బొమ్మల పెళ్లి | Special Story By Chaganti Somayajulu On 29/12/2019 In Funday | Sakshi
Sakshi News home page

బొమ్మల పెళ్లి

Published Sun, Dec 29 2019 4:19 AM | Last Updated on Sun, Dec 29 2019 4:19 AM

Special Story By Chaganti Somayajulu On 29/12/2019 In Funday - Sakshi

‘‘తుమ్ములా తుమ్మలా? రెండూ ఉన్నాయి. మీరేది చెప్పమంటే అది చెపతాను’’ అన్నాది ముత్తవ్వ.
‘‘తుమ్ముల మాటే’’ అన్నాది మునిమనవరాలు. 
తుమ్ములమాట తొంభైసార్లు మునిమనవరాలు వింది. విన్నదే వినడం దానికి సరదా. చెప్పిందే చెప్పడం ముత్తవ్వకి సరదా.
‘‘తుమ్ముల తగాయిదా గొడవ గొడవగా ఉంటుంది. మా ఊళ్లో  మా చిన్నతనంలో తుమ్మ అడవి కోసం రామరావణ యుద్ధం అయిపోయింది. దాంట్లో వ్యవహారపు పేచీలు ఇన్నీ అన్నీ కావు. ఇద్దరు చచ్చిపోయారు. పాతిక ముప్పై మందికి గాయాలు తగిలి రక్తమండలాలై పోయాయి. అదుగో, ఆ దొమ్మీ అయిపోయినాకే మా నాన్న కట్టుకాసుల పేరు మా అమ్మకు చేయించాడు. అందులోకి ఆ రామునాయుడున్నాడే వాడు రావణాసురుడే. వాడికి పుట్టిన పోయి కాలం బుద్ధి ఇంతా అంతా కాదు’’ అంటూ ముత్తవ్వ తుమ్మడొంకల్లోకి పోయింది.
‘‘తుమ్మలు కాదు తుమ్ములు’’ అన్నాడు మునిమనవడు.
‘‘అలాగేదో చెప్పండి మరి’’ అన్నాది ముత్తవ్వ.
‘‘బాగా చెప్పు. బాగా చెప్పితే పొద్దున్నే నీకు దోరజామికాయలు బోలిడు కోసి పెడతాను’’ అన్నాడు మనవడు.
ముత్తవ్వ వొళ్లు వొడిలిపోయినా, దృష్టి మాంద్యం వొచ్చీసినా పళ్ళు మాత్రం ఊడలేదు. దోరజామికాయలు ఉడతలాగ ఎన్నిచ్చినా అంత చక్కగాను కొరుక్కు తింటుంది.
‘‘రుధిరోద్గారినామ సంవత్సరానికి అరవై ఏళ్లు. ఇది ఈశ్వరనామ సంవత్సరం. రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన’’ అని ముత్తవ్వ వేళ్లు లెక్క పెట్టింది.
‘‘ధాత, ఈశ్వర ఇవి పదిహేనేళ్లు. డెబ్భై ఐదేళ్లు అప్పుడే అయిపోయింది. అంతా నిన్న మొన్నలాగుంది! అప్పుడు నేనింకా ఏడేళ్ళదాన్ని. గోచీ పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని’’ 
‘‘ఛీఛీ తవ్వా! గోచీ పెట్టుకొని తిరిగేదానివా?’’ అని పరమసహ్యంతో మునిమనవడు అడిగేడు.
ముత్తమ్మ వాళ్లమ్మమ్మకి అమ్మ. ముని మనవలంతా తవ్వా తవ్వా అని పిలిచేవాళ్లు.
‘‘తవ్వని కాకపోతే సోల నౌతానర్రా?’’ అని ముత్తవ్వ పొంగిపోతూ అలాగ పిలిస్తేనే సంబరపడిపోయేది.
‘‘ఛీఛీ ఏం? అంచక్కా గోచీలు పెట్టుకునే వాళ్ళం. ఎంత పెద్దింటి పిల్లలైనా గోచీలే! చిన్నపిల్లలకి వొండినిండా బట్టలేమిటి నా నెత్తి! పసుపులు రాసుకొని దబ్బపండులాగా మిసమిసలాడుతూ వొళ్లంతా కనబడితేనే ఆ ఈడు పిల్లలకి అందం. ఓ పెళ్ళిళ్లకీ, పేరంటాలకీ, కార్యాలకీ, కథలకీ వెళ్ళినప్పుడు లంగాలు కబ్బాలు తొడుక్కునేవాళ్ళం. ఇప్పుడంతా తెనుగు మీరిపోయారు’’
‘‘గోచీల గొడవలో పడకు’’ అన్నాడు మునిమనవడు.
‘‘తవ్వ అలాగే చెబుతుంది. చెప్పు చెప్పు తవ్వా’’ అన్నాది మునిమనవరాలు.
కణకణలాడుతున్న నిప్పులతో పెద్ద మట్టికుంపటిని మధ్య పెట్టుకుని తవ్వా మనవలు తెల్లవారుజామున వెచ్చగా కూచున్నారు. తవ్వ తాపీగా ప్రారంభించింది.
‘‘ఊళ్లోకి ఎరకలాళ్లు కర్ణపిశాచి ఉన్నట్లు నల్లపూసలూ పట్టుదారాలు తీసుకొచ్చారు. వొడ్లు వెల పెట్టి పుచ్చుకున్నాం’’
‘‘వొడ్లంటే?’’ మునిమనవడు అడిగేడు.
‘‘వొడ్లంటే తెలీయదురా నాగమ్మా! ఇప్పుడు పట్నాల్లో పిల్లలకి ఏమీ తెలియవు వొడ్లంటే ధాన్యం. వెల పెడితేనే ఏ వొస్తువేనా కొనుక్కోవడం. ఎర్రని రాగి డబ్బు కంట పడేది కాదు. గరిసెలకొద్దీ, పుట్లకొద్దీ ఇంటినిండా దినుసులుండేది. ఎన్ని పుట్లు కొలిచి పోసినా కోవటి పదిరూపాయిలు చేతిలో పెట్టేవాడు కాదు. సంవత్సరానికీ ఐదు రూపాయిలు–ఐదంటే ఐదు రూపాయిలు–పన్ను కట్టుకోలేక మా మేనమామ ఏభై ఎకరాల భూమి వొదులుకున్నాడు’’
‘‘తవ్వా తవ్వా తుమ్ములమాట మరిచిపోతున్నావు’’ అన్నాడు మునిమనవడు.
‘‘తవ్వ అలాగే చెపుతుంది. చెప్పు చెప్పు తవ్వా’’ అంది మునిమనవరాలు.
‘‘నీకేం పోయింది. జేగంట వేళైపోతుంది’’ అన్నాడు మనవడు.
వాళ్ల నాన్నగారు నట్టింట్లో ధావళి కట్టుకుని, ధావళి కప్పుకుని, దేవుడు పట్టుకెదురుగ్గా కూర్చొని ‘కలియుగే ప్రథమపాదే’ అని ఏనాడో దేవతార్చన సంకల్పించాడు. వాళ్లమ్మా బామ్మా రెండు పేడా పొయ్యలు బండెడు కర్రలతో ముట్టడించి వంట వండేస్తున్నారు. తెల్లవారుజామున రోజో పిండివంటతో వంట వండుకుని దేవతా నైవేద్యాలు పెట్టి సూర్యోదయానికి పూర్వమే ధనుర్మాసమంతా భోజనాలు చేసేవారు. వాళ్ల నాన్న జేగంట కొట్టారా అంటే పూజ పూరై్త భోజనం దగ్గిరపడ్డాదన్నమాటే.
ముత్తవ్వ మళ్లీ మొదలుపెట్టింది.
‘‘ఇత్తడిరేకు ఇచ్చి కంసాలిని పుస్తెలు చెయ్యమన్నాము. అలాగేనమ్మా అని కంసాలి నిలుచున్న పాళంగా మధ్యని ఎర్రపాళ్లు వేసి పుస్తెలు చేసి పెట్టేడు’’
‘‘కంసాలికీ వొడ్లు ఇచ్చారా?’’ అన్నాడు మునిమనవడు.
ముత్తవ్వ మొహం మీది ముడతలన్నీ గర్వంతో నిండిపోయాయి.
తొంభైఏళ్ల తొక్కు పులికొదమలాగ మొహం పెట్టుకుని చెప్పింది.
‘‘వొడ్లు ఇవ్వడం ఖర్మమేం? ఊళ్లో కంసాలి ఊరికే చేసి పెట్టేడు. మా నాన్న మరెవ్వరూ కాదు కరణంగారు. గడగడలాడి పోయేవారు అధికార్లంతా. మా ఇంట్లోనే బస. అంతా వెట్టిచాకిరీకి చెయ్యవలసిందే. ఏది కావలసి వచ్చినా కాకి చేత కబురు పంపితే చాలు బెల్లపుదిమ్మలు, నేతికుండలు సర్వం–దిసుసులన్నీ వొచ్చి పడిపోయేవి. శుభకార్యమంటే ఇహ చెప్పతరం కాదు. మా నాన్న ఏలుబడి మా గొప్ప ఏలుబడి. జిల్లాకే పేరు మోసిపోయేడు. ఏ నాడున్నాడో ఏ లోకంలో ఉన్నాడో! ఎక్కడికేను వెళ్ళేడంటే రెండెడ్ల సవారీ. బండి ఘల్లుఘల్లుమని మువ్వలు మోగుతూ ఠీవీగా వెళ్ళేది. ముందు దివిటీలు పట్టుకుని ఇద్దరు చాకళ్లు పరిగెట్టేవారు. వెయ్యిమంది వెంటవెళ్లేవారు. ఇదిగో మా అన్నదమ్ములు చేజేతులా మిరాసీ వొదులుకుని ఉద్యోగాల్లో ప్రవేశించారు. బూరెల్లోనూ బొబ్బట్లలోనూ గిన్నెడేసి నెయ్యి దిమ్మరించేకునేవాళ్లం. ఇప్పుడు పప్పు వొణ్ణంలోకి మిల్లి గరిటెడు నెయ్యికి మొహం వాచిపోతున్నాము’’
‘‘తవ్వా తవ్వా నేతుల గొడవలో పడిపోయావు’’ అన్నాడు మునిమనవడు.
‘‘చెప్పు చెప్పు తవ్వా’’ అన్నాది ముని మనవరాలు.
‘‘ఏం చెయ్యమన్నావురా, మా తండ్రుల నాడు నేతులు తాగేము. జ్ఞాపకమొస్తే వొళ్లు ఝల్లుమంటుంది. మా తాతతండ్రుల ఇల్లు తాటేకుల మిద్దె ఇల్లే.  వాస తరవాత వాస, వాస తరవాత వాస. నాలుగు వాసల ఇల్లు. ముఫ్ఫైరెండు గదులుండేవి. మా తండ్రుల నాటిదాకా సమిష్టిగా ఏకకుటుంబమే. నిత్యం పెళ్లివారిల్లులాగుండేది. వొణ్ణం ఎప్పుడూ బిందెలతో వార్చడమే. ఆ వంటలు వార్పులూ ఇప్పుడు లేనేలేవు. ఆడవాళ్లలో ఆ జవసత్తువలూ లేవు. ఆ మనుషులూ ఆ అభిమానాలు అన్నీ వెళ్లిపోయాయి ఆ ఇంట్లో.
మా ఆడపిల్లలకి వేరే బొమ్మరిల్లు ఉండేది. ఆడపిల్లలు బొమ్మల పెళ్లిళ్లు చేసుకుంటారని పెద్దవాళ్లే బొమ్మరిల్లు కట్టించారు. లక్కస్తంభాలతో పెద్ద పందిరీ. మా తాతల అప్ప చెల్లెళ్లు, మా మేనత్తలు వాళ్ల నాడు వాళ్లు ఎన్ని పెళ్లిళ్లో ఆ పందిట్లో చేసుకున్నారు. మానాడు మేమూ చేసుకున్నాము. బొమ్మల పెళ్లి బొమ్మల పెళ్లిలాగ చేసేవాళ్లమా? నిజం పెళ్లిలాగు యధావిధిగా అన్ని తంతులు జరిపి ఐదురోజులూ పెను ప్రళయంగా చేసేవాళ్ళము.
రుధిరోద్గారినామ సంవత్సర వైశాఖ బహుళ విదియ ఆదివారం మా అక్కయ్య వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్లిలోనే నా ఆడబొమ్మకీ మా వొదిన మొగబొమ్మకీ పెళ్లిచేయడానికి నిశ్చయ తాంబులాలు మా వొదినా నేనూ ఇచ్చుకున్నాము. పందిట్లో మా అక్కయ్య పెళ్లి అయిన మరి నాలుగు ఘడియలకి మేము మంచి ముహుర్తం చేశాము. మా బొమ్మల పెళ్లికి ఒక టకోరామేళం వీరణాలతో సహా మా నాన్న ప్రత్యేకం ఏర్పాటు చేయించాడు.
పిల్లలు సరదా పడుతున్నారంటే మా నాన్న కొండ మీది కోతిని తెప్పించి అక్కడ పెట్టేవాడు. పెళ్లికి కావలసిన సమస్త వస్తుజాలం బొమ్మరింట్లో ఉండేది. ఊరేగించడానికి మా ముసలమ్మలనాటి లక్కపల్లకీ మాదాకా ఉంది.
గంగడు లేత తాటిమట్ట కొట్టి తెచ్చి పెట్టేడు. పచ్చగా బంగారంలాగ మెరుస్తున్న వెడల్పాటి తాటిరేకులతో బొమ్మల్నీ చేశాము’’
‘‘అబ్బా! ఇంత పెళ్ళీ తాటేకు బొమ్మలకా?’’ అని ఏవగించుకొన్నాడు మునిమనవడు.
‘‘తాటేకులైతేనేం? దర్జీ దగ్గరకి వెళ్లి పట్టుపరికిణీ కబ్బా పెళ్లి కూతురికీ, చెమ్కీ ముఖమల్లుకోటు పెళ్లికొడుక్కీ కుట్టించి తొడిగేము. ఐతే అవి ఎదురు సన్నాహానికీ ముత్యాల పల్లకిలో ఊరేగించడానికి మాత్రమే...మధుపర్కాలు కట్టిన దగ్గర నుంచీ–దీక్షా వస్త్రాలు కదూ–వాటితోటే ఊరేగించేవారము. పసుపు నలుగులు పెట్టి మంగళ స్నానాలు చేయించిన దగ్గర నుంచి తాటేకు బొమ్మలైనా కళకళలాడుతూ ఎంత బాగుండేవి!
పెద్దపెద్ద వాళ్లంతా ఎంతో మెచ్చుకున్నారు. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా చేశారంటే ఎంత బాగా పెళ్లి చేశారని అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. లగ్గం మొదలు నాగవిల్లీ దాకా ఏ వొక్కటీ వొదిలి పెట్టలేదు. ఎప్పుడేది చేస్తారో మాకు తెలియకపోతే కదూ?
పాటలతో పెళ్లిపందిరి ఎగరగొట్టేశాము. ఎన్నెన్ని పాటలు! బొమ్మపెళ్లికని– చదువులు రావు కదా! నోటితోటే అన్ని పాటలూ చెప్పించుకున్నాము. నలుగుల పాటలు, ద్వారబంధం దగ్గర పాటలు, మంగళ హారతులు, అలకపాన్పు దగ్గర పాటలు, అంపకపు పాటలు ఇన్నీ అన్నీనా? ఎక్కడా–ఒక్క వరస తప్పిపోకుండా– ఏ సమయంలో–ఏది పాడాలో–అది పాడి శబాషనిపించుకున్నాము.
అక్కయ్య పెళ్లికి పెద్దపందిట్లో నాగవిల్లి బాజా వాయించారు. నాగవిల్లి బాజా స్వరం వింటేనే కళ్లు చెమరుస్తాయి. మేమూ పెళ్లికూతుర్ని అంపకాలు పెట్టేశాము. ఇహ నాకు దుఃఖమాగింది కాదు. ఏడుపు ఒకటే ఏడుపు! ఎంతమంది ఓదార్చినా ఏడుపు ఆగింది కాదు!’’
‘‘బొమ్మని అంపకం పెట్టినా ఏడుస్తారా?’’ అన్నాది మునిమనవరాలు.
‘‘ఏడుపొచ్చీసింది దానంతకదే! నా కెవరూ చెప్పనయినా లేరు పెళ్లికూతురు బొమ్మ నాది. పెళ్లికొడుకు బొమ్మ మా వొదినది. అదీ నా ఈడుదే. వియ్యపురాలితనం ఇంతా అంతా చేసిందా. అలకల మాలక్ష్మి అంటే అదే వెయ్యి వియ్యాలరింపులు వియ్యారించుకొని ప్రాణాలు రాచి రంపాన పెట్టింది. అప్పగింతల వేళరాగానే– ‘‘వెళ్లిపోతాం బళ్లు కట్టించియ్యండి’ అని గంగవెర్రులెత్తించింది. నా కూతురు అత్తారింటి కెళ్లిపోతుందర్రా అని నేనొక్కటే ఏడుపు! ఆ బొమ్మల పెళ్లితో నా సరదాలన్నీ సరి. మరి నాలుగు నెలలైనా తిరక్కండానే పెళ్లి అయిపోయింది. అనుకోకుండా నాకు కళ్యాణధార కొట్టుకొచ్చింది.’’ అని జాలిగా చెప్పింది ముత్తవ్వ.
తన కళ్యాణ విషయం సంతోషంగా చెప్పలేదు!
‘‘బొమ్మల పెళ్లి సరదాగా అయింది. తరువాత నీకు పెళ్లైంది’’ అన్నాడు మునిమనవడు.
‘‘పెళ్లే అయింది నాయనా! ఆడదాని బతకంత హీనం మరొహటి లేదు’’ అంది ముత్తవ్వ.
‘‘తవ్వా, నిన్ను ముసీలి మొగుడికిచ్చేరు కదూ?’’ అన్నాది మునిమనవరాలు.
‘‘మొగాడికి ముసిలేనిటి తల్లీ ఆడదాని కైదోనతం ఉండాలి కాని’’ అన్నాది ముత్తవ్వ.
‘‘మీ నాన్న అంత గొప్ప కరణంగారు కదా ముసిలాడి కెందుకిచ్చాడు?’’ అనడిగింది మునిమనవరాలు.
‘‘ఇవ్వక తప్పుతుందా? ఆయనెవరో అనుకున్నారా? మా పెద్ద మేనత్త పెద్ద కొడుకు. నడి వయస్సులో పెళ్లాం చచ్చిపోయియింది. ఉన్న మేనమామల కూతుళ్లలో పెద్దదాన్ని నేనే. వాణ్ణో ఇంటివాణ్ణి చెయ్యకపోతే ఎలాగ అని మా నాన్నే నడుం కట్టుకొని చేశాడు. ఆరోజులూ అభిమానాలువేరు’’ అన్నాది ముత్తవ్వ.
‘‘గొడవ గొడవ చేస్తున్నావు. ఓ మూల నుంచి తెల్లారిపోతున్నాది’’ అన్నాడు మునిమనవడు. వాడికి ముత్తవ్వ పెళ్లిగొడవ బోధ పడలేదు.
‘‘తెల్లారే పోయింది!...నాయన్నాయన ఒక్కసారి వీపు గోకి పెడుదూ. చివచివలాడిపోతున్నాది. దబ్బు దబ్బున చెప్పేస్తాను’’ అన్నాది ముత్తవ్వ.
‘‘గోకుతాను చెప్పీ’’ అని మనవడు వీపంతా బరుకూ బరుకూ బక్కిరీశాడు.
‘‘చచ్చేన్రోయ్‌ చచ్చేన్రోయ్‌! ఇహ చాలు. వీపంతా రాసి’’ అన్నాది ముత్తవ్వ.
‘‘పెళ్లి పూర్తయిందా? ఇహ చెప్పీ. జేగంట వేళైపోతున్నాది’’ అన్నాడు మనవడు.
వాళ్ల నాన్న సుస్వరంతో కంఠం బాగా ఎత్తి దేవతార్చన చేస్తున్నాడు. మహా నైవేద్యానికి వంటకాలన్నీ వాళ్లమ్మ నట్టింట్లో తెచ్చిపెట్టేసింది. బుడబుక్కల వాడు ఏ వీధిలోనో బుడబుడ బుక్కంటున్నాడు. దేవాలయంలోంచి గంటలు జేగంటలు బయల్దేరాయి.
‘‘ఎవరైనా సాయం ఉంటే బావుణ్ణు. ఆచారిగారు దద్ధోజనం చక్రపొంగలి హాయిగా పెడతారు’’ అన్నాడు మునిమనవడు.
‘‘మనింట్లో పిండివంట లేకపోతే కదా?’’ అన్నాది మనవరాలు.
‘‘తవ్వా చెప్పీ చెప్పీ’’ అని తొందరపడ్డాడు మనవడు.
ముత్తవ్వ కుంపట్లో నిప్పులన్నీ కూడదీసి మళ్ళా మొదలెట్టింది.
‘‘ఇహ నేముంది? అయేపోయింది. నాగవిల్లి బాగా వాయించీశాము. తెల్లవారుజామున పిల్లలందర్నీ దబదబా లేపేసి దబ్బూ దబ్బున చద్దన్నాలు పెట్టేశారు. మేము వొణ్ణాలు తింటూ ఉంటే వీధిలో భజంత్రీలు హోరెత్తుతూ వాయించారు బాకాలతో. మేము చూడకుండానే పెళ్లికూతుర్నీ పెళ్లికొడుకునీ సవారిలో ముందు పంపించేశారు. మేము వీధిలో కొచ్చేసరికి వీధి నిండా రెండెడ్ల గూడుబండ్లు పూసేసి సిద్ధంగా ఉన్నాయి.
గర్భిణి స్త్రీలకీ ప్రత్యేకంగా మేనాలు పందిట్లో ఉన్నాయి. మమ్మల్నో రెండెడ్ల బండీలో కుక్కీశారు. మాకు జ్ఞాపకం లేకపోయింది. తొందర తొందర. ఏమైనా తోస్తేనా? ఇహ బళ్లు కదలడానికి సిద్ధంగా ఉన్నాయి. మా వొదినకి జ్ఞాపక మొచ్చింది. ఏవిటి సాధనమంటే ఏవిటి సాధనం అనుకొని ఏం బుద్ధి అంటే ఏం బుద్ధి అనుకొని గుంజాటన పడిపోయాము.
బండి గూడు నుంచి ఈనె పీకి ముక్కులో పెట్టుకుని ‘‘హాచ్చీ’’ అని తుమ్మేను. ఇహ వరసగా తుమ్ము తరవాత తుమ్ము తుమ్ము తరవాత తుమ్ము!
మా నాన్న పెద్ద చేపాటికర్ర పట్టుకుని చుట్ట కాలుస్తూ పందిట్లో నిలబడి అందరికీ పనులు పురమాయిస్తున్నాడు.
‘‘ఎవరర్రా వెధవల్లారా తుమ్ములూ?’’ అన్నాడు.
ఒక పక్క నేనని తెలిస్తే చావబాత్తాడని భయం, ఇంకో పక్క తుమ్ములు నాన్న చెవిలో పడ్డాయని సంబరం! కుక్కిన పేనులాగా కిక్కురుమనకుండా కూర్చున్నాను. ముక్కులో దురద వొదలక మళ్లా తుమ్మొస్తూ ఉంటే ఓ బలవంతాన  ఆపుకొని చచ్చాను. అంతా మొహమొహాలు చూసుకొన్నారు. విసవిసలాడారు.
‘నయమే పెళ్లికొడుకు పెళ్లికూతురూ వెళ్లిపోయారు’ అని సముదాయించుకొన్నారు.
‘తుస్సుతుస్సుమని వెధవ తుమ్ములు’ అన్నాడు మా నాన్న.
గోల గోల అయిపోయింది. అందర్నీ దింపి అందరినీ కాళ్లు కడుక్కోమని కూచోపెట్టారు.
‘‘ప్రయాణానికి సిద్ధంగా ఉంటే బుద్ధీ జ్ఞానం లేకుండా ఎందుకు తుమ్మేవు? నీ బుర్ర చితగొట్టవలసింది’’ అన్నాడు మునిమనవడు.
‘‘విను విను చెపుతుంది’’ అన్నాది మునిమనవరాలు.
మనవడు అన్నమాట ముత్తవ్వకి మహాకోపం వచ్చింది.
ఆనాడు వాళ్లెవ్వరో అన్నట్టు ఈనాడు మనవడు బుద్ధీ జ్ఞానం లేదంటే ఉక్రోషం వొచ్చింది. పెద్దగొంతుకతో పళ్లు కొరుక్కుంటూ మనవడి మీద విరుచుకుపడ్డాది.
‘‘భడవా ఎందుకు తుమ్మేనా? నీ సొమ్మేం పోయింది. గండగత్తిర మాకొచ్చి పడ్డాది. ఇంత బొమ్మల పెళ్ళీ చేశామా? పెళ్లీ కూతుర్నీ పెళ్లికొడుకునీ గృహప్రవేశానికి తీసికెళ్లాలా? ఆ బొమ్మలు బొమ్మరింట్లో ఉండిపోయాయి. బండెక్కి మేము కూచున్నాం. దాంతో ప్రయాణం వో ఘడియ ఆగిపోయింది. దబ్బుదబ్బున బొమ్మరింట్లోకి పరిగేట్టేము. బొమ్మలు, సవారీ, మిగతా సరంజామా పెద్ద రంగురంగుల తాటేకుల బుట్టలో పెట్టి సిద్ధంగా ఉంచాము. అది పట్టుకు పందిట్లోకి పరిగెట్టేము’’ అని ముత్తవ్వ ఎందుకు తుమ్మిందో చెప్పింది.
తమ్ముల మాటైపోగానే క్షీరాన్నంలో  ఏలక పళ్ల వాసన ఘముఘమలాడుతూ వసారాలోకి వచ్చింది. వాళ్ల నాన్న దేవతార్చన మాత్రం ‘పాపాత్మా పాపసంభవా’లో పడి ‘రక్షో రక్షో మహేశ్వరా’ అనలేదు.
(రచనా కాలం: 1955)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement