనవరి 2న తనువు చాలించారు. చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారాలు 1995 నుంచి చా.సో. స్ఫూర్తి పురస్కారాలను అందిస్తున్నారు. తొలిసారిగా 1995లో ఆయన సమకాలికుడు మహీధర రామ్మోహనరావుకు పురస్కారాన్ని అందించారు. 1996లో ఆరుద్ర, 1997లో పి.సత్యవతి, 1998లో గంటేడ గౌరునాయుడు, 1999లో బోయ జంగయ్య, 2000లో కేఎన్‌వై పతంజలి, 2001లో చిలుకూరి దేవపుత్ర, 2002లో ముదిగంటి సుజాతారెడ్డి, 2003లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, 2004లో కె.వరలక్ష్మి, 2005లో వి.ప్రతిమ, 2006లో మహమ్మద్ ఖదీర్‌బాబు, 2007లో జాజుల గౌరి, 2008లో సయ్యద్ సలీమ్, 2009లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 2010లో కుప్పిలి పద్మ, 2011లో శశిశ్రీ, 2012లో ఎఎన్ జగన్నాథశర్మ, 2013లో పెద్దింటి అశోక్ కుమార్, 2015లో చింతకింది శ్రీనివాసరావు, 2016లో కేవీ రమణరావులు అందుకున్నారు. చాసో సాహితీ వేదిక ప్రారంభం నేడు చా.సో 102వ జయంతి సందర్భంగా గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం మేడపై చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం చాసో సాహితీ వేదిక ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకూ కార్యక్రమాలు జరుగుతాయి. చాసో చిత్రపటానికి పూలమాలాలంకరణ, చాగంటి కృష్ణకుమారి స్వాగతోపన్యాసం, బీఏ నారాయణ గురజాడ దేశభక్తి గేయాలాపన ఉంటాయి. అనంతరం ప్రారంభోపన్యాసం కె.శ్రీనివాస్ చేస్తారు. చాసో రచనలపై రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి హాజరయ్యే సాహితీవేత్తలు, అతిథులు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ నిర్వహించే కార్యక్రమాల్లో పుస్తకావిష్కరణలు, సాయంత్రం ప్రముఖులతో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కార ప్రదానం ఉంటాయి. -
ఎవరికి పట్టింది చాసో శత జయంతి?
తెలుగు కథా శిల్పులలో గురజాడ వారసుడిగా నిలిచి, వజ్రాల వంటి ఐదు కథలు రాసి, అభ్యుదయ రచయితల సంఘంలో కీలకపాత్ర వహించి, తెలుగు కథకు తూర్పు దిక్కు సూర్యుళ్లలో ఒకడుగా నిలిచి చాగంటి సోమయాజులు (చాసో) శత జయంతి ముగింపు వచ్చినా (17, జవనరి) తెలుగు సమాజం ఆయనను గౌరవించుకోవలసిన రీతిలో గౌరవించిందా అనే సందేహం వస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి వస్తున్నది. తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐకి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. ‘హైదరాబాద్ కేంద్రకం’గా జరుగుతున్న కార్యకలాపాల వల్ల రాష్ట్ర ఇతర ప్రాంతాల సాంస్కృతిక, సాహిత్య ప్రాధాన్యతలు తగ్గిపోతున్నాయి. తెలుగు సాంస్కృతిక నిర్మాతల విషయంలో కూడా ‘మీరూ’, ‘మేమూ’ అనే దృష్టి రావడం హానికారకంగా ఉంది. తరచి చూస్తే శ్రీశ్రీ, గురజాడలకు పట్టిన గతే చాసో విషయంలో కూడా పునరావృతమవుతున్నది. చాసో పుట్టిన రోజు అయిన జనవరి 17న వీరు ఎక్కడైనా చాసోకు ఒక పూల మాల అయినా వేస్తారా అంటే సందేహమే. దిన పత్రికల పేర్లు మార్చుకోవడం, తమ ప్రచురణ సంస్థ పేరు మార్చుకుని చీల్చుకోవడంలో గల ఉత్సాహం సాంస్కృతిక సందర్భాల పట్ల కూడా ఉండాలని ఈ చీలిన రాష్ట్రపు సి.పి.ఐ వారు తెలుసుకుంటారా తెలుసుకుంటే చాసో శతజయంతి ఇలా ఇంత నీరసంగా ఉండేదా? వీరి ప్రచురణ సంస్థ విశాలాంధ్ర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేరు మార్చుకుంది. అయినా పాత పేరు ఎక్కడికీ పోదు. మరి ఈ విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు. చాసో రచనలపై విశ్లేషణో, సమగ్ర రచనల ముద్రణో ఏమీ చేపట్టలేదు. కాపీరైటు విషయాలు వివాదాస్పదమైతే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. దినపత్రిక కలిగి ఉండి కూడా చాసో సాహిత్యం పట్ల పోటీలు పెట్టడం, కథల నాటకీకరణకు ప్రోత్సహించడం వంటి పనులు చేయలేదు. అవన్నీ ఎలా ఉన్నా సావనీర్ తేవచ్చు. కనీసం ఆ పనీ చేయలేదు. మరి ఈ తరం తెలుగు పిల్లలకు రోల్మాడల్స్ను ఎక్కడి నుంచి వీరు తయారు చేస్తారు? ఇక వీరి అనుబంధ సాహిత్య సంస్థ అయిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ దగ్గరికొస్తే వీరిలో విభజన వాదులు ‘తెలంగాణ అరసం’గా మారిపోగా ఇటు మిగిలినవారు కూడా చాసో విషయంలో అంతే ఉదాసీనతను చూపించారు. వీరిలో పెనుగొండ లక్ష్మీనారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, చాగంటి తులసి, చందు సుబ్బారావు, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి వంటి రాష్ట్ర అరసం ముఖ్యులెందరో ఉన్నారు. ఇటీవల గుంటూరు నుంచి వెలువడిన అరసం ప్రచురణలలో పదిమంది రచయితలలో ఒకడిగా చాసో కథల సంపుటి కూడా వచ్చిందనేది చిన్న సాంత్వన సమాచారం. ఇంతకు మించి అరసానికి తన వ్యవస్థాపక అధ్యక్షుడి గురించి ఎటువంటి ప్రణాళికా లేకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో ఈ శత జయంతి కాలాన్ని 2016 జనవరి దాకా రెండేళ్ల పాటు జరుపుకోవడం సరైన పద్ధతి. తద్వారా కింది లక్ష్యాలు సాధించవచ్చు. చాసో పేరిట తపాలా బిళ్ల విడుదల చాసో శిలావిగ్రహం ఏర్పాటు చాసో కథలను అంతర్జాతీయ భాషలలోకి అనువాదం, నాటకాలు, లఘు చిత్రాలుగా రూపకల్పన. చాసో నవ్యమైన దృష్టి నాణ్యమైన కథలను ప్రసాదిస్తుందని నమ్మాడు. పెన్సిల్ కంటే రబ్బర్ ఎక్కువ వాడాడు. నచ్చనివి చింపి పారేశాడు. నచ్చినవాటితో ప్రజలకు చేరువ అయ్యాడు. 2014లో చేయలేని పనులన్నీ 2015లో చేసి చూపిద్దాము. అందుకు కలిసి వచ్చే వారు ఎవరైనా వారికి తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం శాశ్వతం. - రామతీర్థ 9849200385 (చాసో శతజయంతి సందర్భంగా జనవరి 17న విజయనగరంలో చింతకింది శ్రీనివాసరావుకు చాసో స్ఫూర్తి ప్రదాన కార్యక్రమం. జనవరి 18న విశాఖలో మొజాయిక్ సంస్థ ఆధ్వర్యంలో ‘తెలుగు సాహిత్యం- అంతర్జాతీయీకరణ’ పేరిట తెలుగు కథల ఆంగ్లానువాదాల సిరీస్ వెలువరింత) తన తొలినాళ్ల సాంస్కృతిక సేనానిగా నిలిచిన చాసో గురించి సి.పి.ఐ.కి పెద్దగా ఏమీ పట్టినట్టు లేదు. విశాలాంధ్రవారు ఈ చాసో శతజయంతి సంవత్సరంలో చాసోకు సంబంధించి ఒక్క ప్రచురణ తీసుకురాలేదు.